Social Media Influencer Nikhil : ఇక్కడ చాలా విషయాలు దాచలేం..
ABN, Publish Date - May 19 , 2024 | 02:29 AM
ప్రస్తుతం సోషల్ మీడియా చాలా విస్తృతంగా వ్యాపిస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తోంది. ఒకప్పుడు బుల్లి తెర నటులకు స్టార్‌డమ్ వచ్చినట్లే- సోషల్ మీడియాలో స్టార్స్‌కు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది.వారిలో కొందరు సినిమాలలోకి ప్రవేశిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా చాలా విస్తృతంగా వ్యాపిస్తోంది. దీని ప్రభావం అన్ని రంగాలపైనా కనిపిస్తోంది. ఒకప్పుడు బుల్లి తెర నటులకు స్టార్‌డమ్ వచ్చినట్లే- సోషల్ మీడియాలో స్టార్స్‌కు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది.వారిలో కొందరు సినిమాలలోకి ప్రవేశిస్తున్నారు.అలాంటి ఇన్‌ఫ్లుయన్సర్స్‌లో ఒకరు నిఖిల్ విజయేంద్ర సింహ. మూడు వందలకు పైగా ఇంటర్వ్యూలతో లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్ననిఖిల్ సినిమా హీరోగా కూడా మారాడు. ఈ నేపథ్యంలో- ప్రస్తుతం సోషల్ మీడియాలో పరిస్థితుల గురించి ‘నవ్య’కు వివరించారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌గా ఉన్న మీరు హీరోగా రంగ ప్రవేశం చేయడం ఎలా జరిగింది?
చిన్నప్పటి నుంచి నాకు కళారంగం అంటే చాలా ఇష్టం. అమ్మ కూడా నన్ను ఎంతో ప్రోత్సహించేది. స్కూల్లో, కాలేజీలో అనేక కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనేవాడిని. నేను వైజాగ్ గీతమ్ కాలేజీలో చదివాను.
ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. నా రెజ్యూమ్ పట్టుకొని ఎన్నో ఆఫీసులకు తిరుగుతూ ఉండేవాడిని. ఒకరోజు అనుకోకుండా ఒక డిజిటల్ మీడియా సంస్థకు వెళ్లాను. అక్కడ నాకు తొలి అవకాశం లభించింది.
నేను ఎప్పుడూ డిజిటల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్ కావాలని అనుకోలేదు. అనుకోకుండా అయ్యా. తెలుగు సినీ రంగంలో పెద్ద పెద్ద స్టార్స్ అందరినీ ఇంటర్వ్యూలు చేశా. ఆ మధ్య నాకు బెంగుళూరు నుంచి ఒక కాల్ వచ్చింది.
‘‘లహరీ ఫిల్మ్స్ వారు సినిమా తీస్తున్నారు.. మీరు బెంగుళూరుకు వస్తే కథ చెబుతాం’’ అన్నారు. బెంగుళూరుకు వెళ్లా. కథ బాగా నచ్చింది. వెంటనే ఒప్పేసుకున్నా.
డిగ్రీ చదివిన పిల్లలు ఉద్యోగాలు చేయాలని తల్లితండ్రులు అనుకుంటారు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్ అవుతానంటే ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పలేదా?
అమ్మ రాజముఖి, నాన్న వరప్రసాద్ - నాకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్‌గా ఉన్నారు. అమ్మ సూర్యావతి ఎన్‌జీఓలో పనిచేసేది. బాగా గిటార్ వాయిస్తుంది.
నన్ను కూడా చిన్నప్పటి నుంచి డ్యాన్స్, మ్యూజిక్ క్లాసుల్లో చేర్చింది. నాన్నకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ఆయన కూడా చిన్నప్పటి నుంచి నన్ను ప్రొత్సహించారు.
మా అన్నయ్య కుద్రు సినీ దర్శకుడు. ‘హాయ్ నాన్న’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం సినిమాలు, సోషల్ మీడియా వెనక తిరుగుతూ ఉండేవాళ్లం.
