India vs England: కోహ్లీ, రోహిత్‌లకు రెండు పెద్ద గండాలు.. అవి దాటకపోతే..
ABN, Publish Date - Jun 27 , 2024 | 03:15 PM
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ ఇద్దరు క్రీజులో కుదురుకుంటే, ఏ రేంజ్‌లో విజృంభిస్తారో అందరికీ తెలుసు. మొదట్లో కాస్త తమ ఇన్నింగ్స్ ప్రారంభించినా.. ఆ తర్వాత పరిస్థితుల్ని అనుగుణంగా..
రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఈ ఇద్దరు క్రీజులో కుదురుకుంటే, ఏ రేంజ్‌లో విజృంభిస్తారో అందరికీ తెలుసు. మొదట్లో కాస్త తమ ఇన్నింగ్స్ ప్రారంభించినా.. ఆ తర్వాత పరిస్థితుల్ని అనుగుణంగా మార్చుకొని, ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. అఫ్‌కోర్స్.. ఈ మెగా టోర్నీలో కోహ్లీ ఇంతవరకూ ఖాతా తెరువలేదు కానీ, అతను కచ్ఛితంగా కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకాలు ఇంకా తగ్గలేదు. సెమీ ఫైనల్స్‌లో అతని ట్రాక్ రికార్డ్ గొప్పగా ఉంది కాబట్టి, ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో తన బ్యాట్ ఝుళపిస్తాడని భావిస్తున్నారు. ఇక రోహిత్ శర్మ తన బ్యాట్‌కు పని చెప్తే ఎలా ఉంటుందో.. సూపర్-8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో నిరూపించాడు.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. రోహిత్, కోహ్లీలకు ఈ సెమీ ఫైనల్ పోరులో ఇద్దరు ఆటగాళ్ల రూపంలో రెండు పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వారే.. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్. ముందుగా జోఫ్రా గురించి మాట్లాడుకుంటే.. ఈ కుడిచేతి వాటం సీమర్‌తో రోహిత్ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే.. టీ20ల్లో అతని నుంచి 20 బంతులను ఎదుర్కొన్న రోహిత్.. కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు.. మూడుసార్లు తన వికెట్ సమర్పించుకున్నాడు. ఇక కోహ్లీకి ఆదిల్ రూపంలో ముప్పు పొంచి ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను అన్ని ఫార్మాట్‌లలోనూ.. కోహ్లీని ఏకంగా తొమ్మిదిసార్లు ఔట్ చేశాడు. కాబట్టి.. అతని బౌలింగ్‌లో కోహ్లీ ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. ఈ రెండు గండాలను రోహిత్, కోహ్లీ అధిగమిస్తే.. ఈ మ్యాచ్‌లో ఆ ఇద్దరు ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించడం ఖాయమని నమ్మకాలు పెట్టుకోవచ్చు.
ఇకపోతే.. గయానా వేదికగా జరగబోతున్న ఈ సెమీస్ పోరుకి వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఆ ప్రాంతంలో 88% ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. 18% పిడుగులు పడే అవకాశమూ లేకపోలేదని తేల్చి చెప్తున్నాయి. దీంతో.. ఈ మ్యాచ్ రద్దవుతుందన్న ఆందోళన నెలకొంది. అయితే.. ఐసీసీ అలా జరగకుండా ఉండేందుకు 250 నిమిషాల అదనపు సమయం కేటాయించింది. అప్పటికీ మ్యాచ్ రద్దైతే.. గ్రూప్-1 దశలో భారత్ అగ్రస్థానంలో ఉంది కాబట్టి, అది ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 27 , 2024 | 03:15 PM