Gym Centers: అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా జిమ్ సెంటర్లు.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ABN, Publish Date - Oct 15 , 2024 | 07:39 AM
ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తుంది. డాక్టర్లు సైతం వాకింగ్, జాగింగ్, రన్నింగ్ సహా పలు వ్యాయామాలు చేయాలని సూచించడంతో జిమ్‌లకు వెళ్లేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది.
హైదరాబాద్: ఆరోగ్యంగా ఉండేందుకు, శరీరాన్ని ఫిట్‌గా మార్చుకునేందుకు ఆరోగ్య ప్రియులు జిమ్‌కు వెళ్తుంటారు. అయితే అక్కడితే వెళ్తే ఆరోగ్యం ఏమో గానీ అనారోగ్యం మాత్రం తప్పకుండా వస్తుందన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. ఆరోగ్యం కోసం జిమ్‌లకు వెళ్తేంటే కొంతమంది నిర్వహకులు మాత్రం కాసులకు కక్కుర్తిపడి అమాయకులను బలి చేస్తున్నారు. తమ డబ్బు వ్యామోహంతో నట్టేట ముంచుతున్నారు. తరచుగా పబ్బుల్లో కనిపించే డ్రగ్స్ వినియోగం ఇప్పుడు జిమ్‌లకు సైతం పాకింది. ఇవి వాడితే ఆరోగ్యంతోపాటు, చాలా ఫిట్‌గా ఉంటారంటూ కొంతమంది నిర్వాహకులు చెప్పడంతో అవి నిషేధిత డ్రగ్స్ అని తెలియకుండానే వినియోగిస్తూ మత్తులకు బానిసలుగా మారుతున్నారు.
ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తుంది. డాక్టర్లు సైతం వాకింగ్, జాగింగ్, రన్నింగ్ సహా పలు వ్యాయామాలు చేయాలని సూచించడంతో జిమ్‌లకు వెళ్లేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే అలాంటి జిమ్‌లు ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇటీవల జిమ్ సెంటర్లపై దాడి చేసిన పోలీసులు అవాక్కయ్యారు. ఆ ప్రాంతాల్లో పలు రకాల డ్రగ్స్ గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. యువత ఎక్కువగా పబ్బులు, వ్యాయామ కేంద్రాలకు వెళ్తుంటారు. అయితే ఎక్కువగా పబ్బుల్లో కనిపించే డ్రగ్స్ కల్చర్ తాజాగా జిమ్‌లకు సైతం వ్యాపించింది. మానసిక ఒత్తిడి, శరీరం ఫిట్‌గా ఉండేందుకు మందులు వాడాలంటూ ఆయా సెంటర్ల నిర్వాహకులే అమాయకులను మెల్లిగా మత్తుకు బానిసలను చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. డైట్‌తోపాటు వీటిని ఉపయోగిస్తే ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మందుల రూపంలో వారికి డ్రగ్స్ అందజేస్తున్నారు.
మత్తు పదార్థాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటుంది. పోలీసులు సైతం సరఫరా దారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కేటుగాళ్లు మాత్రం కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. జిమ్‌లకు వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సహా సంపన్నులను టార్గెట్ చేస్తూ దందా నిర్వహిస్తున్నారు. వీటితోపాటు స్పా, మసాజ్ సెంటర్లు, ఏరోబిక్స్, జుంబా వంటి వాటి మాటునా అంసాఘిక కార్యకలాపాలు జరుగుతున్న వార్తలు సైతం తరచుగా వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రదేశాలు వ్యభిచారానికి అడ్డాగా మారుతున్నాయనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీంతో నగర పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహిస్తున్నారు.
Updated Date - Oct 15 , 2024 | 07:39 AM