ACB: తొలుత చెల్లింపులు.. తర్వాత ఒప్పందాలు
ABN, Publish Date - Dec 19 , 2024 | 04:34 AM
ఈ-ఫార్ములా కారు రేసు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. సీఎస్ శాంతి కుమారి నుంచి అందిన ఫైల్ ఆధారంగా కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు.
ఈ-ఫార్ములా కారు రేసు కేసులో విచారణ షురూ
సాక్ష్యాధారాలు సేకరించిన ఏసీబీ
హైదరాబాద్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఈ-ఫార్ములా కారు రేసు కేసులో ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. సీఎస్ శాంతి కుమారి నుంచి అందిన ఫైల్ ఆధారంగా కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. డాలర్లలో చేసిన చెల్లింపులు దారి మళ్లాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ముందే చెల్లింపులు జరిపిన తర్వాత ఒప్పందం చేసుకున్న అంశాన్ని ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. ఈ కేసులో నాటి మంత్రి కేటీఆర్ పాత్రకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయన అరెస్టుకు వెళ్లవచ్చునని సమాచారం. రూ.46కోట్లను విదేశీ సంస్ధకు డాలర్లలో చెల్లింపులు జరిపిన విధానంలో అనేక లొసుగులున్నాయని తెలుస్తోంది. వాస్తవంగా విదేశీ సంస్ధలకు డాలర్లు ఇస్తున్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుంటే రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతి తీసుకోవాలి.. ఇక్కడ రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే రూ.46కోట్లను డాలర్ల రూపంలో ఫార్ములా ఈ-ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో)కు చెల్లించడం జరిగింది.
నాటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే ఈ విషయంలో ఫైలు నడిచిందంటూ ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అర్విందకుమార్ రాతపూర్వకంగా సీఎస్ శాంతికుమారికి వివరణ ఇచ్చారు. మొత్తం రూ.55 కోట్లు హెచ్‌ఎండీఏ ఖర్చు చేస్తే ఆ డబ్బు ఏ విధంగా చెల్లింపులు చేశారు., తర్వాత ఆ కంపెనీ ఖాతాల నుంచి దారిమళ్లిందా? అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు విచారించనున్నారని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సరైన నోట్ ఫైల్ లేకుండా డబ్బు చెల్లింపులు చేయడం, ముందు డబ్బులు చెల్లించి.. ఆ తర్వాత ఒప్పందాలు చేసుకున్న విషయాలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీయనున్నారని తెలుస్తోంది.
Updated Date - Dec 19 , 2024 | 04:34 AM