Allu Arjun: జైల్లో పుష్ప
ABN, Publish Date - Dec 14 , 2024 | 03:14 AM
సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా సవాలు విసిరే పుష్పరాజ్.. నిజ జీవితంలో మాత్రం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వెండితెరపై ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజం ప్రదర్శించిన నటుడు చట్టం ముందు తగ్గాల్సివచ్చింది.
బెయిల్ వచ్చినా అల్లు అర్జున్ విడుదల వాయిదా!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు
గంటసేపు విచారించిన పోలీసులు
గాంధీలో వైద్యపరీక్షలు.. నాంపల్లి కోర్టులో హాజరు
14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం
చంచల్‌గూడ జైలుకు.. హైకోర్టుకెళ్లిన నటుడు
నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్
సకాలంలో జైలుకు చేరని బెయిల్ ఉత్తర్వులు
రాత్రి 10.30 గంటల తర్వాత పత్రాల అప్‌లోడ్
నేడు ఉదయం విడుదల చేస్తామన్న అధికారులు
అల్లు అర్జున్ అరెస్టుతో దేశవ్యాప్తంగా సంచలనం
హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి/రాంనగర్/అడ్డగుట్ట, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా సవాలు విసిరే పుష్పరాజ్.. నిజ జీవితంలో మాత్రం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వెండితెరపై ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజం ప్రదర్శించిన నటుడు చట్టం ముందు తగ్గాల్సివచ్చింది. తన సినిమా ప్రీమియర్ షో చూసేందుకు థియేటర్‌కు స్వయంగా వెళ్లి.. తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే ఆ వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. ఆ పత్రాలు సకాలంలో జైలుకు చేరకపోవడంతో అల్లు అర్జున్ విడుదల వాయిదా పడింది. కోర్టు ఉత్వర్వులు అప్‌లోడ్ చేసేసరికి రాత్రి 10.30 గంటలు దాటిపోవడంతో ఆయనను శనివారం ఉదయం విడుదల చేస్తామని జైలు అధికారులు ప్రకటించారు. దీంతో రాత్రంతా ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, అల్లు అర్జున్ అరెస్టు దగ్గర్నుంచి రాత్రి విడుదల వాయిదా పడేదాకా రోజంతా హైడ్రామా నడిచింది. ఆయన అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్‌కు సంఘీభావం ప్రకటించగా.. అరెస్టును ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీతోపాటు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పుబట్టారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్ది మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవుతుందనగా.. ఈ నెల 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుక్‌నగర్‌కు చెందిన రేవతి(35) మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ (13) అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరితోపాటు తొక్కిసలాటలో మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ రావడం కూడా కారణమని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆయనపై 105 (హత్య కిందకు రాని ప్రాణ నష్టం ), 118(1) (ప్రమాదకరంగా వ్యవహరించడం, వేరే వ్యక్తులు గాయపడేందుకు కారణం కావడం) రెడ్‌విత్ 3(5), నాన్‌న్ బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి ఏ11గా చేర్చారు. అల్లు అర్జున్ నేరుగా థియేటర్‌లోకి వెళ్లకుండా, బయట క్రిస్టల్ హోటల్ నుంచి ఓపెన్ టాప్ కారులో అభిమానులకు అభివాదం చేసుకుంటూ రావడంతో ఒక్కసారిగా వందలాది అభిమానులు ఆయనవైపు చొచ్చుకొని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళ మృతి చెంది, ఆయన కొడుకు తీవ్ర గాయాలపాలయ్యారని సెంట్రల్ జోన్ డీసీపీ మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. ఇటీవల థియేటర్ భాగస్వామి ఎం.సందీప్, మేనేజర్ నాగరాజు, బాల్కనీ ఇన్‌చార్జి విజయ్ చందర్‌లను అరెస్టు చేశారు. కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్ శుక్రవారం ఇంట్లోనే ఉన్నట్లు తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు 11:30కు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌తోపాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ సైతం పోలీసుల కారులోనే మధ్యాహ్నం 12:30కు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయనను పీఎ్‌సకు తరలిస్తుండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పీఎస్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గంటపాటు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు..
