Axar Patel: అక్షర్ పటేల్ మాస్ బ్యాటింగ్.. వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకుతెచ్చేలా..
ABN , Publish Date - Dec 05 , 2024 | 03:38 PM
SMAT 2024: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్‌ను గుర్తుకుతెచ్చేలా అద్వితీయ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
GUJ vs KNTKA: టీమిండియా స్టార్ ప్లేయర్ అక్షర్ పటేల్ బంతితోనూ కాదు.. అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ చెలరేగుతాడు. పట్టుదలతో ఆడి చాలా మ్యాచుల్లో భారత జట్టును గెలిపించాడతను. అందుకు ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అతడు ఆడిన నాక్‌ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. కింగ్ విరాట్ కోహ్లీతో కలసి అక్షర్ నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ ఇన్నింగ్స్‌తో అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు అక్షర్. అదే మాస్ బ్యాటింగ్‌ను అతడు మరోమారు రిపీట్ చేశాడు. భారీ షాట్లతో మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు.
ఒకే ఓవర్‌లో 24 పరుగులు
అక్షర్ పటేల్ మరోమారు బ్యాట్‌తో మోత మోగించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో అతడు విధ్వంసం సృష్టించాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ కెప్టెన్ 20 బంతుల్లోనే 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 2 బౌండరీలు కొట్టిన ఈ స్టార్ ఆల్‌రౌండర్.. 6 భారీ సిక్సులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. 280 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అక్షర్.. తన జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతడితో పాటు ఉర్విల్ పటేల్ (33), అభిషేక్ దేశాయ్ (47), హేమంగ్ పటేల్ (30) కూడా రాణించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 251 పరుగుల భారీ స్కోరు చేసింది.
బంతితోనూ అదరగొట్టాడు
ఛేజింగ్‌కు దిగిన కర్ణాటక 19.1 ఓవర్లలో 203 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు మనీష్ పాండే (30)తో పాటు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (45) రాణించాడు. స్మరణ్ రవిచంద్రన్ (49) కూడా మంచి నాక్ ఆడాడు. అయితే మిడిలార్డర్ బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యారు. దీంతో విజయానికి 48 పరుగుల దూరంలో ఆగిపోయింది కర్ణాటక. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో వీరంగం సృష్టించిన అక్షర్ పటేల్.. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. 2 కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జోరుకు బ్రేకులు వేశాడు. అతడితో పాటు గుజరాత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు రాణించాడు. అర్జన్ నగ్వాస్‌వల్లా కూడా 2 వికెట్లతో ప్రత్యర్థి పతనంలో తన వంతు పాత్ర పోషించాడు.
Also Read:
భయపెడుతున్న ఆడిలైడ్ పిచ్ హిస్టరీ.. ఎవ్వరికైనా అదే రిజల్టా..
అమ్మాయిలు ఫెయిల్.. బెండు తీస్తారనుకుంటే భయపడ్డారు
ఆస్ట్రేలియాతో సెకండ్ టెస్ట్.. రెండు కీలక మార్పులతో బరిలోకి భారత్
13 ఏళ్లకే కోటీశ్వరుడైన వైభవ్ విధ్వంసం.. 76 పరుగులతో అజేయంగా..
For More Sports And Telugu News