Alla Nani: ఆళ్ల నాని రాజీనామా వెనుక ఏం జరిగింది.. వాట్ నెక్స్ట్!?
ABN, Publish Date - Aug 10 , 2024 | 09:37 AM
ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్.. ఆ పార్టీనే కొన్నేళ్లుగా అంటి పెట్టుకుని వీర విధేయనేతగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేదిలేదని ప్రకటించారు. దీంతో ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యింది. ఇంతకుముందే..
ఏలూరులో వైసీపీకి (YSR Congress) బిగ్ షాక్.. ఆ పార్టీనే కొన్నేళ్లుగా అంటి పెట్టుకుని వీర విధేయనేతగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని (Alla Nani) వైసీపీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేదిలేదని ప్రకటించారు. దీంతో ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యింది. ఇంతకుముందే ఏలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు రాజీనామా చేయగా, ఇంకొందరు అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఆళ్ల నాని నిష్క్రమణతో మరి కొంతమంది పక్క చూపులు చూడక తప్పేటట్టులేదు.
నాడు.. నేడు!
వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు తమకు తిరుగేలేదన్నట్టుగా అంతా వెలగబెట్టారు. అంతా తమ కనుసన్నల్లోనే సాగి తీరాలంటూ ఆంక్షలు పెట్టిమరీ శపథం నెరవేర్చుకున్నారు. తాను అవునంటే అవును, కాదంటే.. కాదు అన్నవారినే దగ్గరకు చేర్చుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని దూరంగా జరిపారు. పార్టీలో లేకుండా చేశారు. అంతలా గడిచిన ఐదేళ్లల్లోను వైసీపీలో రాజకీయాలు తారాస్థాయికి వెళ్ళాయి. ఈ విషయంలో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీలో ఆళ్ల నాని ఏకఛత్రాధి పత్యం చేశారు. తాను చెప్పింది తూచా తప్పకుండా చేసే కొందరిని తనకు సన్నిహితంగా ఉంచుకున్నారు. ఆఖరుకు తాను ప్రయాణించే కాన్వాయ్‌లో సైతం ఎవరు ఏ స్థానంలో ఉండాలో కూడా నిర్దేశించే స్థాయికి ఎదిగారు. పైకి రాజకీయ వివాద రహితుడిగా పేరొందినా అంతర్గతంగా మాత్రం వైసీపీలో ఆయన చెప్పిందే వేదం అయ్యింది. ఎందుకనంటే.. ముఖ్య మంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి కొనసాగిన తరుణంలోను ఆళ్ల నాని అప్పట్లో ఆయనకు సన్నిహితులుగా ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్సార్ కుటుంబానికి ఆళ్ల నాని ఆది నుంచి సన్నిహితుడు. ఆయన నుంచే కొంత రాజకీయం ఆరా తీసేవారు.
కీలకంగా..!
విషయం బయట పడకుండా గుట్టుగా వ్యవహరించడం, వైఎస్ కుటుంబానికి విధేయడుగా ఉండడం, తనకంటూ ప్రత్యేక స్థానం ఇచ్చేలా జాగ్రత్త పడడంలో నాని తనకు తానే నిరూపించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజశేఖరరెడ్డి మర ణానంతరం వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌ను వీడి జగన్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఆళ్ల నాని చెప్పిందే ఆ పార్టీలో అక్షర సత్యమైంది. వైసీపీలో నేతల మధ్య సమన్వయం, అంతర్గత కలహాలు తీర్చడం, పార్టీ ఆదేశాలను చక్కబెట్టడంలో ఆయనకు జగన్ వద్ద మంచి మార్కులు లభించాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో నాని ఓట మి చెందారు. అప్పటికే ఆయన వరుసగా రెండుసార్లు ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. దీంతో నానిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమించడంతో పాటు ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాల్లో చురుకైన పాత్ర వహిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి మూడోసారి ఎన్నికైన ఆయనను జగన్ తన మంత్రి వర్గంలో వైద్య ఆరోగ్యశాఖతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తప్పుకున్నా ఏలూరులో ఆయన పట్టు సడలకుండా పార్టీ అధ్యక్ష హోదా లోనే కీలకంగా వ్యవహరించారు.
వైసీపీ ఖాళీ..!
ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనబోనని ఏలూరు సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని నిష్క్రమించడంతో ఆ పార్టీ ఖాళీ అయినట్టయ్యింది. ఎన్నికల ముందే నాని వ్యవహార శైలి నచ్చక పార్టీ సీనియర్ నేత ఏలూరు నగరంలో కీలకంగా ఉండే ఎంఆర్‌డీ బలరాం, ఆయన సతీమణి ఈశ్వరి జంటగా వైసీపీ నుంచి నిష్క్రమించారు. అప్పట్లో టీడీపీ పక్షాన బడేటి చంటికి పూర్తి మద్దతు ప్రకటించి ఆ పార్టీలో చేరారు. తన సతీమణి ఈశ్వరికి రెండోసారి కూడా ఈడా చైర్మన్‌గా కొనసాగించాలని కోరినా నాని తిరస్కరించడంతో ఎంఆర్‌డీ కుటుంబం నానిపై అసంతృప్తి ప్రకటించి టీడీపీలో చేరారు. ఆ తదుపరి ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఏలూరు నగర వైసీపీ కార్పొరేటర్లు కొందరు నానిని కాదని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎందుకిలా జరుగుతుందో వైసీపీ పట్టించుకోలేదు, అంతకంటే మించి నాని కూడా ఎవరుపోతే నాకేంటన్నట్టుగా మిన్నకుండి పోయారు.
అసలేం జరిగింది..?
వైసీపీ ఓటమి అనంతరం తమ భవిష్యత్ ఏమిటో తెలియక విలవిలలాడుతున్న ఏలూరు వైసీపీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మంచెం మైబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వీరిద్దరు సుదీర్ఘ కాలం పాటు ఆళ్ల నానికి అత్యంత సన్నిహితులు. దీంతో వైసీపీకి పడిన గండి మళ్ళీ పూడ్చకముందే ఏకంగా ఈసారి పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న నానియే పార్టీ పదవులకు శుక్రవారం రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి గడిచిన ఐదేళ్ళల్లో వైసీపీలో ఆళ్ల నాని పక్షాన కొందరు అంతర్గతంగా, ఆయనకు వ్యతిరేకంగా మరికొందరు కొనసాగుతూ వచ్చారు. నాని వైఖరి కొందరికి అయిష్టంగా ఉన్నా ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి. దీనికితోడు ఒకదశలో నానికి, అప్పటి ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు మధ్య విభేదాలు కొనసాగాయి. ఎంపీ వర్గాన్ని పక్కనపెట్టి మరీ నాని వర్గీయులు దూకుడుగా ముందుకు వెళ్ళడం పార్టీలో రచ్చకెక్కింది. దీనికితోడు నాని వెంట ఉండే ప్రత్యేక కోటరి కొందరిని మాత్రమే అనుమతించి మరికొందరిని దూరంగా నెట్టేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇలాంటి తరుణంలోనే ఏలూరు మేయర్ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు పార్టీ, నాని తీరుపై పూర్తి అసంతృప్తితో ఉండిపోయారు.
రాజీనామా సరే.. తర్వాతేంటి..?
ఏలూరులో వైసీపీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆళ్ల నాని తప్పుకున్నట్టు ప్రకటించడంతో ఆయన స్థానంలో వైసీపీ ఇన్‌చార్జి పదవి ఎవరికి ఇస్తారనే దానిపైనే ఇప్పటికే ఆ పార్టీలో చర్చ ఆరంభమైంది. ఆళ్ల నాని నిర్ణయం పార్టీని పూర్తిగా ఖాళీ చేసేలా చేసింది. ఇప్పటికే మూడొంతులు పార్టీ వర్గీయులు టీడీపీ, జనసేన వైపు అనుకూలంగానే ఉన్నారు. పార్టీకి రాజీనామా చేయకపోయినా ఈ రెండు పార్టీలతోనే సాన్నిహిత్యంగా ఉంటున్నారు. ఏలూరు మేయర్ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబులు, మరికొంతమంది కౌన్సిలర్లతో కలిసి త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపు ఆరంభమైంది. అంటే ఏలూరు నగర కార్పొరేషన్ టీడీపీ పరం కాబోతుందన్న మాట. దీనికి ఎమ్మెల్యే చంటి తగిన ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్టు చెబుతున్నారు. దీనికితోడు ఆళ్ల నానికి సమాం తరంగా ఇప్పుడు ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్నది పార్టీకి విషమ పరీక్షగానే భావించవచ్చు. ఆయన స్థానంలో ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, పోల వరం మాజీ సీనియర్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుల్లో ఒకరికి జిల్లా అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవికి ఈనెలాఖరులోపే ఎంపిక చేసే దిశగా కసరత్తు ఆరంభమైన తరుణంలోనే నాని తప్పు కోవడంతో ఈ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్ ఖరారైనట్టే. ఏలూరు ఇన్‌చార్జి పదవిని సీనియర్‌లలో ఒకరికి అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది.
Updated Date - Aug 10 , 2024 | 09:44 AM