Court Appearance: కుటుంబ గౌరవానికి భంగం కలిగింది
ABN, Publish Date - Oct 09 , 2024 | 03:25 AM
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు లోనైందని హీరో నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిపై నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో దాఖలు
మంత్రి వ్యాఖ్యలతో అంతులేని మనోవేదన
ఆమె క్షమాపణ కోరలేదు, వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు
సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారు.. క్రిమినల్
పరువు నష్టం కేసులో నాగార్జున, సుప్రియ వాంగ్మూలం
అమల, నాగచైతన్యతో కలిసి నాంపల్లి కోర్టులో హాజరు
తదుపరి విచారణ రేపటికి వాయిదా
క్రిమినల్ పరువు నష్టం కేసులో నాగార్జున వాంగ్మూలం
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు లోనైందని హీరో నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిపై నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాకు సంబంధించి నాగార్జున, అతడి మేనకోడలు సుప్రియ మంగళవారం కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మరో సాక్షి మెట్ల వెంకటేశ్వర్ వాంగ్మూలాన్ని గురువారం నమోదు చేయాలని నిర్ణయించారు. ముగ్గురి వాంగ్మూలాలను పరిశీలించాక మంత్రికి సమన్లు ఇచ్చే విషయమై న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకుంటారు. మంగళవారం మధ్యాహ్నం నాగార్జునతో పాటు భార్య అమల, సోదరి నాగసుశీల, కొడుకు నాగచైతన్య, మేనకోడలు సుప్రియ కోర్టుకు వచ్చారు. అసలు పరువు నష్టం దావా ఎందుకు దాఖలు చేశారని న్యాయమూర్తి శ్రీదేవి ప్రశ్నించారు.
నాగార్జున వాంగ్మూలమిస్తూ, ‘‘దేశ వ్యాప్తంగా ఎందరో ప్రజల ఆదరాభిమానాలను పొందిన నాపై, నా కుటుంబంపై మంత్రి కొండా సురేఖ రాజకీయ దురుద్దేశంతో అమర్యాద పూర్వకంగా మాట్లాడారు. నా కొడుకు నాగ చైతన్య విడాకుల వ్యవహారం గురించి పూర్తి అవాస్తవమైన, అసత్యమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్ కన్వెన్షన్’’ కూల్చకుండా ఉండాలంటే మాజీ మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్లాల్సిందిగా నేను సమంతను ఒత్తిడి చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేకుండా మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సినీ రంగంలో, జాతీయ స్థాయిలో మా కుటుంబ సభ్యులు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు సాధించారు. సమాజం పట్ల బాధ్యతతో మా కుటుంబం చాలా ఏళ్లగా అనేక సేవా కార్యక్రమాలను కూడా చేస్తోంది. అలా దశాబ్దాలుగా తన కుటుంబం నిర్మించుకున్న గౌరవ మర్యాదలకు మంత్రి చేసిన వ్యాఖ్యలతో భంగం కలిగింది.
తీవ్ర మనోవేదనకు లోనయ్యాం. అవమానం ఎదుర్కొన్నాం. ఇప్పటి వరకు మంత్రి కనీసం మమ్మల్ని క్షమాపణలు కోరలేదు, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోలేదు. బాధ్యతా యుతమైన మంత్రి పదవిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం, సినీరంగంపై రాజకీయాలు చేయడం సబబు కాదు’’ అన్నారు. నాగార్జున మేనకోడలు సుప్రియ ప్రథమ సాక్షిగా సురేఖ చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తికి చదివి వినిపించారు. ‘‘మంత్రి సురేఖ వ్యాఖ్యలు షాక్‌కు గురి చేశాయి. ఆమె వ్యాఖ్యలతో మా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోయింది. నాగ చైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే కారణమని, ఎన్ కన్వెన్షన్ వ్యవహారం గురించి కేటీఆర్ దగ్గరకు సమంతను నాగార్జున వెళ్లమంటే ఆమె ఒప్పుకోలేదని, అందుకే విడాకులు తీసుకుందని సురేఖ చేసిన వ్యాఖ్యలను వార్త చానెళ్లు, పత్రికల్లో చూసి షాక్‌కు గురయ్యా. అసలు ఆమె మా కుటుంబం గురించి ఇలా ఎందుకు మాట్లాడారో అర్ధం కావడం లేదు. సినీ పరిశ్రమను రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే సురేఖ వ్యాఖ్యలను చిత్ర పరిశ్రమ మొత్తం ముక్తకంఠంతో ఖండించింది’ అని సుప్రియ తన వాంగ్మూలంలో చెప్పింది.
ఆధారాలు సమర్పించాం: అశోక్‌రెడ్డి
ఈ కేసుకు సంబంధించి నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ‘అక్కినేని నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వీడియోలను, టీవీ చానెళ్లు, పత్రికలు, వివిధ వెబ్‌సైట్లలో వచ్చిన వార్తలను కోర్టుకు ప్రాథమిక సాక్ష్యాలుగా సమర్పించాం. తదుపరి విచారణను న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 356 ప్రకారం కేసు నమోదు చేయాలని పిటిషన్‌లో కోరాం’ అని చెప్పారు.
కేసు నిలబడదు: తిరుపతివర్మ
టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ తిరుపతి వర్మ మాట్లాడుతూ, ‘‘నాగార్జున, సుప్రియ వాంగ్మూలాలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. ఆ వాంగ్మూలాలను బట్టి చూస్తుంటే కేసు నిలబడదని అనిపిస్తోంది. మంత్రికి న్యాయస్థానం సమన్లు ఇస్తే న్యాయ పోరాటం చేస్తాం. ఎంతదూరమైన వెళ్తాం. సురేఖపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాం’’ అని తెలిపారు.
Updated Date - Oct 09 , 2024 | 03:25 AM