‘మహాలక్ష్మి’తో పెరిగిన రద్దీ
ABN , Publish Date - Dec 08 , 2024 | 11:11 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంతో మంచిర్యాల డిపో పరిధిలో రద్దీ పెరిగింది. డిసెంబరు 9, 2023న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలులోకి తీసుకువచ్చింది. నాటి నుంచి జీరో టికెట్‌తో మహిళలు ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు వెసలుబాటు కల్పించారు.

మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంతో మంచిర్యాల డిపో పరిధిలో రద్దీ పెరిగింది. డిసెంబరు 9, 2023న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలులోకి తీసుకువచ్చింది. నాటి నుంచి జీరో టికెట్‌తో మహిళలు ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు వెసలుబాటు కల్పించారు. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నప్పటికి ఆర్టీసీ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్ధానాలకు చేరుస్తోంది. జిల్లాలో రోజు 36 వేల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. 60 శాతం మహిళలు ప్రైవేటు, ఇతర ఉద్యోగాలు చేస్తూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
-బస్సు రూట్లు బిజీ
మహాలక్ష్మీ పథకంతో జిల్లాలోని ఏడు బస్సు రూట్లు బిజీగా మారాయి. 1975లో ఆర్టీసీ డిపో ప్రారంభం నాటి నుంచి సంవత్సరం ముందు ఇలాంటి రద్దీ చూడలేదని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మంచిర్యాల డిపోలో పల్లె వెలుగు బస్సులు 90, ఎక్స్‌ప్రెస్‌లు 21 నడుస్తుండగా ఇందులో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. డిపో పరిధిలో 58 రూట్లు 151 బస్సులు రోజుకు 60 వేల కిలోమీటర్లు నడిపిస్తున్నారు. రోజుకు 33లక్షల6 వేల రూపాయలు ఆదాయం సమకూరుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
-మహాలక్ష్మీ పథకంతో సిరుల పంట
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని మంచిర్యాలలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, కలెక్టర్, ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. యేడాది కాలంలో ఆర్టీసీ బస్సుల్లో కోటి 31 లక్షల 682 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా 48 కోట్ల 46 లక్షల 52వేల రూపాయల ఆదాయం సమకూరింది. రోజు జిల్లాలో 36,765 మంది బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఒక రోజుకు రూ.30 లక్షల ఆదాయం లక్ష్యం పెట్టుకోగా ఈ ఉచిత పథకంతో 33లక్షల6 వేల ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతీ నెల ప్రభుత్వం చెల్లింపులు చేసిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా 8 కోట్ల 97 లక్షల రూపాయల లాభాలతో నడుస్తోంది.
మహిళల నుంచి అపూర్వ స్పందన వస్తుంది
- ఎస్. జనార్ధన్, మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్
మహాలక్ష్మీ పథకానికి మహిళల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రయాణిస్తున్నారు. మహిళలు, పురుషులు ఇబ్బందులు పడకుండా అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాం. ఆర్టీసీకి మంచి ఆదాయం సమకూరుతుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్నాం. ప్రభుత్వం చేయూతతో అప్రమత్తంగా ఉంటూ ప్రయాణికులను గమ్యస్ధానాలను తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం.
-రూ. 5 వేల వరకు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతున్నాయి -సుమలత, ప్రైవేటు ఉద్యోగి, జైపూర్
నేను మంచిర్యాలలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తా. రోజు జైపూర్ నుంచి మంచిర్యాలకు ఆర్టీసీ బస్సుల్లో వచ్చిపోతూ ఉంటాను. మహిళలకు ఉచిత ప్రయాణం పథకం లేక ముందు నెలకు రూ. 4 వేల నుంచి 5 వేల వరకు ప్రయాణానికి ఖర్చుఅయ్యేవి. వచ్చిన జీతం సగం ప్రయాణ ఖర్చులకే పోయేవి. బస్సుల్లో ఉచిత ప్రయాణంతో డబ్బులు ఆదా అవుతున్నాయి. బస్సులు తక్కువగా ఉండడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు నిలబడి వెళ్లాల్సి వస్తుంది. ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్యను పెంచాలి.