Bandi Sanjay: కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ విలీనం.. బాంబ్ పేల్చిన బండి
ABN, Publish Date - Aug 16 , 2024 | 04:12 PM
తెలంగాణలో ‘విలీనం’ పై గట్టిగానే రాజకీయాలు నడుస్తున్నాయ్..! అదిగో ఫలానా పార్టీ.. ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటే.. అబ్బే మీరు మీరే ఒకటి కాబోతున్నారని మరో జాతీయ పార్టీ అంటోంది..! ఈ విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ అన్నింటిలోనూ కామన్‌గా బీఆర్ఎస్ పార్టీ ఉంది..! బీజేపీతో బీఆర్ఎస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయన్నది కొన్నేళ్లుగా నడుస్తున్నదే..!
న్యూ ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ‘విలీనం’ పై గట్టిగానే రాజకీయాలు నడుస్తున్నాయ్..! అదిగో ఫలానా పార్టీ.. ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటే.. అబ్బే మీరు మీరే ఒకటి కాబోతున్నారని మరో జాతీయ పార్టీ అంటోంది..! ఈ విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ అన్నింటిలోనూ కామన్‌గా బీఆర్ఎస్ పార్టీ ఉంది..! బీజేపీతో బీఆర్ఎస్‌కు (BJP, BRS) సన్నిహిత సంబంధాలున్నాయన్నది కొన్నేళ్లుగా నడుస్తున్నదే..! అయితే ఈ మధ్య బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ ఓ రేంజిలో బంతాట ఆడుకుంటోంది. రుణమాఫీ చెప్పిన టైమ్ కంటే చేసేయడం.. రాజీనామా చేస్తానన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ముహూర్తం ఎప్పుడు అంటూ మాట్లాడటం ఇలా రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌తో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ రాగా.. తాజాగా బీజేపీ నుంచి కౌంటర్ వచ్చేసింది. బీజేపీలో బీఆర్ఎస్ కాదు.. కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ (Congress, BRS) విలీనం కాబోతోందని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కాయి. బండి రిలీజ్ చేసిన ఈ ప్రకటనపై ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది.
కేసీఆర్, కేటీఆర్‌లను అరెస్ట్ చేయలేదేం?
‘అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం. కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతం. కవిత బెయిల్‌కు బీజేపీకి ఏం సంబంధం?. బీఆర్ఎస్‌ను వీలీనం చేసుకుంటే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వం.ఆప్ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా?. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ న్యాయస్థానాలపై బురదచల్లుతురా?. కవిత బెయిల్‌పై కావాలనే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?. నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరు ఉంది. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ రాజకీయ లబ్ది కోసం గౌరవ న్యాయస్థానంపై బురద చల్లి కోర్టుల ప్రతిష్టను తగ్గించడం దుర్మార్గం. బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు’ అని బండి సంజయ్ మండిపడ్డారు.
పదవులు కూడా..!
‘బీఆర్ఎస్ పార్టీది ముగిసిన అధ్యాయం. ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదు. బీఆర్ఎస్‌ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యం.కేసీఆర్ ను ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్‌ను పీసీసీ చీఫ్, హరీష్ రావుకు మంత్రి, కవితకు రాజ్యసభ పదవులు ఖాయం. అంత ఉబలాటముంటే రాజ్యసభ ఎన్నికలొస్తున్నందున కవితను కాంగ్రెస్ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలోనూ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడంతోపాటు మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ దాగుడు మూతల వ్యవహారం జగమెరిగిన సత్యం. సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం సహా అనేక అంశాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్ లను జైలుకు పంపాలి. కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలి. లేనిపక్షంలో దాగుడుమూతలాడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే.. జాతీయ పార్టీలు రెండూ బీఆర్ఎస్‌ను బంతాట ఆడుకుంటున్నాయి. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Updated Date - Aug 16 , 2024 | 04:26 PM