Jaggayyapeta: సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి.. ‘తాతయ్య’ అరుదైన రికార్డు!
ABN, Publish Date - Jun 10 , 2024 | 08:34 AM
జగ్గయ్యపేట చరిత్రలో మునిసిపల్ చైర్మన్‌లుగా పనిచేసిన వారికి రాజకీయ భవిష్యత్ మృగ్యం అన్న అపవాదు, సెంటిమెంట్‌ను తాతయ్య తుడిచేశారు. జగ్గయ్యపేట పురపాలక సంఘంగా ఏర్పడినప్పడి నుంచి పనిచేసిన చైర్మన్‌లు ఎవరు తర్వాత రాజకీయాల్లో రాణించలేదు...
జగ్గయ్యపేట (Jaggayyapeta) అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఒకసారి వద్దని ఓటరు తీర్పు చెప్పాక మళ్లీ ఆ అభ్యర్థి గెలిచిన దాఖలాలు లేవు.. గత 2019 ఎన్నికలలో ఆ రికార్డును చేరిపేసిన సామినేని ఉదయభాను సరసన శ్రీరాం తాతయ్య (Shreeram Rajgopal Tatayya) కూడా చేరారు. అప్పటి వరకు ఓటమి ఎరుగని శ్రీరాం తాతయ్య 2019 ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చవిచూశారు. ఒకసారి ఓడి పోయిన వారిని తిరిగి అందలం ఎక్కించని పేట ఓటర్లు 2024లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయభానును కాదని తాతయ్యకే మూడోసారి పట్టం కట్టారు. ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన శ్రీరాం తాతయ్య అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
చరిత్రను పరిశీలిస్తే..!
1951లో జగ్గయ్యపేట నియోజకవర్గం ఏర్పడింది. తొలిసారి ఎమ్మెల్యేగా పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ఎన్నిక కాగా 1957లో పునర్విభజనతో కనుమరుగైన నియోజకవర్గం 1962లో మళ్లీ పునరుద్దరించబడి ఎస్టీకి రిజర్వ్‌గా కాగా గాలేటి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. 1967లో జనరల్ కాబడిన నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి, స్వాతంత్ర సమరయోధుడు రేపాల బుచ్చిరామయ్య శ్రేష్టి విజయం సాధించారు. 1972లో ఆయన కాంగ్రెస్ తరపున పోటీచేయగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ముక్త్యాల రాజా వీఆర్‌జీకే ఎం.ప్రసాద్ విజయం సాధించారు. కొద్దికాలానికే రాజా మృతి చెందటంతో జరిగిన ఉప ఎన్నికలో రాజా సతీమణి, కాంగ్రెస్ నుంచి రేపాల పోటీ చేయగా, మళ్లీ రాజా సతీమణి రాజ్యలక్ష్మమ్మ విజయం సాధించింది. 1978లో కాంగ్రెస్ తరపున బొద్దులూరి రామారావు విజయం సాధించగా, 1983లో టీడీపీ అభ్యర్ధి అక్కినేని లోకేశ్వరరావు చేతిలో పరాజయం పొందారు. ఆ తర్వాత ఆయన రాజకీయ అవకాశాలు దక్కలేదు. 1985లో తెలుగుదేశం అభ్యర్ధిగా నెట్టెం రఘురాం పోటీ చేయగా, కాంగ్రెస్ తరపున ముక్కపాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి పరాజయం పొందారు. అదే ముక్కపాటి తిరిగి 1994లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి నెట్టెం రఘురాం విజయం సాధించారు. ముక్కపాటిని ఓడించిన ప్రజలు మళ్లీ పట్టం కట్టలేదు.
టీడీపీ, కాంగ్రెస్ మధ్యే..!
