TSMIDC: టీఎ్‌సఎంఎ్‌సఐడీసీలో దోపిడీ ముఠా!
ABN, Publish Date - Jul 15 , 2024 | 04:21 AM
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ)లో పొరుగు ఉద్యోగుల పెత్తనం సాగుతోంది. కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక ముఠాగా మారి, దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గుప్పిట్లో కార్పొరేషన్.. ఏళ్లుగా ఆయా స్థానాల్లో పాతుకుపోయి అక్రమాలు
మందుల కంపెనీల నుంచి ముడుపులు
ఎండీగా కర్ణన్ వచ్చాక పలువురి బదిలీ
వైద్య మంత్రి పేషీ అండదండలతో ఇద్దరు మాత్రం అక్కడే కొనసాగింపు
మళ్లీ సంస్థలో పాగా వేసేందుకు బదిలీ అయిన ఉద్యోగి పైరవీలు
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ)లో పొరుగు ఉద్యోగుల పెత్తనం సాగుతోంది. కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక ముఠాగా మారి, దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల మందులను కొనుగోలు చేసే సంస్థలో కీలక బాధ్యతలన్నీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకే అప్పగించడంతో అక్రమాలకు అంతులేకుండా పోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర ఔషధాలకు బదులు అవసరం లేనివి కొనడం, రేటు కాంట్రాక్టులో లేకున్నా కాసులు కురిపించే మందులను కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. కొన్నేళ్లుగా టీఎ్‌సఎంఎ్‌సఐడీసీలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
మొన్నటి దాకా ముగ్గురి గుప్పిట్లో..
కొన్ని రోజుల క్రితం వరకు టీఎ్‌సఎంఎ్‌సఐడీసీలో ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఒక రిటైర్డ్ కాంట్రాక్టు ఉద్యోగి గుత్తాధిపత్యం చెలాయించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కార్పొరేషన్ ఎండీగా ఐఏఎస్ అధికారి కర్ణన్‌ను నియమించింది. ఆయన వచ్చాక కార్పొరేషన్‌లో ప్రక్షాళన చర్యలు చేపట్టారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన వారిని బదిలీ చేశారు. ముఖ్యంగా డయాగ్నస్టిక్స్‌లో పని చేసే ఔట్‌సోర్సింగ్ ఫార్మసిస్టును ఇక్కడి నుంచి వేరే జిల్లాకు పంపారు. డయాగ్నస్టిక్స్‌కు సంబంధించిన రీఏజెంట్ల కొనుగోలులో అతడు చెప్పిందే వేదం అన్నట్టుగా సాగేది. ఆయనకు నచ్చిన, మెచ్చిన... జేబులు నింపే కంపెనీల రీఏజెంట్లనే ఆర్డర్ పెట్టేవాడు. అంతేకాదు సరాఫరాదారులను బెదిరించడం, వారి దగ్గరి నుంచి బలవంతంగా డబ్బులు వసూల్ చేసేవాడు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అతడిని వేరే జిల్లాకు పంపించారు. అయితే, ఎండీ పోస్టు నుంచి కర్ణన్ బదిలీ కావడంతో సదరు వ్యక్తి మళ్లీ సంస్థలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
ఇందుకోసం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కార్యాలయం చుట్టూ రోజూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదని, తనకు మళ్లీ కార్పొరేషన్‌లో పని చేసే అవకాశం కల్పించాలని పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఆందోల్‌కు చెందిన నేత ద్వారా మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అతడు కార్పొరేషన్‌లో లేకున్నా సరఫరాదారులకు ఫోన్ చేసి డబ్బులు అడగడమే కాకుండా కార్యాలయానికి వచ్చి గంటల కొద్దీ కూర్చుంటున్నాడు. సంస్థలోని కీలక అధికారి ఆయనకు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇక, రిటైరై కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అరాచకాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగులను ఏక వచనంతో సంబోధించడం, కించపర్చడం ఆయనకు పరిపాటేనన్న ఆరోపణలున్నాయి.
అన్ని కొనుగోళ్లలో వసూళ్ల పర్వం కొనసాగిస్తారన్న విమర్శలున్నాయి. ఇక క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పని చేసే మరో ఔట్‌సోర్సింగ్ ఫార్మసిస్టు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలున్నాయి. ఔషధాలను నాణ్యత పరీక్షలకు పంపి, ఆ రిపోర్టులను చూసే బాధ్యత ఆ ఉద్యోగిదే. దీంతో ఫార్మా కంపెనీలు అతడి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఇలా.. ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులే కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో అందరినీ బదిలీ చేసినా...ఆ రిటైర్డ్ కాంట్రాక్టు ఉద్యోగి, క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగిని మార్చలేదు. వైద్య శాఖ మంత్రి పేషీ అండదండలతోనే వారు అక్కడే కొనసాగుతున్నట్లు తెలిసింది.
రెగ్యులర్ ఉద్యోగులేరి?
ఏటా వందల కోట్ల టర్నోవర్ ఉండే కార్పొరేషన్‌లో రెగ్యులర్ ఉద్యోగులు లేకపోవడం, అంతా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు చేతుల్లో ఉండడంతో అక్రమాలకు అడ్డు లేకుండా పోతోంది. రెగ్యులర్ ఉద్యోగులైతే ఏ తప్పు చేసినా.. వారిపై చర్యలుంటాయి. అదే ప్రైవేటు వ్యక్తులైతే ఉద్యోగం నుంచి తీసేయడం మినహా ఏ చర్యలూ ఉండవు. అందుకే వీరంతా బరితెగిస్తున్నారు. గతంలో కార్పొరేషన్‌లో ఐదుగురు రెగ్యులర్ ఫార్మసిస్టులు ఉండేవారు. ప్రొక్యూర్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్‌కు వేర్వేరుగా జనరల్ మేనేజర్లు ఉండేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇప్పటికైనా పొరుగు ఉద్యోగులను తప్పించి, వారు చేసిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వైద్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
Updated Date - Jul 15 , 2024 | 04:21 AM