IPL 2024: లక్నోకు మరో బిగ్ షాక్.. ఆ స్టార్ పేసర్ కూడా దూరం
ABN, Publish Date - Mar 21 , 2024 | 10:40 AM
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభంకానున్న వేళ లక్నోసూపర్ జెయింట్స్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ మార్కు వుడ్ దూరం కావడంతో లక్నో ఇబ్బందుల్లో పడింది. తాజాగా మరో ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లీ కూడా దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో డేవిడ్ విల్లీ ఐపీఎల్ తొలి భాగం నుంచి తప్పుకున్నాడు.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభంకానున్న వేళ లక్నోసూపర్ జెయింట్స్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ మార్కు వుడ్ దూరం కావడంతో లక్నో ఇబ్బందుల్లో పడింది. తాజాగా మరో ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లీ కూడా దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో డేవిడ్ విల్లీ ఐపీఎల్ తొలి భాగం నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని లక్నోసూపర్ జెయింట్స్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ధృవీకరించాడు. ఇద్దరు కీలక పేసర్లు జట్టుకు దూరం కావడంతో లక్నో పేస్ బౌలింగ్ యూనిట్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. వేలంలో విల్లీని లక్నో రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే లక్నోసూపర్ జెయింట్స్ యాజమాన్యం ఇప్పటివరకు డేవిడ్ విల్లీ స్థానంలో రిప్లేస్‌మెంట్ ప్రకటించలేదు. మరోవైపు మార్కువుడ్ స్థానంలో మాత్రం షమర్ జోసెఫ్‌ను జట్టులోకి తీసుకుంది. కాగా డేవిడ్ ఇంతకుముందు దుబాయ్ వేదికగా రెండు నెలలపాటు సాగిన ఐఎల్‌టీ20 లీగ్‌లో అబాదాబి నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల ముగిసిన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
లక్నోసూపర్ జెయింట్స్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ ‘‘ఇప్పటికే మార్కు వుడ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇప్పుడు డేవిడ్ విల్లీ కూడా రావడం లేదు. దీంతో మా బౌలింగ్‌లో కొంత అనుభవలేమి కనిపిస్తోంది. కానీ నేను గత రెండు రోజులుగా గమనించినది ఏంటంటే.. మా జట్టులో అపారమైన ప్రతిభ ఉంది. కొన్ని గాయాలు ఉన్నప్పటికీ, మా ఆటగాళ్లు ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నారు. మా కుర్రాళ్లు రాణించాలనే కసితో ఉన్నారు. మార్కు వుడ్ ప్రపంచ స్థాయి బౌలర్. అతను వైదొలగడం మమ్మల్ని నిరాశపరిచింది. అయితే మాకు షమర్ జోసెఫ్ ఉన్నాడు. అలా మంచి పేస్‌తో బౌలింగ్ చేసే మయాంక్ కూడా ఉన్నాడు. మార్కు వుడ్‌ను మేము షమర్ జోసెఫ్, మయాంక్‌తో భర్తీ చేయగలము.’’ అని చెప్పాడు. కాగా లక్నోసూపర్ జెయింట్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా ఆడనుంది.
Updated Date - Mar 21 , 2024 | 10:40 AM