SVPNPA: 109 మంది ఇంజనీర్లు, 15 మంది వైద్యులు
ABN, Publish Date - Sep 19 , 2024 | 03:16 AM
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎస్‌వీపీ ఎన్‌పీఏ)లో 188 మంది యువ ఐపీఎ్‌సలు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
ఎస్‌వీపీ ఎన్‌పీఏలో 188 మంది యువ ఐపీఎ్‌సలకు శిక్షణ పూర్తి.. వారిలో ఇంజనీరింగ్ పట్టభద్రులే అధికం
76వ ఆర్‌ఆర్ బ్యాచ్ ఐపీఎ్‌సల పాసింగ్ అవుట్ పరేడ్ రేపు
తెలంగాణ, ఏపీకి చెరో నలుగురు ఐపీఎ్‌సల కేటాయింపు
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎస్‌వీపీ ఎన్‌పీఏ)లో 188 మంది యువ ఐపీఎ్‌సలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 76వ ఆర్‌ఆర్(రెగ్యులర్ రిక్రూట్) ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వీరి పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం జరగనుంది. అయితే, ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో ఇంజనీరింగ్ పట్టభద్రులు అత్యధికంగా ఉండగా, ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 188 మంది ట్రైనీ ఐపీఎ్‌సల్లో ఇంజనీరింగ్ చదివిన వారు 109 మంది, ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు 15 మంది ఉండడం విశేషం.
అలాగే, లా (న్యాయ శాస్త్రం) పట్టా పొందిన వారు నలుగురు ఉండగా, ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పొందిన వారు 28 మంది, సైన్స్ విభాగాల్లో డిగ్రీ చేసిన వారు 22 మంది, కామర్స్ విభాగం వారు ఎనిమిది మంది, ఇతర డిగ్రీలు చేసిన వారు ఇద్దరు ఉన్నారు. ఇక, 188 మంది ట్రైనీ ఐపీఎ్‌సల్లో యువత అధికంగా ఉన్నారు. 25 ఏళ్ల లోపు వారు 15 మంది ఉండగా, 25-28 ఏళ్ల లోపు వారు 102 మంది ఉన్నారు. మొత్తం 54 మంది మహిళా ఐపీఎ్‌సలు ఉండగా వారిలో 38 మంది అవివాహితలు. అలాగే, 134 మంది పురుషుల్లో 116 మంది అవివాహితులు ఉన్నారు. కాగా, 76వ ఆర్‌ఆర్ (రెగ్యులర్ రిక్రూట్) ఐపీఎస్ బ్యాచ్‌లో 188 మంది భారతీయులు, 19 మంది విదేశీయులు కలిపి మొత్తం 207 మంది ఫేస్-1 బేసిక్ కోర్సులో శిక్షణ పూర్తి చేశారని అకాడమీ డైరెక్టర్ డైరెక్టర్ అమిత్ గార్గ్ తెలిపారు. 19 మంది విదేశీయుల్లో నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన వారు ఉన్నారన్నారు.
గత ఐదేళ్లతో పోలిస్తే ఈ బ్యాచ్‌లో మహిళల సంఖ్య పెరిగిందని చెప్పారు. విధినిర్వహణలో ఎదురయ్యే అన్ని రకాల సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ప్రొబెషనరీ ఐపీఎ్‌సలకు శిక్షణ అందించామని తెలిపారు. అభ్యర్థులందరికీ శిక్షణ కాలంలో కొత్త నేర చట్టాలపై పూర్తి అవగాహన కల్పించామని, సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక తరగతులు నిర్వహించామని అన్నారు. శుక్రవారం ఉదయం జరిగే పాసింగ్ అవుట్ పరేడ్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ముఖ్య అతిధిగా హాజరవుతారని గార్గ్ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెరో నలుగురు...
కేంద్ర ప్రభుత్వం 76వ ఆర్‌ఆర్ బ్యాచ్ నుంచి తెలంగాణకు నలుగురు, ఏపీకి నలుగురు ఐపీఎ్‌సలను కేటాయించింది. మన్నన్ భట్, రుత్విక్ సాయి కొట్టే, సాయికిరణ్ పత్తిపాక, యాదవ్ వసుంధర ఫౌరెబిను తెలంగాణకు కేటాయించారు. ఇక, ఏపీకి కేటాయించిన వారిలో దీక్ష, మనీషా వెంగలరెడ్డి, సుష్మిత, బొడ్డు హేమంత్ ఉన్నారు.
సొంత రాష్ట్రంలో పోస్టింగ్‌తో హ్యాపీ
వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామంలో వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం మాది. ఎంబీఏ చేసి కార్పొరేట్ సెక్టార్‌లో పనిచేశా. స్నేహితులు కొందరు సివిల్స్‌కు సిద్ధమవుతుండడం చూసి నాకు ఆసక్తి కలిగింది. ఉద్యోగం మానేసి సివిల్స్‌పై దృష్టి పెట్టా. మూడో ప్రయత్నంలో ఐపీఎస్ అయ్యా. నన్ను సొంత రాష్ట్రానికి కేటాయించడం సంతోషంగా ఉంది.
- సాయి కిరణ్ పత్తిపాక
శిక్షణలో ఎంతో నేర్చుకున్నా
మాది వరంగల్. నాన్న సోషల్ వెల్ఫేర్ విభాగం ఉద్యోగి. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీలో శిక్షణ తీసుకున్నా. సొంత రాష్ట్రానికి అలాట్ అయినందుకు ఆనందంగా ఉంది. శిక్షణలో ఎంతో నేర్చుకున్నా. బాధితులకు న్యాయం చేసేలా పని చేస్తా.
- రుత్విక్ సాయి కొట్టే
పరిస్థితులే సివిల్స్ వైపు నడిపించాయి
వ్యవసాయ కుటుంబం మాది. నా కుటుంబ నేపథ్యం, గ్రామీణ పరిస్థితులు నన్ను సివిల్స్ వైపు ప్రభావితం చేశాయి. ఇంటర్, డిగ్రీ నుంచి సివిల్స్ సాధించేందుకు అవసరమైన శిక్షణ తీసుకున్నా. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా అకాడమీలో ఇచ్చిన శిక్షణ.. విధులు సక్రమంగా నిర్వహించగలమనే నమ్మకాన్ని ఇచ్చింది. సొంత రాష్ట్రానికి అలాట్ కావడం సంతోషంగా ఉంది.
- మనీషా వెంగలరెడ్డి(ఏపీ కేడర్)
మా నాన్న వల్లే సివిల్స్ వైపు అడుగులు
మాది విశాఖపట్నం. నాన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి. అమ్మ ఉపాధ్యాయురాలు. చిన్నప్పటినుంచి మా నాన్న సివిల్ సర్వీసెస్ గొప్పతనం గురించి చెప్ప డం వల్లే ఈ రంగాన్ని ఎంచుకున్నా. ఐఐటీ ముంబైలో చదువుతున్నప్పుడే సివిల్స్ లక్ష్యంగా మార్చుకుని సన్నద్ధం అయ్యా. మూడో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించా. సొంత రాష్ట్రానికి కేటాయించడం సంతోషంగా ఉంది.
- హేమంత్ బొడ్డు (ఏపీ క్యాడర్)
Updated Date - Sep 19 , 2024 | 03:16 AM