BRS: కారు పార్టీని కంగారెత్తిస్తున్న ‘ఆరు’.. మరో ఆరుగురు జంప్!
ABN, Publish Date - Jul 05 , 2024 | 12:35 PM
ఆరు.. ఇప్పుడు ఈ నంబర్ కారు పార్టీలో (BRS) కంగారెత్తిస్తోంది..! ఇంకా చెప్పాలంటే గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (KCR) గుబులెత్తిస్తోంది..! ఎందుకంటే.. అంతలా బీఆర్ఎస్‌ను ఈ నంబర్ ఇబ్బంది పెడుతోంది.. అంతకుమించి వణికించేస్తోంది..!
ఆరు.. ఇప్పుడు ఈ నంబర్ కారు పార్టీలో (BRS) కంగారెత్తిస్తోంది..! ఇంకా చెప్పాలంటే గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు (KCR) గుబులెత్తిస్తోంది..! కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు.. అయినా ఇప్పుడీ నంబర్ అంటేనే బేజారుగా ఉందట. ఎందుకంటే.. అంతలా బీఆర్ఎస్‌ను ఈ నంబర్ ఇబ్బంది పెడుతోంది.. అంతకుమించి వణికించేస్తోంది..! నంబరేంటి.. ఇబ్బందేంటనే సందేహాలు వస్తున్నాయ్ కదూ..! అవునండోయ్.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే..! ఇంతకీ ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్పెషల్ స్టోరీ చకచకా చదివేయాల్సిందే మరి..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎలక్షన్‌లో అయినా పరువు నిలుపుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. దీంతో పార్టీలో క్రమంగా పరిస్థితులు మారిపోతూ వచ్చాయి. అయితే.. అంతకుమించి ఘోరమే చవి చూసిందే తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వాస్తవానికి.. అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి జంపింగ్‌లు పెద్ద ఎత్తునే మొదలయ్యాయి. అది కాస్త అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత ఎక్కువైంది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సిట్టింగ్‌లు, టికెట్లు దక్కించుకున్న వాళ్లు సైతం ‘కారు’ దిగేసి కాంగ్రెస్ (Congress) కండువా కప్పేసుకోవడంతో హైకమాండ్ కంగుతిన్నది. ఎలాగో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ ఒక్కటంటే ఒక్కటీ గెలవలేదు. దీంతో ఇక బీఆర్ఎస్ ఉంటుందా.. ఊడిపోతుందా అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయని ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జంప్ చేయడం మొదలుపెట్టారు.
కాంగ్రెస్‌లోకి మరో ఐదుగురు!
ఆరు అంటేనే..?
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మొదలై.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసుల రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇలా మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఈ షాక్ నుంచి తేరుకోకమునుపే.. ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు దండే విఠల్, భాను ప్రసాద్, ఎం.ఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేష్, బొగ్గవరపు దయానంద్, బసవరాజ్ సారయ్యలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ‘కారు’ దిగితే.. ఎమ్మెల్సీలు ఒకేసారి ఆరుగురు ఇలా జంప్ కావడం హైకమాండ్‌కు ఊహించని షాకేనని చెప్పుకోవచ్చు. దీంతో ‘ఆరు’ అనే నంబర్ అంటేనే.. గులాబీ దళం బెంబేలెత్తిపోతున్నదని కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. అంటే కేసీఆర్‌కు ఇష్టమైన లక్కీ నంబర్‌తోనే కాంగ్రెస్ కొడుతోందన్న మాట.
ఆరు.. ఆరు.. మరో ఆరు..!
ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు జంప్ అయిన తర్వాత మరో ‘ఆరు’గురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు ఆ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి. అయితే ఈ ఆరుగురు కూడా బీఆర్ఎస్ బిగ్ షాట్‌లే.. అందులోనూ పార్టీ హైదరాబాద్ సిటీకి చెందిన వారే కావడంతో గులాబీ దళం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తయితే వీరంతా అప్పట్లో రేవంత్‌తో కలిసి పనిచేసినవాళ్లే.. తిరిగి ఒక గూటికి చేరిపోతున్నారు! ఆ ‘ఆరు’ అనే నంబర్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మా రెడ్డి, అరికెపూడి గాంధీ ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీరంతా అతి త్వరలోనే బీఆర్ఎస్‌కు బై బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటారని టాక్ నడుస్తోంది. మరోవైపు.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన కూడా చేసేశారు.
కారు బేజారు..!
తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. త్వరలో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా చర్చ నడుస్తున్న ఈ తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే సీనియర్ నేత, సిటీలో పట్టున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిపోవడంతో.. అదే దారిలో మరికొందరు పార్టీ మారుతారన్న వార్తలు హైదరాబాద్‌లో పెద్ద చర్చనీయాంశమే అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇవాళ్టి సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశానికి హాజరయ్యేది ఎవరు..? డుమ్మా కొట్టేది ఎవరు..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పగలబడి నవ్విన చంద్రబాబు!
సమావేశానికి వచ్చినా..?
ఇప్పటికే.. పార్టీ మారుతారన్న ఎమ్మెల్యేల్లో కొందరు తెలంగాణ భవన్‌కు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఒక్కొక్కరుగా కార్పొరేటర్లు కూడా సమావేశానికి వస్తున్నారు. అయితే.. తాము పార్టీ మారట్లేదని సందేశం ఇచ్చేందుకే ఈ మీటింగ్‌కు హాజరవుతున్నట్లు ఓ చర్చ అయితే నడుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా.. నగరంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, తాజా పరిణామాలు, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ఈ కీలక సమావేశానికి తలసాని నేతృత్వం వహిస్తున్నారు. అయితే.. మీటింగ్‌కు ఎమ్మెల్యేలు వచ్చినప్పటికీ చేరిక మాత్రం తప్పకుండా ఉంటుందని కాంగ్రెస్ లీకులు ఇస్తోంది. చూశారుగా.. ఇదీ ఆరు.. సారు.. కారు.. బేజారు కహానీ..! బీఆర్ఎస్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఏంటో..!
ఖాళీ అవుతున్న ‘కారు’ పార్టీ..
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 05 , 2024 | 01:19 PM