IPL 2024: తన కెప్టెన్సీలో రోహిత్ ఆడడంపై హార్దిక్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 18 , 2024 | 06:29 PM
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదంపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. తన కెరీర్‌లో దాదాపుగా అన్ని మ్యాచ్‌లు రోహిత్ శర్మ సారథ్యంలోనే ఆడానని అన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో ఎన్నో విజయాలు సాధించామని గుర్తు చేసుకున్నాడు. తన కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ శర్మ ఎలాంటి ఇబ్బంది పడకపోవచ్చని, హిట్ మ్యాన్‌తో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదంపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. తన కెరీర్‌లో దాదాపుగా అన్ని మ్యాచ్‌లు రోహిత్ శర్మ సారథ్యంలోనే ఆడానని అన్నాడు. రోహిత్ కెప్టెన్సీలో ఎన్నో విజయాలు సాధించామని గుర్తు చేసుకున్నాడు. తన కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్ శర్మ ఎలాంటి ఇబ్బంది పడకపోవచ్చని, హిట్ మ్యాన్‌తో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హోదాలో హార్దిక్ పాండ్యా తొలిసారిగా మీడియా సమావేశానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ముంబై ఇండియన్స్‌కు తిరిగి రావడం ఒక మంచి అనుభూతి. 2015 నుంచి నా ప్రయాణం అంతా ముంబైతోనే సాగుతుంది. నేను మళ్లీ ముంబైకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఇష్టమైన వాంఖడే మైదానంలో ఆడడానికి ఎదురుచూస్తున్నాను. ముంబై కెప్టెన్సీ మార్పు విషయం గురించి పెదగా చర్చ అవసరం లేదు. రోహిత్ శర్మ జట్టుతోనే ఉంటాడు. నాకు అవసరమైనప్పుడు సాయం చేస్తాడు. నా కెప్టెన్సీలో ఆడడానికి రోహిత్ శర్మ ఇబ్బంది పడకపోవచ్చు. అతని సాయంతోనే జట్టును నడిపిస్తా. నాకు అవసరం వచ్చినప్పుడు రోహిత్ సాయం తీసుకుంటాను. అతను టీమిండియా కెప్టెన్. అతని కెప్టెన్సీలో చాలా విజయాలు సాధించాం. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఏం సాధించిందనేది అందరికీ తెలుసు. దానిని కొనసాగించాల్సిన బాధ్యత నాపై ఉంది. నా కెరీర్ మొత్తం రోహిత్ కెప్టెన్సీలోనే ఆడా. ఈ సీజన్ మొత్తంలో ఎల్లప్పుడు అతని చేయి నా భుజంపై ఉంటుందని నాకు తెలుసు.’’ అని అన్నాడు.
ముంబై ఇండియన్స్ మిమ్మల్ని కెప్టెన్‌గా ప్రకటించిన తర్వాత రోహిత్ శర్మతో మాట్లాడారా అనే ప్రశ్నకు బదులిస్తూ..‘‘మాట్లాడలేదు. ఎందుకంటే రోహిత్ శర్మ టీమిండియా షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడు. దీంతో తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. మేమిద్దరం కలిసి దాదాపు 2 నెలలైంది. ఐపీఎల్ మొదలైన వెంటనే రోహిత్ శర్మతో మాట్లాడుతా.’’ అని చెప్పాడు. అయితే కెప్టెన్సీ మార్పు తర్వాత అభిమానుల నుంచి వచ్చిన విభిన్న స్పందనలను తాను గౌరవిస్తున్నట్టు హార్దిక్ పాండ్యా చెప్పాడు. నియంత్రించగల్గే వాటిని నియంత్రిస్తానని తెలిపాడు. తన నియంత్రణలో లేని వాటిని తాను ఏమి చేయలేనని పేర్కొన్నాడు. ఇక కెప్టెన్‌గా తాను ఏమి చేయగలను అనే అంశంపై దృష్టి పెట్టనున్నట్టు చెప్పాడు. అలాగే ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై తరఫున తాను బౌలింగ్ కూడా చేస్తానని హార్దిక్ పాండ్యా చెప్పాడు. కాగా ఈ సీజన్ వేలానికి ముందు ట్రేడింగ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా కూడా హార్దిక్‌నే ప్రకటించారు. దీంతో ఇది పెద్ద దుమారానికి దారి తీసింది. ముంబై మేనేజ్‌మెంట్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గాయం కారణంగా 2023 వన్డే ప్రపంచకప్ మధ్యలో నుంచే తప్పుకున్న హార్దిక్ పాండ్యా అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ ద్వారా మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. కాగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ నెల 24న ఈ మ్యాచ్ జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 18 , 2024 | 06:29 PM