Assembly : అందినకాడికి దోచేశారు.. బీఆర్ఎస్‌పై అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 20 , 2024 | 03:40 PM
శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారశైలిని నిరసిస్తూ వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. మజ్లిస్ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు ప్రజల కోసం పోరాడుతున్నారా ? లేకపోతే కుటుంబం కోసం పోరాటం చేయడానికి వచ్చారా? అని విరుచుకుపడ్డారు. అందినకాడికి దోచేశారని..
శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారశైలిని నిరసిస్తూ వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. మజ్లిస్ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ. ఫార్ములా ఈ-రేసుపై ఏసీబీ కేసు నమోదుచేయడంతో.. భారాస ఎమ్మెల్యేలు ఈ విషయమై సభలో చర్చకు పట్టుబట్టారు. ఏ-1గా భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను చేర్చడం సరికాదంటూ నిరసనకు దిగడంతో.. అసెంబ్లీలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారాస ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్తుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. ఫార్మూలా ఈ-రేసుపై తర్వాత చర్చిద్దామని చెప్పినా వినిపించుకోకుండా పేపర్లు సభాపతి వైపు విసిరారు. దీంతో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ బీఆర్ఎస్ సభ్యులపై పేపర్లు విసిరేయడంతో సభలో ఆందోళన చెలరేగింది. ఈ పరిణామాలపై అక్బరుద్దీన్ ఒవైసీ ఏమన్నారంటే..
ఫార్ములా ఈ-రేసు కేసులో కేటీఆర్ పేరు చేర్చడంపై అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు . దీంతో సభలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. దూషణలు, నిరసనలతో మొదలైన వాగ్వాదం అధికార, విపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర పరిణామాలకు దారితీసింది. దీంతో మజ్లిస్ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు ప్రజల కోసం పోరాడుతున్నారా ? లేకపోతే కుటుంబం కోసం పోరాటం చేయడానికి వచ్చారా? అని విరుచుకుపడ్డారు. మేము ప్రజల తరపున పోరాటం చేస్తున్నాం. మీరేమో ఒక కుటుంబం కోసం అసెంబ్లీలో పోరాటం చేయడానికి రావడం ఏంటని నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో సభ్యులు అనుసరించే వ్యూహం ఇదేనా...? దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
గత 10ఏళ్ళు తెలంగాణలో కచరా గవర్నమెంట్ ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ. ముమ్మాటికీ ధరణిలో అక్రమాలు జరిగాయని.. ధరణి కేవలం కేసీఆర్ కుటుంబం కోసం తీసుకొచ్చారని ఆరోపించారు. భూ భారతి బిల్లుపై చర్చ జరగనీయకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా నిరసించారు. మీకు కేసీఆర్ ఇదే నేర్పిస్తున్నారా?.. వ్యక్తిగత అవసరాల కోసం అసెంబ్లీలో ఇలా వ్యవహరించడం విచారకరమని అని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక బిల్లుపై చర్చకు సహకరించాలని కోరారు. అయినా, ఫార్ములా ఈ-రేసు అంశంపై చర్చ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసనలు కొనసాగించారు. దీంతో, అసెంబ్లీలో గందరగోళ వాతావరణం సృష్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు అక్బరుద్దీన్.
Updated Date - Dec 20 , 2024 | 03:44 PM