Sangareddy: మాజీ ప్రియుడితో దారుణమైన స్కెచ్.. రోజూ కలుసుకోవాలన్న కోరికతో.. చివరకు
ABN , Publish Date - Jan 20 , 2024 | 06:11 PM
ప్రియుడిపై ఇష్టంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలోని అందోల్ పట్టణంలో శుక్రవారం జరిగింది. డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. అందోల్‌కి చెందిన చాకలి మల్లేశం(30), కల్పన(26) భార్య భర్తలు. కల్పన కాలేజీ చదువుతున్న సమయంలో మహేష్ అనే యువకుడిని ప్రేమించింది.
అందోల్‌లో దారుణ ఘటన
నేరాలకు అడ్డాగా మండల కేంద్రం
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్
అందోల్: ప్రియుడిపై ఇష్టంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేయించింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలోని అందోల్ పట్టణంలో శుక్రవారం జరిగింది. డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. అందోల్‌కి చెందిన చాకలి మల్లేశం(30), కల్పన(26) భార్య భర్తలు. కల్పన కాలేజీ చదువుతున్న సమయంలో మహేష్ అనే యువకుడిని ప్రేమించింది. 2015లో ఆమెకు మల్లేశం అనే యువకుడితో కుటుంబసభ్యులు వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. అన్యోన్యంగా ఉన్న వీరి దాంపత్యంలోకి కల్పన ప్రియుడు మహేష్ మళ్లీ వచ్చాడు. అప్పటి నుంచి ప్రియుడితో సంబంధం ఏర్పరుచుకుంది.
ఆమె భర్త మల్లేశం జోగిపేటలో ఇస్త్రీ దుకాణం నడుపుతున్నాడు. ఈ క్రమంలో ప్రియుడితో కలవడానికి భర్త అడ్డొస్తున్నాడనే కారణంతో మల్లేశాన్ని చంపాలని నిర్ణయించుకుంది. వారు ఉంటున్న డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో అందరితో అన్యోన్యంగా ఉంటూ.. భర్తపై అతి ప్రేమను చూపించేదని స్థానికులు చెబుతున్నారు. భర్తను మట్టుబెట్టాలని ప్రియుడు మచ్కూరి మహేష్‌కి చెప్పడంతో అతను వారి సొంతూరులో ఉన్న మరో ముగ్గురి సాయాన్ని తీసుకుని మట్టుబెట్టడానికి పతకం పన్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5.30 కు మల్లేష్ ఎప్పటిలాగే ఇస్త్రీ దుకాణానికి వెళ్లడానికి స్కూటీ తీశాడు. ఇంటి వెనక్కి రాగానే అప్పటికే రెక్కీ నిర్వహించిన దుండగులు, డబల్ బెడ్రూం ఇళ్లలో కరెంటు తీసేశారు. అటుగా వెళ్తున్న మల్లేషం తలపై బండతో బాదారు. స్పృహ కోల్పోయిన అతన్ని కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. తరువాత అతని గొంతుపై కాలుపెట్టి ఊపిరాడనీయకుండా చేసి చంపేశారు.
మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తరువాత అదే రోజు రాత్రి మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ శివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పెట్రోల్‌తో శవాన్ని కాల్చేశారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడం.. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. కల్పనతో సహా మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తండ్రిని కోల్పోయిన బాధలో ఇద్దరు చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని మల్లేష్ కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ఆందోళన..
నియోజకవర్గం, మండల కేంద్రం, మున్సిపాలిటీ ఇన్ని ప్రత్యేకతలున్న అందోల్‌లో నేర నియంత్రణలో స్థానిక అధికార యంత్రాంగం విఫలమవుతోంది. అందోల్‌లో కనీసం సీసీ కెమెరాలు లేకపోవడంతో నేరాలు పెచ్చుమీరుతున్నాయి. దీంతో ఈ ప్రాంతం నేరాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 నెలల క్రితం డబుల్ బెడ్రూం ఇళ్లకు సమీపంలోని ఓ చిన్నారిపై వృద్ధుడు అత్యాచారానికి ప్రయంత్నించగా స్థానికులు గుర్తించి దేహ శుద్ధి చేశారు.
అందోల్ వడ్డెర హమాలీ కాలనీ, గూడెంలలోని డబుల్ బెడ్రూంలలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని అంటున్నారు. అందోల్‌లోని ప్రధాన ప్రాంతాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను అరికట్టాలని కోరుతున్నారు.