ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medigadda Barrage: బాధ్యులు ఇంజనీర్లు..

ABN, Publish Date - Sep 24 , 2024 | 02:33 AM

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు ప్రాథమికంగా ఇంజనీర్లను బాధ్యులను చేయనున్నారా!? ఇప్పటి వరకూ పూర్తయిన విచారణ ప్రకారం.

  • ప్రాథమికంగా 20 మంది గుర్తింపు.. వీరిలో ఏఈఈ నుంచి ఈఎన్సీ వరకూ!

  • మేడిగడ్డ కుంగుబాటుపై క్రమశిక్షణ చర్యలు

  • జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ యోచన

  • ఉద్దేశపూర్వకంగానే విచారణను తప్పుదోవ

  • పట్టించడానికి ప్రయత్నించారని గుర్తింపు

  • విజిలెన్స్‌ మధ్యంతర నివేదికలో ఇదే ప్రస్తావన

  • నెలాఖరుకు పూర్తిస్థాయి నివేదిక ఇచ్చే చాన్స్‌

  • విచారణకు కాగ్‌ అధికారిని పిలవాలని నిర్ణయం

హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు ప్రాథమికంగా ఇంజనీర్లను బాధ్యులను చేయనున్నారా!? ఇప్పటి వరకూ పూర్తయిన విచారణ ప్రకారం.. ఏఈఈ నుంచి ఈఎన్‌సీ వరకూ దాదాపు 20 మంది ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి కమిషన్‌ వర్గాలు! పలువురు ఇంజనీర్ల అవినీతి, అలసత్వం బ్యారేజీల వైఫల్యానికి కారణమని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, విచారణను తప్పుదోవ పట్టించిన, నేరపూరితంగా వ్యవహరించిన ఇంజనీర్లపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసే యోచనలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఉంది. అవినీతి నిరోధక చట్టం కింద వీరిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని యోచిస్తోంది.


అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన కేసులో ఉన్న ఇంజనీర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని, వీరికి పదోన్నతులు కూడా ఇవ్వరాదంటూ ప్రభుత్వానికి లేఖ రాయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కొంతమంది ఇంజనీర్లు ఉద్దేశపూర్వకంగానే విచారణను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని కమిషన్‌ ఇప్పటికే గుర్తించింది. ఇందులో భాగంగానే, తాము అడిగిన డాక్యుమెంట్లు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేశారని, విచారణలోనూ సహకరించలేదని గుర్తు చేస్తోంది. నిజానికి, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు దాదాపు 33 మంది ఇంజనీర్లను బాధ్యులను చేస్తూ నీటిపారుదల శాఖ ఓ జాబితా సిద్ధం చేసింది. బ్యారేజీ వైఫల్యానికి ఇంజనీర్లు కారణమంటూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కూడా ఇప్పటికే మధ్యంతర నివేదికను సమర్పించింది.


పూర్తిస్థాయి నివేదిక అందించడానికి మరి కొంత గడువు కావాలని కోరగా.. పత్రాలన్నీ ఇస్తే వైఫల్యానికి కారణాలను తామే తే ల్చుకుంటామని కమిషన్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో, ఈ నెలాఖరుకల్లా నివేదిక అందించడానికి విజిలెన్స్‌ అంగీకారం తెలిపింది. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను తమకు అందించాలని నీటిపారుదల శాఖను మరోమారు కమిషన్‌ ఆదేశించింది. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్‌మెంట్‌ రిజిస్టర్‌, ఎం-బుక్‌ (మెజర్‌మెంట్‌ బుక్‌)లు కూడా ఇవ్వాలని తేల్చి చెప్పింది. రెండు రోజులుగా జరిగిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో వీటి ప్రస్తావన ఎక్కువగా రావడంతో.. నిజానిజాల నిర్ధారణకు వీటిని తెప్పించుకోవడమే మేలని కమిషన్‌ నిర్ణయించింది.


  • విచారణకు కాగ్‌ అధికారులు

కాళేశ్వరం ప్రాజెక్టుపై కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) ఇప్పటికే విచారణ నివేదిక ఇచ్చింది. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టకుండా.. రీ ఇంజనీరింగ్‌ చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్థిక అవకతవకలు, తప్పుడు నిర్ణయాలను కడిగి పారేసింది. ఈ నేపథ్యంలోనే, కాగ్‌కు చెందిన అధికారిని పిలిపించి, సమాచారం సేకరించాలని కమిషన్‌ నిర్ణయించింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇప్పటికే పలువురు ఇంజనీర్లను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం నుంచి శనివారం వరకూ దాదాపు మరో 40 మంది ఇంజనీర్లను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. ఈ జాబితాలో మాజీ ఈఎన్‌సీతోపాటు పలువురు అధికారులు ఉండనున్నారు. అనంతరం ఐఏఎ్‌సలు, మాజీ ఐఏఎ్‌సలు; ఆ తర్వాత కీలక ప్రజా ప్రతినిధులకు సమన్లు పంపించనుంది.


  • లాయర్‌ లేకుండానే క్రాస్‌ ఎగ్జామినేషన్‌

ఇకనుంచి న్యాయవాది లేకుండా స్వయంగా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయాలని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ నిర్ణయించింది. వాస్తవానికి శుక్ర, శనివారాల్లో మొత్తం 18 మందిని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసింది. కమిషన్‌ లాయర్‌ను సమకూర్చుకుంటే ప్రతివాదులు కూడా లాయర్లను తెచ్చుకుంటున్నారని, దాంతో, రోజుకు ఒక్కరిని కూడా క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయలేకపోతున్నామని కమిషన్‌ భావిస్తోంది. లాయర్లను అనుమతించడమంటే... విచారణ ప్రక్రియను మరింత జఠిలం, వాయిదా వేయడమే అవుతుందనే అభిప్రాయంతో కమిషన్‌ ఉంది.

Updated Date - Sep 24 , 2024 | 02:33 AM