అమ్మ, నాన్నల స్నేహితులు- ‘‘ఏంటి... మీ వాళ్లిద్దరూ ఆ దారిలో వెళ్లారు...అక్కడ సక్సెస్ చాలా కష్టం కదా..’’ అనేవారు. కానీ వాళ్లు ఎప్పుడూ ఆ మాటలను పట్టించుకోలేదు. మాకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు.
రీల్స్, ఇన్‌స్టా, యూట్యూబ్- ఇలా సోషల్ మీడియా అంటే చాలామందిలో ఒక చిన్న చూపు కనిపిస్తూ ఉంటుంది. ‘‘రీల్స్ చేయటం సులభమేగా!’’ అంటూ ఉంటారు. దీనిలో నిజమెంత?
ఒక సినిమాకు ఎంత కష్టపడతామో, ఒక యూట్యూబ్ షూట్‌కు అంత కష్టపడాల్సి ఉంటుంది. కెమెరా, మేకప్, లైటింగ్, సౌండ్- ఇలా అన్నీ కుదరకపోతే మంచి యూట్యూబ్ కంటెంట్ రాదు.
బహుశా నిడివి తక్కువగా ఉండటం వల్ల చాలామందికి దాని వెనక ఉన్న కష్టం తెలియదు. రీల్స్ చేయటం కూడా చాలా కష్టం.
నేను వచ్చినప్పుడు యూట్యూబ్ అంటే కొంత చులకన భావం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయి. సోషల్ మీడియా వ్యాప్తి బాగా పెరిగింది. లక్షల మంది వీటిని ఫాలో అవుతున్నారు.
యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో లక్షల మంది సబ్‌స్కైబర్స్ కనిపిస్తూ ఉంటారు. ఈ సంఖ్యలను ఎంత వరకు నమ్మవచ్చు?
కొందరు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా సబ్‌స్ర్కైబర్స్‌ను కొనుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇది ఇన్‌స్టాలో ఎక్కువగా జరుగుతుంది. యూట్యూబ్‌లో తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయేమేమిటంటే- మనకు లక్షల సబ్‌స్ర్కైబర్స్ ఉన్నట్లు చూపించి మోసం చేయలేం.
ఉదాహరణకు ఒకరికి మిలియన్ సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారనుకుందాం. ఆమె ఒక పోస్ట్ పెడితే వంద లైక్‌లు వస్తే- ఎక్కడో తేడా ఉన్నట్లే లెక్క కదా! సోషల్ మీడియాలో చాలా విషయాలను దాచలేం.
అంతేకాకుండా ఇలా సబ్‌స్ర్కైబర్స్‌ను కొనుక్కుంటే- మానిటైజేషన్ (యూట్యూబ్ ద్వారా సొమ్ము పొందటం) విషయంలో సమస్యలు ఏర్పడతాయి.
ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్‌ల వల్ల అనేక మంది నష్టపోతున్నారు. వీటిని కొందరు ఇన్‌ఫ్లుయన్సర్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా... దీనిపై మీ అభిప్రాయమేమిటి?
నా ఉద్దేశంలో బెట్టింగ్ లాంటివి వ్యక్తిగతమైన విషయాలు. ఇది కూడా పేక ఆడటం లాంటిదే. దీనికి రెండు కోణాలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయన్సర్స్ - జాగ్రత్తగా ఉండమని ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా చెబుతారు.
ఇక రెండోది- కొందరు ఇన్‌ఫ్లుయన్సర్స్‌కు ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. వారికి జీవనాధారం వేరే ఏదీ ఉండదు. ఆ సమయంలో బెట్టింగ్ యాప్‌ల వారు ప్రమోషన్ చేస్తే ఎక్కువ మొత్తం డబ్బులు ఇస్తామంటారు.
దాంతో వారు ప్రమోషన్ చేయటానికి మొగ్గు చూపుతారు. వేల మంది ఇన్‌ఫ్లుయన్సర్స్ ఉంటే టాప్‌లో ఉన్న కొందరు మాత్రమే వీటిని ప్రమోట్ చేస్తారు. ఈ మధ్య కాలంలో దీనిపై వివాదం నెలకొన్న తర్వాత చాలామంది వీటిని ప్రమోట్ చేయటానికి ఇష్టపడటం లేదు.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
Updated Date - May 19 , 2024 | 02:51 AM