BCCI vs PCB: ఇరకాటంలో బీసీసీఐ.. అంతా పాకిస్థాన్ వల్లే..
ABN, Publish Date - Dec 03 , 2024 | 06:31 PM
BCCI vs PCB: భారత క్రికెట్ బోర్డు ఇరకాటంలో పడింది. కొత్త సమస్య రావడంతో ఎలా పరిష్కరించాలో తెలియక తలపట్టుకుంటున్నారు బోర్డు పెద్దలు. అయితే దీనంతటికీ కారణం పాకిస్థాన్ అనే చెప్పాలి.
Champions Trophy 2025: ఎరక్కపోయి ఇరుక్కుంది భారత క్రికెట్ బోర్డు. ఒక సమస్య నుంచి బయటపడే క్రమంలో మరో దాంట్లో ఇరుక్కుంది. దీంతో ఏం చేయాలో బోర్డు పెద్దలకు అర్థం కావడం లేదు. అయితే దీనంతటికీ పాకిస్థానే కారణమని చెప్పాలి. ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన పనికి బీసీసీఐ పెద్దలు టెన్షన్ పడుతున్నారు. ఉన్న సమస్యలు చాలక కొత్తది తీసుకొచ్చారు.. వీళ్లు మారరు అంటూ పాకిస్థాన్‌ను తిట్టుకుంటున్నారు. అసలు బీసీసీఐ ఎదుర్కొంటున్న ఆ కొత్త సమస్య ఏంటి? దీని నుంచి బోర్డు బయటపడాలంటే ఉన్న మార్గాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
పాక్ కొత్త మెలిక
ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. భద్రతా కారణాల రీత్యా ఆ దేశానికి టీమిండియాను పంపేది లేదంటూ ఐసీసీకి బీసీసీఐ తేల్చిచెప్పింది. దీనికి పాకిస్థాన్ ఒప్పుకోలేదు. అయితే హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహణకు అంగీకరించాలని.. లేకపోతే టోర్నీని వేరే దేశానికి తరలిస్తామంటూ పాక్‌కు వార్నింగ్ ఇచ్చింది ఐసీసీ. వేరే మార్గం లేకపోవడంతో దీనికి పీసీబీ ఓకే చెప్పింది. అయితే ఓ మెలిక కూడా పెట్టింది. తమ దేశానికి టీమిండియా రావడం లేదు కాబట్టి భవిష్యత్తులో భారత్‌లో నిర్వహించే ఐసీసీ ఈవెంట్స్‌కు తమ టీమ్ కూడా రాదని, ఇరు దేశాల మధ్య మ్యాచుల్ని తటస్థ వేదికల్లో జరపాలని షరతు పెట్టింది. ఈ మేరకు బీసీసీఐ నుంచి లిఖితపూర్వకంగా హామీ కావాలని డిమాండ్ చేస్తోంది. దీంతో మన బోర్డు ఇరకాటంలో పడింది. హైబ్రిడ్ మోడల్‌పై పాక్ ట్విస్ట్ ఇవ్వడంతో బీసీసీఐ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
బీసీసీఐ ససేమిరా
వన్డే, టీ20 ఫార్మాట్లలో ఛాంపియన్స్ ట్రోఫీ సహా వరల్డ్ కప్స్ కూడా భారత్‌లో నిర్వహిస్తుంటారు. ఇప్పుడు పాక్ టీమ్ భారత్‌కు రాబోం, అక్కడ ఆడబోం అనడంతో బీసీసీఐ సీరియస్ అవుతోంది. పాక్‌లో భద్రతా సమస్యలు, ఉగ్రవాదం లాంటివి ఉన్నాయి కాబట్టి టీమిండియాను పంపడం లేదు. కానీ భారత్‌లో అలాంటి ఏ ప్రాబ్లమ్ లేదు. పీసీబీ కావాలనే ఓవరాక్షన్ చేస్తోందని.. వాళ్లు పెట్టిన షరతుకు అంగీకరించేది లేదని కరాఖండీగా చెబుతోంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశం మళ్లీ మొదటికొచ్చింది. రోజురోజుకీ మరింత ముదురుతున్న ఈ వివాదాన్ని ఐసీసీ కొత్త ఛైర్మన్ జైషా ఎలా కొలిక్కి తీసుకొస్తారో చూడాలి.
Also Read:
పాండ్యా బ్రదర్స్‌ను భయపెట్టిన సీఎస్‌కే బౌలర్.. ఐపీఎల్ రైవల్రీ షురూ
జైస్వాల్‌పై రోహిత్ సీరియస్.. ఎందుకిలా చేశావ్ అంటూ..
ఈ క్యాప్ విలువ 2 కోట్లు.. సచిన్, కోహ్లీది కాదు.. ఏ ప్లేయర్‌దో చెప్పండి చూద్దాం
70 వేల కోట్లకు వారసుడు.. 22 ఏళ్లకే రిటైర్మెంట్
For More Sports And Telugu News
Updated Date - Dec 03 , 2024 | 06:31 PM