Mumbai Road Rage: మరీ ఇంత దారుణమా.. నిండు నూరేళ్లు మంచిగా జీవించమని చెప్పినందుకు.. చంపేశారు..
ABN, Publish Date - Oct 15 , 2024 | 11:50 AM
తాను మంచి ఉద్యోగం చేస్తూ.. వివాహం చేసుకుని జీవితంలో మంచిగా స్థిరపడ్డాడు. అయితే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తన తల్లిదండ్రులకు ఓ కారు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తనను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు దసరా పండుగ సందర్భంగా కారు బహుమతిగా ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందాన్ని..
చాలా మంది ఎన్నో కలలను కంటుంటారు. వాటిని సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తమ స్వప్నాలు సాకారం చేసుకునే సమయానికి ఆ వ్యక్తులు ఈ లోకంలో లేకుండా వెళ్లిపోతుంటారు. ఇలాంటి ఘటనలు చాలా చూస్తుంటాం. సరిగ్గా ముంబయిలో ఈ తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆకాశ్ మీన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ప్రయివేట్ ఉద్యోగం చేస్తున్నారు. తాను మంచి ఉద్యోగం చేస్తూ.. వివాహం చేసుకుని జీవితంలో మంచిగా స్థిరపడ్డాడు. అయితే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తన తల్లిదండ్రులకు ఓ కారు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తనను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు దసరా పండుగ సందర్భంగా కారు బహుమతిగా ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూద్దామనుకున్నాడు. ముంబయిలోని ఓ కార్ల షోరూమ్‌లో మారుతి ఎర్టిగా కారును బుక్ చేశాడు. శనివారం కారు డెలివరీ ఇస్తామని చెప్పడంతో తన తల్లిదండ్రులను తీసుకుని కార్ షోరూమ్‌కు వెళ్లాడు. తను ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలిచినట్లు.. కొన్ని కారణాలతో కారు డెలివరీ ఆలస్యమైంది. దీంతో మళ్లీ వద్దామని స్కూటర్‌పై తన భార్యను తీసుకుని ఇంటికి బయలుదేరగా.. తన తల్లిదండ్రులు ఆటోలో ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులు తన కుమారుడు, కోడలు కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతకీ వారు రావడంలేదు. ఏమైందని ఆలోచిస్తున్న సమయంలో తన కోడలి ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది.
ఫోన్ ఎత్తగానే ఆమె ఏడుస్తూ మాట్లాడుతోంది. ఏం జరిగిందని అడగ్గా.. మీ అబ్బాయిని ఆటోడ్రైవర్లు కొడుతున్నారని చెప్పగానే.. ఆకాశ్ తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ శివాజీ చౌక్ ప్రాంతానికి చేరుకున్నారు. వారు వెళ్లినప్పటికే పది నుంచి 15 మంది ఆటోడ్రైవర్లు ఆకాశ్‌పై తీవ్రంగా దాడిచేసి విచక్షణా రహితంగా కొట్టారు. మా అబ్బాయిని కొట్టొద్దని తన కుమారుడిపై తల్లి అడ్డంగా పడుకున్నప్పటికీ దుండగులు మాత్రం కనికరం చూపలేదు. మహిళని చూడకుండా ఆకాశ్ తల్లిని పక్కకు లాగి ఆకాశ్‌ను కొడుతూనే ఉన్నారు. చివరకు ఆసుపత్రికి తీసుకెళ్దామని ఆటోలో ఎక్కించినప్పటికీ దుండగులు కొట్టడం ఆపలేదు. ప్రాణం పోయేంతవరకు కొడుతూనే ఉన్నారు. ఆటో డ్రైవర్ల దాడితో చావు బతుకుల మధ్య ఉన్న క్షతగాత్రుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. ఆకాశ్ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కేవలం ఆకాశ్‌ను మాత్రమే కాదు.. ఆయన భార్యపై కొందరు ఆటో డ్రైవర్లు దాడికి పాల్పడ్డారు. దసరా పండుగ రోజు తన తల్లిదండ్రుల ఆనందాన్ని చూద్దామనుకున్న ఆకాశ్ స్వప్నం నెరవేరలేదు. ఈ ఘటనతో అతడి కుటుంబం తీవ్ర విషాందలో మునిగిపోయింది.
అసలు ఏం జరిగింది..
కారు డెలివరీ ఆసల్యం అవుతుందని చెప్పడంతో ఆకాశ్ తన కుటుంబంతో ఇంటికి బయలుదేరాడు. ఆకాశ్ తల్లిదండ్రులు దత్తాత్రేయ, దీపాలి ఆటోలో ఇంటికి చేరుకోగా.. తన భార్యతో ఆకాశ్ స్కూటర్‌పై ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యలో ఓవర్ టేక్ చేస్తూ ఓ ఆటో ఆకాశ్ స్కూటర్‌కు తగలడంతో అతడి భార్య కిందపడిపోబోయారు. తృతిలో ఘోర ప్రమాదం తప్పిందనుకున్న ఆకాశ్.. హరన్ కొడుతూ తనను ఓవర్‌టెక్ చేసి ముందుకెళ్లిపోయిన ఆటోడ్రైవర్‌ను కొంచెం జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు. వెంటనే ఆటో డ్రైవర్ తన తోటి డ్రైవర్లను పిలుచుకువచ్చి ఆకాశ్‌పై దాడికి పాల్పడ్డాడు. ఘటన స్థలం నుంచి ఆకాశ్ ఇంటికి వెళ్తుండగా.. వెంబడించిన ఆటో డ్రైవర్లు 10 నుంచి 15 మంది ఆకాశ్ బండిని ఆపి తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టారు. ఆకాశ్‌ను కాపాడేందుకు, ఆటో డ్రైవర్లను వారించేందుకు అతడి భార్య ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అడ్డుగా వెళ్లిన ఆకాశ్ భార్యను పక్కకు నెట్టి కొట్టడం మొదలునపెట్టారు. విషయాన్ని ఫోన్‌లో మృతుడి భార్య ఫోన్‌లో తన అత్తమామలకు చేరవేసింది. వారు వచ్చినప్పటికే ఆకాశ్ తీవ్ర గాయాలతో బాధపడుతున్నాడు. ఆకాశ్ తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ ఆటో డ్రైవర్లు మాత్రం కొడుతూనే ఉన్నారు. చివరకు పోలీసుల చొరవతో ఆకాశ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లినా అతడు తీవ్ర గాయాల కారణంగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
సకాలంలో అందని వైద్యం
తన కుమారుడికి సకాలంలో వైద్యం అందలేదని, ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ట్రామ్‌కేర్ విభాగంలో వైద్యులు అందుబాటులో లేరని, దాదాపు మూడు గంటల పాటు వైద్య సహాయం కోసం నీరిక్షించాల్సి వచ్చిందని ఆకాశ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశ్‌కు మరో జాబ్ ఆఫర్ రావడంతో హైదరాబాద్‌లో తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. తల్లిదండ్రులకు దగ్గరగా ఉండేందుకు ముంబైకి షిఫ్ట్ అవుదామనుకుంటున్న సమయంలో 28 ఏళ్ల ఆకాశ్ మీన్ ఆటోడ్రైవర్ల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయాడు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Oct 17 , 2024 | 01:36 PM