Rythu Pandaga: మహబూబ్‌నగర్ జిల్లాలో రైతు పండుగ
ABN , Publish Date - Dec 01 , 2024 | 07:01 PM
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో రైతు పండుగ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు పండగ విజయవంతమైంది. తొలి రెండురోజులు రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఇక, చివరి రోజు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన సభ సూపర్ సక్సెస్ కావడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.
లక్ష మంది రైతులతో సభ నిర్వహించాలని నేతలు భావించగా అదే సంఖ్యలో జనం తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునే రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.
ఇక, సీఎం రాకకు ముందే సభా ప్రాంగణం కూడా జనంతో నిండిపోయింది. ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తయ్యే వరకు రైతులు, ప్రజలు అక్కడి నుంచి కదలలేదు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ రైతు పండగ విజయవంతంగా ముగియడంతో మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి నేతృత్వంలో యంత్రాంగం ఈ రైతు పండగ కోసం పది రోజులకు పైగా శ్రమించింది.
రైతులు బీఆర్‌ఎస్ పన్నిన ఉచ్చులో పడొద్దని, ఆ పార్టీ నేతలు చెప్పే మాయమాటలు నమ్మి కేసుల పాలు కావొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. భూసేకరణ చేయకుండా పరిశ్రమల ఏర్పాటు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
చరిత్రలో ఎక్కడా భూసేకరణ చేయనట్లుగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వారి హయాంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌కు భూసేకరణ చేయలేదా అని నిలదీశారు.
Updated Date - Dec 02 , 2024 | 02:42 PM