Kolkata: టీఎంపీ నేతపై హత్యాయత్నం.. తుపాకీతో దాడికి తెగబడిన దుండగులు..
ABN, Publish Date - Nov 16 , 2024 | 04:43 PM
కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లోని 108వ వార్డు కౌన్సిలర్ సుశాంత ఘోష్ శుక్రవారం రాత్రి తన ఇంటి ఎదుట కూర్చుని ఉన్నాడు. తనతోపాటు మరో టీఎంసీ నేత, మహిళ ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇద్దరు ముష్కరులు ద్విచక్రవాహనంపై వచ్చారు.
కోల్‌కతా: నగరంలోని కస్బా (Kasba) ప్రాంతంలో తృణముల్ కాంగ్రెస్ (TMC) నేత సుశాంత ఘోష్‌పై హత్యాయత్నం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. గుర్తుతెలియని దుండగులు తుపాకీతో ఘోష్‌పై దాడికి పాల్పడగా.. అతను తృటిలో తప్పించుకున్నాడు. అనంతరం నిందితులను ఛేజ్ చేసి పట్టుకోగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి ఘటన కోల్‌కతా రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లోని 108వ వార్డు కౌన్సిలర్ సుశాంత ఘోష్ శుక్రవారం రాత్రి తన ఇంటి ఎదుట కూర్చుని ఉన్నాడు. తనతోపాటు మరో టీఎంసీ నేత, మహిళ ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇద్దరు ముష్కరులు ద్విచక్రవాహనంపై వచ్చారు. ముఖానికి ముసుగులు కట్టుకుని ఉన్న వారు.. సుశాంత ఘోష్ ముందు వాహనాన్ని ఆపారు. అనంతరం కిందకు దిగిన దుండగుడు.. ఘోష్ వైపు నడుస్తూ వెనక నుంచి తపాకీ తీశాడు. అనంతరం సుశాంత వైపు గురి పెట్టి రెండు రౌండ్లు కాల్చాడు. అయితే అదృష్టవశాత్తూ అది పేలలేదు. రెండు సార్లు కాల్చినప్పటికీ తుపాకీ పని చేయలేదు. అందులో నుంచి ఎటువంటి బులెట్ కూడా రిలీజ్ అవ్వలేదు.
తుపాకీ పేలకపోవడంతో భయపడిపోయిన నిందితులు అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే సుశాంత ఘోష్, మరో నేత వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కాల్చులకు తెగబడిన వ్యక్తి ద్విచక్రవాహనం ఎక్కే ప్రయత్నం చేయగా.. టీఎంసీ నేత అతడిని తోసేశాడు. అనంతరం దుండగుడు పరిగెత్తగా.. స్కూటీపై ఉన్న వ్యక్తి సైతం ముందుకు వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులంతా వారిద్దరినీ పట్టుకున్నారు. అనంతరం ముష్కరులపై దాడి చేశారు. తనను ఎవరు చంపమని పంపించారని కౌన్సిలర్ ప్రశ్నించగా.. కేవలం ఫొటో మాత్రమే ఇచ్చారని, తాము ఎలాంటి నగదు వారి నుంచి తీసుకోలేదని చెప్పారు. హత్యకు కుట్ర పన్నిన వారి పేరు చెప్పేందుకు నిందితులు నిరాకరించారు. అనంతరం స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. కౌన్సిలర్ సుశాంత ఘోష్‌ను హతమార్చేందుకు బిహార్ నుంచి వీరిని పిలిపించారని, స్థానిక వైషమ్యాలే దాడికి కారణమని పోలీసులు విచారణలో గుర్తించారు.
అయితే తన హత్యకు ఎవరు ప్లాన్ చేసి ఉంటారో తెలియదని కౌన్సిలర్ సుశాంత్ ఘోష్ తెలిపారు. తాను 12 సంవత్సరాలుగా కౌన్సిలర్‌గా ఉన్నానని, ఈ విధంగా హత్యాయత్నం జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదని ఆయన చెప్పారు. అది కూడా తన ప్రాంతంలో, తన ఇంటి ముందు కూర్చున్నప్పుడు దాడి చేస్తారని అనుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే దాడి గురించి తెలుసుకున్న స్థానిక ఎంపీ మాలా రాయ్, ఎమ్మెల్యే జావేద్ ఖాన్.. కౌన్సిలర్ సుశాంత ఘోష్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.
Updated Date - Nov 16 , 2024 | 04:52 PM