దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు
ABN , Publish Date - Jun 18 , 2024 | 10:12 PM
కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వేసవిలో దిగుబడి తక్కువ ఉండడంతో కూరగాయల ధరలు పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు

బెల్లంపల్లి, జూన్ 18 : కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వేసవిలో దిగుబడి తక్కువ ఉండడంతో కూరగాయల ధరలు పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రైతులు ఇతర పంటల సాగు వైపు మొగ్గుచూపడంతో కూరగాయలు సాగు తగ్గిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటుండడంతో రవాణా ఖర్చులతో కూరగాయల ధరలకు రెక్కలొస్తున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలో కూరగాయల ధరలు మూడింతలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
-వేసవి కాలం ప్రభావం
వేసవి కాలంలో దిగుబడులు తగ్గిపోవడంతో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాపారులు చెబుతున్నారు. సీజన్‌లో రోజు దాదాపు 800 నుంచి 1000 క్వింటాళ్ల వరకు కూరగాయలు దిగుమతి అవుతాయని, ప్రస్తుతం రోజుకు 400 నుంచి 500 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వీటిలో కొన్ని కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. స్ధానిక మండలాల నుంచి కూరగాయలు తక్కువ మొత్తంలో మార్కెట్‌కు చేరుతుండడంతో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఏప్రిల్, మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రైతులు సాగు చేసిన కూరగాయలు చీడ పురుగుల బెడదతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని కూరగాయల విక్రయదారులు చెబుతున్నారు. పెట్టుబడి ఖర్చులు అధికమవడం, దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు
-ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నాం - కిరణ్ , బెల్లంపల్లి
కూరగాయల ధరలు పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. కొన్ని రోజుల క్రితం రూ. 200కు వారానికి సరిపడ కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ. 400 నుంచి 500లు పెడితేనే కూరగాయలు వస్తున్నాయి. పెరిగిన ధరలతో కూరగాయలను కొనలేకపోతున్నాం.
కూరగాయల ధరలు ఇలా
గత నెల ప్రస్తుతం (కిలోల)
టమాటా రూ.20 రూ.80
పచ్చిమిర్చి రూ.70 రూ.120
కాకరకాయ రూ.50 రూ.100
బీరకాయ రూ.60 రూ.100
వంకాయ రూ.40 రూ.70
కొత్తిమీర గత నెలలో పావుకిలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.160కు చేరింది. ఆకుకూరలు 2 కట్టలకు రూ.10 ఉండగా ప్రస్తుతం రూ.20 నుంచి 30కి అమ్ముతున్నారు. ఇలా కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.