1999, 2004లలో టీడీపీ అభ్యర్ధిగా నెట్టెం రఘురాం, కాంగ్రెస్ అభ్యర్థి సామినేని ఉదయభానులు పోటీ చేయగా ఉదయభానును విజయం వరించింది. 1999లో మూడుసార్లు వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచిన నెట్టెం పరాజయం పొందాక మళ్లీ ప్రజల మద్దతు పొందలేకపోయారు. 2009, 2014లలో టీడీపీ అభ్యర్ధిగా శ్రీరాం తాతయ్య బరిలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్ధిగా, రెండోసారి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఉదయభాను రెండుసార్లు పరాజయం పొందారు. 2019లో పాత సెంటిమెంట్‌ను అధిగమించి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఉదయభాను, తెలుగుదేశం అభ్యర్ధి శ్రీరాం తాతయ్యను 4778 ఓట్ల తేడాతో ఓడించి చరిత్రను తిరగ రాశారు. అదే బాటలో 2024లో వైసీపీ అభ్య్ధర్ధి ఉదయభానుపై మూడోసారి పోటీలో నిలిచిన టీడీపీ అభ్యర్ధి శ్రీరాం తాతయ్య 15977 ఓట్ల తేడాతో ఓడించారు. ఒకసారి ఓడిన వారిని జగ్గయ్యపేట ప్రజలు ఆధరించరన్న అపవాదును పొగొట్టి ఉదయభాను సరసన నిలిచారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన నెట్టెం రఘురాం, సామినేని ఉదయభానుల సరసన శ్రీరాం తాతయ్య నిలిచారు.
సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన తాతయ్య
జగ్గయ్యపేట చరిత్రలో మునిసిపల్ చైర్మన్‌లుగా పనిచేసిన వారికి రాజకీయ భవిష్యత్ మృగ్యం అన్న అపవాదు, సెంటిమెంట్‌ను తాతయ్య తుడిచేశారు. జగ్గయ్యపేట పురపాలక సంఘంగా ఏర్పడినప్పడి నుంచి పనిచేసిన చైర్మన్‌లు ఎవరు తర్వాత రాజకీయాల్లో రాణించలేదు. ప్రప్రధమ మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీరాం బదరీనారాయణ తర్వాత వ్యాపారాలపై దృష్టి సారించారు. ఆ తర్వాత మహిళలకు రిజర్వ్ కావటంతో కాంగ్రెస్ తరపున నూతనంగా రాజకీయాలలోకి వచ్చి విజయం సాధించిన హనుమంతు రత్నకుమారి ఐదేళ్ల తర్వాత రాజకీయాల్లో ఇమడలేకపోయారు. బీసీలకు రిజర్వ్ కావటంతో తర్వాత వ్యాపారవేత్త కొమ్మవరపు వెంకటనారాయణ కాంగ్రెస్ నుంచి ఎన్నికైనా, తర్వాత క్రియాశీలకంగా వ్యవహరించలేక తెరమరుగయ్యారు. ఆ తర్వాత జనరల్‌గా మారిన మునిసిపాలిటికి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ తరపున మునిసిపల్ చైర్మన్‌గా ఘన విజయం సాధించి నామ మాత్రంగా (టీడీపీ) ప్రతిపక్షాన్ని మిగిల్చిన శ్రీరాం తాతయ్య అనూహ్యంగా 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్ధిగా శ్రీరాం తాతయ్య బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్ధి సామినేని ఉద యభానును 9678 ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు. మునిసిపల్ చైర్మన్ చేసిన వారికి రాజకీయ భవిష్యత్ ఉండదన్న అపప్రదను తొలగించి చైర్మన్ నుంచి ఎమ్మల్యేగా పదోన్నతి సాధించారు. పేట చరిత్రలో ఎమ్మెల్యేగా ఓడి గెలిచిన వారు లేరన్న రికార్డును తుడిపేసి ఉదయభాను సరసన నిలిచిన తాతయ్య, –నెట్టెం, ఉదయభానులతో సమానంగా మూడుసార్లు ఎన్నికై తాజా గెలుపుతో రికార్డును సమం చేశారు.
Updated Date - Jun 10 , 2024 | 09:03 AM