History: లక్ష్మణ్-ద్రావిడ్ చరిత్రాత్మక భాగస్వామ్యానికి 23 ఏళ్లు!
ABN , Publish Date - Mar 14 , 2024 | 12:10 PM
అది 14 మార్చి 2001. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. భారత దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ నాడు సృష్టించిన అద్భుతం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అదొక పెను సంచలనం.
అది 14 మార్చి 2001. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. భారత దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ నాడు సృష్టించిన అద్భుతం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అదొక పెను సంచలనం. టీమిండియా ఓటమి ఖాయమనుకున్న టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమే జరిగింది. లక్ష్మణ్-ద్రావిడ్ కలిసి జట్టును ఓటమి నుంచి రక్షించడమే కాకుండా అపూరపమైన విజయాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగుల లోటుతో ఉన్న జట్టును ఫాలో ఆన్‌లో అనూహ్యంగా భారీ అధిక్యంలోకి తీసుకెళ్లారు. ఆస్ట్రేలియా ముందు ఏకంగా 384 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. ఈ క్రమంలో లక్ష్మణ్-ద్రావిడ్ నెలకొల్పిన 376 పరుగుల భాగస్వామ్యం క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. లక్ష్మణ్-ద్రావిడ్‌ల అద్భుత భాగస్వామ్యానికి నేటికి 23 ఏళ్లు గడిచిపోయాయి.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు రెండో టెస్ట్ మ్యాచ్‌లో తలపడ్డాయి. అప్పటికే మొదటి టెస్టులో ఓడిన టీమిండియా సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. కానీ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఏకంగా 274 పరుగులు వెనుకబడింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. భారత జట్టు 171 పరుగులు మాత్రమే చేసింది. భారత జట్టుకు ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఇచ్చింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకుంటే అదే ఎక్కువ అనుకున్నారు. కానీ తెలుగు ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్- రాహుల్ ద్రావిడ్ కలిసి అద్భుతమే చేశారు. భారత జట్టు 232 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు జత కట్టారు. ఐదో వికెట్‌కు ఏకంగా రికార్డు స్థాయిలో 376 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో లక్ష్మణ్ భారీ డబుల్ సెంచరీతో, ద్రావిడ్ భారీ సెంచరీతో చెలరేగారు. వీరి భాగస్వామ్యంతో నాలుగో రోజు భారత జట్టు ఒక వికెట్ కూడా కోల్పోలేదు. నాలుగో రోజు వికెట్ కోల్పోకుండా 335 పరుగులు చేసింది. ఫాలో ఆన్ నుంచి తప్పించుకోవడమే కాకుండా రెండో ఇన్నింగ్స్‌లో 657/7 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 44 ఫోర్లతో లక్ష్మణ్ 281 పరుగులు చేయగా.. 20 ఫోర్లతో ద్రావిడ్ 180 పరుగులు చేశాడు.
అనంతరం భారత్ విసిరిన 384 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆస్ట్రేలియా జట్టు 212 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 171 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఊహించని ఓటమితో కంగారులు షాక్‌లోకి వెళ్లిపోయారు. ఆ మ్యాచ్‌లో లక్ష్మణ్ చేసిన 281 పరుగులు అప్పటివరకు టెస్టుల్లో ఒక టీమిండియా బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ అదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్ జరిగి రెండు దశాబ్దాలు గడిచినా.. ఇప్పటికీ ఆ మధురానుభుతులు భారత క్రికెట్ అభిమానుల కళ్లలో పదిలంగా నిలిచిపోయాయి. ఆ తీపి జ్ఞాపకం ఇప్పటికీ చెదిరిపోలేదు. ఆ తర్వాత కూడా వీరిద్దరు కలిసి భారత జట్టుకు ఎన్నో భాగస్వామ్యాలు నెలకొల్పారు. టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించారు. రిటైర్ అయ్యాక కూడా టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెచ్ కోచ్‌గా ఉండగా.. లక్ష్మణ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.