Share News

హాకీకి.. పతక హారతి

ABN , Publish Date - Aug 09 , 2024 | 06:07 AM

హాకీ అంటే ఆట మాత్రమే కాదు.. అదో భావోద్వేగం. అందుకే గతంలో ఏకంగా ఎనిమిదిసార్లు భారత్‌కు ఒలింపిక్‌ పసిడి పతకాలు అందించిన హాకీ దిగ్గజాలను మనమంతా ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. వాళ్ల జ్ఞాపకాలను....

హాకీకి.. పతక హారతి

హాకీ అంటే ఆట మాత్రమే కాదు.. అదో భావోద్వేగం. అందుకే గతంలో ఏకంగా ఎనిమిదిసార్లు భారత్‌కు ఒలింపిక్‌ పసిడి పతకాలు అందించిన హాకీ దిగ్గజాలను మనమంతా ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. వాళ్ల జ్ఞాపకాలను మదిలో దాచుకున్నాం. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలుగా ఒలింపిక్స్‌లో ఒక్క పతకమూ రాకపోవడంతో ఎం తో ఆవేదనకు గురయ్యాం. ఇంకెన్నాళ్లీ మనోవ్యథ అనుకుంటున్న తరుణంలో.. మూడేళ్ల క్రితం టోక్యోలో మన్‌ప్రీత్‌సింగ్‌ సారథ్యంలోని జట్టు కాంస్య పతకంతో చరిత్ర సృష్టించి చిద్విలాసం చేసింది.. హాకీ అభిమానులకు అంతులేని ఆనందాన్ని అందించింది. ఇదిలో మళ్లీ వెంటనే పారి్‌సలోనూ ఆ తరహా ప్రదర్శనను పునరావృతం చేసి ఆ సంతోషాన్ని రెట్టింపు చేసింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలో జట్టు అద్భుతంగా ఆడి వరుసగా రెండోసారి ఒలింపిక్‌ పతకంతో పూర్వవైభవానికి గట్టి పునాదులు వేసింది. ఒకప్పుడు గొప్పగా వెలిగి ఆపై మసకబారిన టీమిండియాకు ఇకనుంచి అన్నీ మంచి శకునములే!


ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు ఈసారి సమష్టిగా పోరాడి ఫలితాన్ని రాబట్టింది. అనుభవజ్ఞులు, యువకులతో సమతూకమైన జట్టుగా బరిలోకి దిగిన భారత్‌ టోర్నమెంట్‌ ఆద్యంతం పోరాటతత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్లింది. కఠినమైన ప్రత్యర్థులు ఎదురైనా ఏమాత్రం వెరవని హర్మన్‌సేన.. ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవో అన్నట్టుగా పోరాడింది. ఆరంభ పోరులో న్యూజిలాండ్‌ను ఓడించి పారిస్‌ క్రీడలను ఘనంగా ప్రారంభించిన టీమిండియా.. రెండోమ్యాచ్‌ను అర్జెంటీనాతో డ్రాగా ముగించింది. ఆ తర్వాత ఐర్లాండ్‌పై గెలిచి, డిఫెండింగ్‌ చాంపియన్‌ బెల్జియంతో ఓడినా.. ప్రీ క్వార్టర్స్‌లో టోక్యో ఒలింపిక్స్‌ రన్నరప్‌ ఆస్ట్రేలియాను చిత్తుచేసిన తీరు అమోఘం. విశ్వక్రీడల్లో 52 ఏళ్ల తర్వాత కంగారూలపై తొలి విజయాన్ని నమోదుచేసిన భారత్‌.. అదే జోరులో క్వార్టర్స్‌లో గ్రేట్‌ బ్రిటన్‌పై మరపురాని ప్రదర్శనతో అభిమానులను అలరించింది. స్కోర్లు సమమైనా, పెనాల్టీ షూటౌట్‌లో ఫలితాన్ని రాబట్టిన తీరును మరచిపోగలమా! సెమీఫైనల్లో జర్మనీ చేతిలో పరాజయం ఎదురైనా, కాంస్య పోరులో స్పెయిన్‌పై విజృంభించి పతకం దక్కించుకుంది. ప్రధానంగా సారథి హర్మనప్రీత్‌, గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ జట్టును ముందుండి నడిపించిన తీరు సర్వదా ప్రశంసనీయం. సహచరుల్లో స్ఫూర్తి నింపుతూ, పోరాటమే ఆయుధంగా ముందుకు సాగుతూ, జట్టు ను విజయాల బాట నడిపించాడు హర్మన్‌ప్రీత్‌. టోక్యోలో పతకం సాధించడంలోనూ కీలకపాత్ర పోషించిన 28 ఏళ్ల హర్మన్‌.. పారిస్‌లో అంతకుమించిన ఆటతీరుతో చెలరేగాడు.


ప్రపంచంలోనే అత్యుత్తమ డ్రాగ్‌ఫ్లికర్లలో ఒకడిగా పేరుగాంచిన హర్మన్‌.. జట్టు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గోల్‌ చేశాడు. ఓవరాల్‌గా టోర్నీలో పది గోల్స్‌తో విజృంభించి జట్టు పతకం దక్కించుకోవడంలో కీలక భాగస్వామయ్యాడు. ఇక, గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ గతేడాది ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పెనాల్టీ షూటౌట్‌లో ఓడిన టీమిండియా.. ఆ తర్వాత కొత్త కోచ్‌ క్రెగ్‌ ఫుల్టన్‌ శిక్షణలో క్రమంగా మెరుగపడింది. ఆసియా క్రీడల ఫైనల్లో జపాన్‌పై ఆరంభంలో ప్రశాంతంగా ఆడి ఆపై దూకుడు పెంచి పైచేయి సాధించింది. ఇటీవలికాలంలో ఆటలో డిఫెన్స్‌ పరంగానూ మెరుగుపడింది. పారి్‌సలో ఒత్తిడిని దాటుకొని వరుసగా రెండో పతకాన్ని ముద్దాడింది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఒలింపిక్స్‌ హాకీలో భారత్‌

1928 - స్వర్ణం

1932 - స్వర్ణం

1936 - స్వర్ణం

1948 - స్వర్ణం

1952 - స్వర్ణం

1956 - స్వర్ణం

1960 - రజతం

1964 - స్వర్ణం

1968 - కాంస్యం

1972 - కాంస్యం

1980 - స్వర్ణం

2020 - కాంస్యం

2024 కాంస్యం

Updated Date - Aug 09 , 2024 | 06:07 AM