SRH vs MI: 20 కోట్లు అవసరమా అన్నారు.. కట్ చేస్తే అతనే మ్యాచ్ గెలిపించాడు..
ABN, Publish Date - Mar 28 , 2024 | 10:23 AM
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్ పిచ్‌పై రెండు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 31 పరుగుల తేడాతో గెలిచింది.
హైదరాబాద్: ఐపీఎల్ 2024లో(IPL 2024) భాగంగా బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) మధ్య జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్ పిచ్‌పై రెండు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 31 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 277/3 పరుగులు చేసింది. అనంతరం ముంబై కూడా బాగానే పోరాడింది. లక్ష్య చేధనలో 246/5 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్ల దూకుడు చూస్తుంటే ఒకానొక దశలో ఆ జట్టే గెలుస్తుందేమో అనిపించింది. కానీ ఇలాంటి సమయంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్(Pat Cummins) అద్భుతం చేశాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ను గెలుపు బాట పట్టించాడు. తన అద్భుత బౌలింగ్‌తో, కెప్టెన్సీతో జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో గత ఐపీఎల్ వేలంలో తనపై పెట్టిన 20.5 కోట్ల భారీ ధర వృథా కాదని నిరూపించాడు. దీంతో గతంలో కమిన్స్‌కు రూ.20.5 కోట్లు అవసరమా? అని అన్న వారే ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిజానికి ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారడంతో అందరూ బ్యాటర్ల బాదుడు గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ బ్యాటింగ్ పిచ్‌పై తన మార్కు బౌలింగ్‌తో కమిన్స్ అదరగొట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ముంబై బ్యాటర్లకు కళ్లెం వేశాడు. తద్వారా రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 278 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అదిరే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు 3.2 ఓవర్లలోనే 56 పరుగులు జోడించారు. కిషన్(34) ఔటైనప్పటికీ రోహిత్ తన దూకుడు కొనసాగించాడు. అతనికి వన్ డౌన్ బ్యాటర్ నమన్ దీర్ కూడా సహకరించాడు. దీంతో 4.2 ఓవర్లలో ముంబై స్కోర్ 66కు చేరుకుంది.
ఇలాంటి సమయంలోనే కమిన్స్ అద్భుతం చేశాడు. ఒక ఫోర్, 3 సిక్సులతో 12 బంతుల్లోనే 26 పరుగులతో విరుచుకుపడుతున్న రోహిత్ శర్మను పెవిలియన్ చేర్చాడు. కమిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్.. అభిషేక్ శర్మకు దొరికిపోయాడు. రోహిత్ ఔట్ కావడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే రోహిత్ క్రీజులో ఉంటే ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనంతరం నమన్ ధీర్, తిలక్ వర్మ రెచ్చిపోయారు. నమన్ ధీర్(30) ఔటైనప్పటికీ లోకల్ బాయ్ తిలక్ వర్మ తన దూకుడు కొనసాగించాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తిలక్ వర్మ దూకుడు చూస్తే ముంబై గెలిచేలా కనిపించింది.
కానీ ఇలాంటి సమయంలో 15వ ఓవర్ బౌలింగ్ చేసిన కమిన్స్ తిలక్ వర్మను పెవిలియన్ చేర్చాడు. కమిన్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన తిలక్ వర్మ.. మయాంక్ అగర్వాల్‌కు దొరికిపోయాడు. దీంతో 182 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 34 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 2 ఫోర్లు, 6 సిక్సులతో 34 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. అంతేకాకుండా తిలక్ వర్మ ఔట్ కావడంతో మ్యాచ్ హైదరాబాద్ చేతుల్లోకి వచ్చింది. దీంతో అక్కడి నుంచి సన్‌రైజర్స్ విజయానికి చేరువైంది. చివరికి 31 పరుగుల తేడాతో గెలిచింది.
అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో రెండు జట్ల బౌలర్లలో కాస్త పొదుపుగా బౌలింగ్ చేసింది కమిన్సే కావడం గమనార్హం. కీలక సమయంలో 2 వికెట్లు తీయడమే కాకుండా 4 ఓవర్లలో 35 పరుగులే ఇచ్చాడు. అంతేకాకుండా కీలక సమయాల్లో కెప్టెన్‌గా బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ మార్పులతో ముంబై బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ముంబై బ్యాటర్లను బాగా కట్టడి చేశాడు. దీంతో ప్రస్తుతం పాట్ కమిన్స్‌పై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. వేలం సమయంలో కమిన్స్‌ను సన్‌రైజర్స్ రూ.20.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినప్పుడు విమర్శించిన వారు ప్రస్తుతం కొనియాడుతున్నారు. కమిన్స్‌పై అంత భారీ ధర పెట్టడంలో తప్పు లేదంటున్నారు. అలాగే ఇదే ప్రదర్శనతో కమిన్స్ సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
SRH vs MI: ఇక్కడ బౌలింగ్ చేయడం కష్టం.. వారు మాత్రం అదరగొట్టారు: హార్దిక్ పాండ్యా
SRH vs MI: ఉప్పల్‌లో రికార్డుల ఊచకోత.. సన్‌రైజర్స్ vs ముంబై మ్యాచ్‌లో బద్దలైన రికార్డులివే!
Updated Date - Mar 28 , 2024 | 11:24 AM