Sheri lingampally: '59 జీవో' దస్త్రాలన్ని మాయం!
ABN, Publish Date - Dec 15 , 2024 | 04:41 AM
శేరిలింగంపల్లి.. రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన రెవెన్యూ మండలం. హైదరాబాద్ మహా నగరానికి పశ్చిమాన ఐటీ కారిడార్‌ను కలిగి ఉన్న ఈ మండలంలో చదరపు గజం విలువ రూ.లక్షల్లోనే..! ఎకరాకు వంద కోట్లు చెల్లించేందుకు ముందుకొస్తే కానీ భూములు, స్థలాలు దొరకవు.
శేరిలింగంపల్లి తహసీల్దార్ ఆఫీసులో మిస్సింగ్
ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలకూ చేరని తీరు
ఎన్నికల వేళ అడ్డగోలుగా కన్వేయన్స్ డీడ్లు
వందల కోట్లు విలువైన భూములు పరాధీనం ’ఆంధ్రజ్యోతి’ కథనాలతో లావాదేవీలు బంద్
విచారణ అధికారిగా అప్పటి అదనపు కలెక్టర్
4 నెలల క్రితం ఆయన ఏసీబీకి చిక్కడంతో అప్పటి విచారణ నివేదికపై అనుమానాలు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి.. రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన రెవెన్యూ మండలం. హైదరాబాద్ మహా నగరానికి పశ్చిమాన ఐటీ కారిడార్‌ను కలిగి ఉన్న ఈ మండలంలో చదరపు గజం విలువ రూ.లక్షల్లోనే..! ఎకరాకు వంద కోట్లు చెల్లించేందుకు ముందుకొస్తే కానీ భూములు, స్థలాలు దొరకవు. కానీ, గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 59 కింద ఈ మండలంలోని ప్రభుత్వ భూములను కొందరు అక్రమార్కులు అప్పనంగా కొట్టేశారు. సరిగ్గా ఎన్నికల ఫలితాలకు ముందు రోజే విలువైన ప్రభుత్వ భూములు పరాధీనమయ్యాయి. ఈ విషయాన్ని ’ఆంధ్రజ్యోతి’ బట్టబయలు చేయగా.. సంబంధింత కన్వెయన్స్ డీడ్లను నిలిపివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే, 59 జీవో కింద అధికారులు పరిష్కరించిన క్రమబద్ధీకరణ దస్ర్తాలేవీ శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. సంబంధిత దస్ర్తాలను ధ్వంసం చేశారా? లేకుంటే మాయం చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి 2014కు ముందు జరిగిన అక్రమణలను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం 2016లో జీవో 58, 59 తీసుకురాగా.. ఆ సందర్భంలోనే చాలావరకు పేదలు, ఆయా స్థలాల్లో ఉన్న వారు క్రమబద్ధీకరించుకున్నారు. కానీ, ఆ తర్వాత 58, 59 జీవోలను రెండు దఫాలుగా 2020, 2022లో పొడిగించడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములను చెరబట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు రోజే శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్ 74లో 30మందికి సంబంధించి 12,879 చదరపు గజాలను క్రమబద్ధీకరించడంపై ‘ఫలితాలకు ముందురోజే భూమేత’ అనే శీర్షికతో గత ఏడాది డిసెంబరు 11న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అలాగే, నానక్‌రాంగూడలోని సర్వే నంబర్ 149లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని 15మంది పేరిట క్రమబద్ధీకరించడంపై ‘భూంఫట్ స్వాహా’ శీర్షికతో జనవరి 10న మరో కథనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. ఇవి చర్చనీయాంశం కావడంతో సంబంధిత కన్వెయన్స్ డీడ్లను ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించింది. వారం పాటు ఆయన విచారణ జరిపినా.. ఆ నివేదిక బయటకు రాలేదు. ఇంతలో ఓ రైతు నుంచి రూ.8లక్షలు లంచం తీసుకుంటూ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఆయన ఇచ్చిన విచారణ నివేదికపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కార్యాలయం నుంచి ఎలా మాయమైనట్టు?
శేరిలింగంపల్లి మండలంలో మూడు దఫాలుగా ప్రభుత్వ భూములు, స్థలాలను క్రమబద్ధీకరించారు. 59 జీవో కింద వచ్చిన దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లో రాగా.. వాటిని పరిష్కరించే క్రమంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలోనే వాటి ఆఫ్‌లైన్‌లోకి మార్చారు. 3 దఫాలుగా రికార్డులను రూపొందించారు. కానీ, ప్రస్తుతం శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత దస్ర్తాలు అందుబాటులో లేవు. ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలకూ చేరినట్లు సమాచారం లేదు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల వెబ్‌సైట్‌ను ఇప్పటికే మూసివేయగా.. తాము బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అలాంటి దస్త్రాలేవీ కనిపించలేదని ప్రస్తుతం ఉన్న అధికారులు చెబుతున్నారు. దస్ర్తాల మాయం వెనుక బడా బాబుల హస్తం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
క్లీన్‌చిట్ రావడంతోనే కీలక పదవులు
మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 59జీవో దుర్వినియోగమైన అంశాన్ని ప్రస్తావించారు. శేరిలింగంపల్లి మండలంలో అక్రమంగా క్రమబద్ధీకరించిన స్థలాల విలువ 1900కోట్ల మేర ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయా స్థలాల రిజిస్ర్టేషన్లను రద్దు చేసి నిషేధిత జాబితాలో పెడతామని ప్రకటించారు. అయితే, శేరిలింగంపల్లి మండలంలో అక్రమ క్రమబద్ధీకరణల్లో అప్పటి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌తోపాటు అప్పటి గండిపేట తహసీల్దార్ భాగస్వామ్యం ఉన్నన్నట్లు ఆరోపణలున్నాయి. అయితే, అప్పటి అదనపు కలెక్టర్ విచారణ సందర్భంలో రెవెన్యూ అధికారులకు క్లీన్ చీట్ ఇచ్చిన్నట్లుగా తెలుస్తోంది. ఆ కారణంగానే శేరిలింగంపల్లి, గండిపేట తహసీల్దార్ కార్యాలయ అధికారులంతా కీలక పోస్టులను దక్కించుకున్నట్లు సమాచారం.
Updated Date - Dec 15 , 2024 | 04:41 AM