Texas: ఘనంగా 53వ టెక్సాస్ సాహిత్య సదస్సు.. సంగీతంలో మునిగి తేలిన సాహితీ ప్రియులు..
ABN, Publish Date - Sep 30 , 2024 | 03:19 PM
డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ ఆధ్వర్యంలో ''నెలనెలా తెలుగువెన్నెల", తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు, 53వ టెక్సాస్ సాహిత్య సదస్సు టెక్సాస్ నగరంలో ఘనంగా నిర్వహించారు.
టెక్సాస్: డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ ఆధ్వర్యంలో ''నెలనెలా తెలుగువెన్నెల", తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు, 53వ టెక్సాస్ సాహిత్య సదస్సు టెక్సాస్ నగరంలో ఘనంగా నిర్వహించారు. 'న భూతో న భవిష్యత్' అన్నట్లుగా ఈ సంగీత సాహిత్య సమలంకృత నెలనెలా తెలుగు వెన్నెల సదస్సు సాగింది. ముందుగా టాంటెక్స్ పాలకమండలి సభ్యుడు, సాహితీ వేదిక సమన్వయ కర్త దయాకర్ మాడా స్వాగతోపన్యాసం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవలే మృతిచెందిన ప్రముఖ సినీ లలిత గీతాల రచయిత కీ.శే.వడ్డేపల్లికృష్ణను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అలాగే నిముషంపాటు మౌనం పాటించి పలువురు వక్తలు వడ్డేపల్లి కృష్ణతో వారికున్న అనుబంధాన్ని పంచుకొన్నారు. మెుదటగా శ్రీరామ చంద్రమూర్తిని స్తుతిస్తూ పురందరదాసు రచించిన కన్నడ ''రామ నామ ఉమ్మే'' అనే భక్తి గీతాన్ని చిరంజీవి సమన్విత తన మధుర కంఠంతో అద్భుతంగా పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యంలో ముంచారు.
అనంతరం మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ శ్రీమతి అద్దేపల్లి సుగుణ ''సాహిత్యంలో నారీభేరీ'' అంశంపై ప్రసంగించారు. ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులపై ఆమె సుస్పష్టమైన వివరణ ఇచ్చారు. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ''రామాయణ కల్పవృక్షం'' కావ్య వైశిష్ట్యాన్ని సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ శ్రోతలకు వివరించారు. కవి సామ్రాట్ బిరుదాంకితులైన విశ్వనాథ సత్యనారాయణ తెలుగు పడికట్టును, పలుకుబడిని ఆమహాకావ్యంలో సజీవంగా ప్రతిబింబించేలా ప్రసంగించారు. అలాగే ఆయన రచనల్లోని తెలుగు భాషా మాధుర్యాన్ని సవివరణాత్మక ఉపన్యాసంలో పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి 77నెలలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ''మన తెలుగు సిరి సంపదలు'' అందరినీ ఆకట్టుకుంది. అలాగే ఈ కార్యక్రమంలో పాలపర్తి శ్యామలానంద పలు ఆసక్తికర పొడుపు ప్రశ్నలు సంధించి సాహితీ ప్రియుల నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా ఆయన వేసిన పలు ప్రశ్నలు అందరినీ ఆలోచింపజేశాయి.
ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు వివిధ అంశాలపై మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. మహాకవి గురజాడ 162వ జయంతిని పురస్కరించుకుని ఆయన రచనల్లోని ఆధునికత, శాస్త్రీయ దృష్టి గురించి ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ వివరించారు. కన్యాశుల్కం నాటకం ద్వారా ఆనాటి సమాజంలో పేరుకుపోయిన ద్వంద ప్రమాణాలను కపటత్వాన్ని మహాకవి గురజాడ ఎండగట్టిన తీరును సోమసుందర్ అద్భుతంగా వివరించారు. ప్రాథమిక విద్యాస్థాయిలో తెలుగు బోధనా భాషగా ఉండాలని ఆయన కోరారు. విశ్వ మానవుడు సంజీవ్ దేవ్ ఆలోచనా సరళిని అర్థం చేసుకోవాలని ప్రముఖ సాహితీ విశ్లేషకులు బి.లలితానంద ప్రసాద్ కోరారు. అనంతరం సాహిత్యంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి చేసిన కృషి, ఆయన రచన ప్రతిభను నరేందర్ చక్కగా విశ్లేషించారు. ''సాహిత్యం, దాని ప్రభావం-మానవ జీవన పరివర్తన'' అనే అంశంపై విట్టల్ రామశర్మ ప్రసంగించారు. ''శ్రీ రామ రక్ష'' అంశంపై డాక్టర్ వెంకట నక్తరాజు ప్రసంగం, ''సమాజంపై గురువుల ప్రభావం'' అంశంపై శ్రీరామకృష్ణ శర్మ ప్రసంగం, శ్రీనివాస్ ఇరువంటి చదివి వినిపించిన ''శ్రీమతి ప్రేమలేఖ'' కథ సాహితీ ప్రియుల మనసులను రంజింప చేశాయనడంలో సందేహం లేదు.
అనంతరం వేటూరి, దాశరథి, వడ్డేపల్లి కృష్ణ రాసిన సినీ గీతాలను చంద్రహాస్ మద్దుకూరి, ఆకునూరి శారద, డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి బృందం అద్భుతంగా ఆలపించారు. గురజాడ రచించిన ''దేశమును ప్రేమించుమన్నా'' గేయాన్ని దయాకర్ మాడ, డాక్టర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల, చంద్రహాస్ మద్దుకూరి బృందం శ్రావ్యంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ ఇటీవల ప్రచురితమైన నాలుగు పుస్తకాలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా టాంటెక్స్ అధ్యక్షుడు సతీశ్ బండారు సంస్థ ఔన్నత్యానికి ఆర్థికంగా, హార్దికంగా తోడ్పడుతున్న పోషక దాతలకూ, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుచికరమైన విందు భోజనం అందించిన 'సింప్లి సౌత్' యాజమాన్యానికి, అందుకు కృషి చేసిన శ్రీకాంత్ పోలవరపు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా సతీశ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు రఘునాథరెడ్డి కుమ్మెత, వీర లెనిన్ తుల్లూరి, సంస్థ పూర్వాధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, చంద్ర కన్నెగంటి, చిన సత్యంతోపాటు పుదూర్ జగదీశ్వరన్, రమణ జువ్వాడి, శ్రీధర్, సుమ, సాయి, కిరణ్మయి, గౌతమి, స్వర్ణ పాల్గొన్నారు. డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, టెంపుల్ నగరాల నుంచి అనేక మంది సాహితీ ప్రియులు కార్యక్రమంలో పాల్గొన్ని సదస్సు విజయవంతం చేశారు. కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు సతీశ్ బండారు, సమన్వయకర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి, అధికార కార్యవర్గ బృందం సభ్యులను పలువురు అభినందించారు.
Updated Date - Sep 30 , 2024 | 03:25 PM