Share News

30% లాభాలంటూ యువతికి 3.16 కోట్లకు టోకరా

ABN , Publish Date - Feb 04 , 2024 | 05:07 AM

హైదరాబాద్‌ యువతి నుంచి రూ.3.16 కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్ల కేసులో వారికి హవాలా రూపంలో సహకరిస్తున్న మరో ముఠా పట్టుబడింది.

30% లాభాలంటూ యువతికి 3.16 కోట్లకు టోకరా

దుబాయ్‌ కేంద్రంగా సైబర్‌ మోసాలు

సొమ్ము హవాలాలో తిరిగి ఇండియాకు

గుజరాత్‌కు చెందిన ముఠా అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ యువతి నుంచి రూ.3.16 కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్ల కేసులో వారికి హవాలా రూపంలో సహకరిస్తున్న మరో ముఠా పట్టుబడింది. స్టాక్‌ మార్కెట్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌ సైట్లలో పెట్టుబడులు పెడితే 30 శాతం లాభాలు వస్తాయని సైబర్‌ నేరగాళ్లు ఆమెను నమ్మించారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఓ ముఠాను సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు దుబాయ్‌, హాంకాంగ్‌ కేంద్రంగా ఉంటూ సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారు కొల్లగొట్టిన డబ్బును హవాలా రూపంలో రప్పిస్తున్న గుజరాత్‌కు చెందిన మరో ముఠాను పోలీసులు ఇప్పుడు కటకటాల్లోకి నెట్టారు. సిటీ క్రైమ్స్‌ అండ్‌ సిట్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ డీసీపీ కవిత, ఏసీపీ శివమారుతితో కలిసి మీడియాకు తెలిపారు. ఓ యువతి స్టాక్‌ మార్కెట్లో ఇన్వె్‌స్టమెంట్‌ చేస్తుండేది. ఈ క్రమంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేశాడు. యూనిటీ స్టాక్స్‌ అనే స్టాక్‌ మార్కెట్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే ఆరు నెలల్లో అత్యధిక లాభాలు వస్తాయని, దాంతో పాటు డెఫాబెట్‌, యూనిట్‌ ఎక్స్చేంజ్‌, టీ-20 ఐపీఎల్‌ వంటి ఆన్‌లైన్‌ గేమింగ్‌ సైట్లలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించాడు. దాంతో ఆమె మొదట కొద్దిమొత్తంలో పెట్టుబడి పెట్టింది.

అతను 30 శాతం లాభాలు వచ్చేలా చేశాడు. దీంతో ఇంకా సంపాదించాలని ఆమెకు ఆశ పుట్టింది. ఇదే అదనుగా భావించిన నిందితుడు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే కోట్లు సంపాదించవచ్చని నమ్మబలికాడు. దాంతో ఆమె ఆస్తులు అమ్మేసింది. రూ.3.16 కోట్లను ఆ నిందితుడు చెప్పిన ఖాతాల్లో వేసింది. డబ్బు చేతికందిన వెంటనే అతను పత్తా లేకుండాపోయాడు. దీంతో ఆమె సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. నాగపూర్‌కు చెందిన రోనాక్‌ తన్నా ముఠా గోవాలో ఉంటూ ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించింది. తన్నాను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు అర్జున్‌, యుగ్‌ దుబాయ్‌, హాంకాంగ్‌లలో ఉంటూ రోనక్‌ తన్నా, జుడిత్‌ గోనాసాల్వేస్‌, సనా మహ్మద్‌ ఖురేషి సహకారంతో ఇండియాలో సైబర్‌ మోసాలు చేస్తున్నట్టు తెలిసింది. దోచుకున్న సొమ్మును అహ్మదాబాద్‌ (గుజరాత్‌ నుంచి హవాలా మార్గంలో సేకరించి తాము చెప్పిన చోటుకి చేర్చడానికి ప్రత్యేక ముఠా ఏర్పాటు చేసుకున్నారు. ఈ ముఠాలోని స్వయం తిమానియా, మీట్‌ తిమానియా, బ్రిజేష్‌ పాటిల్‌, హర్ష పాండియా, శంకర్‌లాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హర్ష అనే నిందితుడు ఫినో బ్యాంకు ద్వారా క్యాష్‌ మ్యానేజ్‌మెంట్‌ సర్వీస్‌ నిర్వహిస్తున్నాడు. అక్కడి నుంచి డబ్బు తీసుకుంటున్న ఇతర నిందితులు అహ్మదాబాద్‌లో ఉంటున్న శంకర్‌లాల్‌ ద్వారా డెలివరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు ముఠాల నుంచి రూ.28 లక్షలు, మూడు ల్యాప్‌టా్‌పలు, 20 మొబైల్‌ ఫోన్లు, 15 డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Feb 04 , 2024 | 05:07 AM