Nara Lokesh: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
ABN , Publish Date - Nov 05 , 2024 | 07:16 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉపాది అవకాశాలు కల్పించడంలో భాగంగా ఐటీ,విద్యా శాఖ మంత్రి అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రముఖ సంస్థల అధినేతలు, సీఈవోలతో నారా లోకేశ్ వరుస భేటీలు నిర్వహించారు. అలాగే అట్లాంటాలో నిలువెత్తు ఎన్టీఆర్ విగ్రహాన్ని నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ రెడ్ బుక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అట్లాంటాలోని కమ్మింగ్ పట్టణంలో సానీ మౌంటైన్ ఫార్మ్స్‌లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవిష్కరించారు. దీపావళి పర్వదినం రోజు.. అంటే అక్టోబర్ 31వ తేదీన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీగా ఎన్టీఆర్ అభిమానులు తరలి వచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని మనవడు నారా లోకేశ్ చేతులు మీదగా.. వేలాది మంది అభిమానుల సమక్షంలో జరగడంతో పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ కార్యక్రమానికి టీడీపీ శాసన సభ్యులు రాము వెనిగండ్ల (Gudivada MLA Ramu Venigandla), సురేశ్ కాకర్ల ( UdayaGiri MLA Suresh Kakarla), యార్లగడ్డ వెంకట్రావు (Gannavaram MLA Yarlagadda Venkata Rao), గాలి భాను ప్రకాష్ (Nagari MLA Gali Bhanu Prakash)తోపాటు ఎన్నారై టీడీపీ యుఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి తదితరలు హాజరయ్యారు.
ప్రత్యేక విమానంలో గెయిన్సివెల్ విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేశ్‌తోపాటు ఎమ్మెల్యేలకు అట్లాంటాలోని టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికాయి. అనంతరం భారీ ఊరేగింపుగా వారంత వేదిక ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం వ్యాఖ్యాతలు సుజాత ఆలోకం (Sujatha Alokam)తోపాటు వెంకి గద్దె (Venky Gadde) అందరికీ స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అందరూ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా (Hindu Temple of Atlanta) పండితులు పవన్ కుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నారా లోకేష్ రిబ్బన్ కటింగ్ చేయడంతో.. ఆహ్వానితుల కరతాళ ధ్వనులు నడుమ.. ఎన్టీఆర్ విగ్రహానికి ముసుకు తొలగించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఎన్టీఆర్ విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు. సరిగ్గా అదే సమయంలో.. ఆకాశంలో హెలికాఫ్టర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహంపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా జై ఎన్టీఆర్, జై లోకేశ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లి పోయింది.
అనంతరం అట్లాంటాలోని ఎన్టీఆర్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాస్ లావు (Srinivas Lavu) మాట్లాడుతూ.. తమ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలతో పాటు అందిస్తున్న సంక్షేమ పథకాలకు సైతం సోదాహరణగా వివరించారు. అన్న ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలనే తలంపు తమకు కలిగిందని పేర్కొన్నారు.
అట్లాంటాలో అన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని గుడివాడ ఎమ్మెల్యే, అట్లాంటా వాసి రాము వెనిగండ్ల అన్నారు. ఈ కార్యక్రమం మంత్రి నారా లోకేష్ చేతుల మీదగా జరగడం మరింత ఊపు తెచ్చిందని తెలిపారు. ఐటీ మినిస్టర్‌గా లోకేశ్‌కి ఉన్న పరిజ్ఞానంతోపాటు 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన కోసం రేయింబవళ్లు ఆయన పడుతున్న కష్టం మరువలేనిదన్నారు.
ఇక ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం పట్ల ఎన్నారై టీడీపీతోపాటు అట్లాంటా నాయకులను ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ కాకర్ల అభినందించారు. గతేడాది నారా లోకేష్ యువగళంతోపాటు ఎన్నికల నాటి పరిస్థితులు, రాష్ట్రంలోని స్థితిగతులను ఈ సందర్బంగా ఆయన ప్రస్తావించారు.
అలాగే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ… ఎంతో మంది యవ్వన దశలో పార్టీలు స్థాపించారని.. కానీ ఒక్క ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao - NTR) మాత్రమే 60 సంవత్సరాల వయసులో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పార్టీ స్థాపించి విజయం సాధించారని గుర్తు చేశారు. నాడు ఎన్టీఆర్ చేతుల మీదుగా చేపట్టిన పలు సంక్షేమ పథకాలు నేటికి కొనసాగుతున్నాయని వివరించారు. దటీజ్ ఎన్టీఆర్ అని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎన్నారైలకు ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను గాడిలో పెట్టే సత్తా ఒకే ఒక్కడు, సీఎం చంద్రబాబు నాయుడికి, నారా లోకేశ్‌కు మాత్రమే ఉన్నాయన్నారు.
ఎన్నారై టీడీపీ యుఎస్ఏ (NRI TDP USA) కోఆర్డినేటర్, కాలిఫోర్నియా బే ఏరియా వాసి జయరాం కోమటి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ఎన్నారైలు అందించిన సహాయ సహాకారాలను ఈ సందర్బంగా ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో ఎన్నారైలంతా టీడీపీ(Telugu Desam Party)తోపాటు రాష్ట్రాభివృధికి కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
చివరిగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, హెచ్ఆర్డి మంత్రి, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఎన్నారై (NRI) అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్ (MRI) అని అభివర్ణించారు. ఏమీ ఆశించకుండా పార్టీ కోసం.. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నారని వారి సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్బంగా యువత ప్రస్తావించిన రెడ్ బుక్ అంశంపై నారా లోకేశ్ స్పందించారు.
అలాగే ఇటీవల జరిగిన ఎన్నికల్లో 92 శాతం సీట్లు రావడంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. అలాగే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించామని వివరించారు. అయితే చట్టాన్ని ఉల్లంఘించి తప్పులు చేసిన వారిని మాత్రం వదిలే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టారు. ఇప్పటికే రెడ్ బుక్ చాప్టర్ 1, 2 ఓపెన్ అయ్యాయన్నారు. త్వరలో చాప్టర్ 3 ప్రారంభంకానుందని స్పష్టం చేశారు. కొంచెం ఓపికగా ఉండాలని ఈ సందర్భంగా నారా లోకేశ్ పేర్కొన్నారు.
చివరగా అతిథులందరినీ NTR Trust Atlanta (http://ntrtrustatlanta.org/) సభ్యులు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరితో నారా లోకేశ్ ఫోటోలు దిగారు. అనంతరం ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన భరత్ మద్దినేని (Bharath Maddineni), మధుకర్ యార్లగడ్డ (Madhukar Yarlagadda)లను నారా లోకేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఇంతగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహాకులు ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా (http://ntrtrustatlanta.org/) ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించింది.
For NRI news And Telugu News