అల్లు అర్జున్‌ను పీఎ్‌సలోకి తీసుకువెళ్లిన తర్వాత ఎవరినీ లోనికి రాకుండా పోలీసులు గేట్లు మూసివేశారు. డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ ఆధ్వర్యంలోని బృందం సుమారు గంటపాటు ఆయనను విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఓవైపు ప్రశ్నిస్తూనే రిమాండ్ రిపోర్ట్‌ను తయారు చేశారు. మధ్యాహ్నం 1:30కు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ‘పుష్ప అరెస్టు’ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన్ను చూసేందుకు అభిమానులతోపాటు.. స్థానిక ప్రజలు ఎగబడ్డారు. దాంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. అల్లు అర్జున్‌ను విచారిస్తున్న క్రమంలో ఆయన తండ్రి అల్లు అరవింద్, సినీ నిర్మాత దిల్ రాజు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిని మాత్రమే లోపలికి రానిచ్చారు. ఆయన సోదరుడు అల్లు శిరీష్, కోల శ్రీకాంత్ అనే స్నేహితుడు పీఎ్‌సకు చేరుకోగా వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా, మధ్యాహ్నం 2:15 గంటలకు అల్లు అర్జున్‌ను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజు ఆధ్వర్యంలో బీపీ, షుగర్, కొవిడ్ వంటి వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం భారీ బందోబస్తు నడుమ 3:10 గంటలకు నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. సుమారు 45 నిమిషాలపాటు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సాయంత్రం 4:00 గంటలకు అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అల్లు అర్జున్‌ను నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచిన క్రమంలో హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్ కోర్టులోనే ఉండి పోలీస్ భద్రత, బందోబస్తును పర్యవేక్షించారు.
చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు..
హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు అల్లు అర్జున్ అరెస్టును ప్రకటించడంతో చంచల్‌గూడ జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విఽధించడంతో ప్రత్యేక పోలీస్ బృందం భారీ బందోస్తు నడుమ అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు.
అరెస్టుకు ముందు పోలీసులపై ‘పుష్ఫ’ ఫైర్..
సంఽధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసేందుకు వచ్చిన చిక్కడపల్లి పోలీసులపై తొలుత ఆయన ఫైర్ అయినట్లు తెలిసింది. బట్టలు మార్చుకుని వస్తానని చెప్పినా.. పోలీసులు అనుమతించకపోవడంతో ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నట్లు సమాచారం. ‘‘మీరు ఇక్కడికి రావడం, నేను మీతో స్టేషన్‌కు రావడంలో తప్పులేదు. కానీ, బెడ్రూం నుంచి నేరుగా తీసుకెళతాననడం సరికాదని పోలీసులపై ఫైర్ అయినట్లు తెలిసింది. మరోవైపు అల్లు అర్జున్ కంటే ముందే ఆయన తండ్రి అరవింద్ పోలీసు వాహనంలోకి ఎక్కగా.. ఆయన్ను కారులో రావద్దని పోలీసులు వారించారు. అయినా, వినకపోవడంతో అల్లు అర్జున్ కలుగజేసుకొని.. మంచైనా, చెడైనా తనకే వదిలేయండని తండ్రికి చెప్పారు. తండ్రిని కారునుంచి దించేశారు. ఇక అరెస్టుకు ముందు అర్జున్ కాఫీ తాగుతూ.. తన పక్కనే విచారవదనంతో ఉన్న అయన సతీమణిని ఓదార్చారు. కంగారు పడవద్దని భరోసా ఇచ్చారు. ఆపై బుగ్గపై సుతారంగా ముద్దాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బందోబస్తు కోసం చాలా దరఖాస్తులు వస్తుంటాయి: డీసీపీ
రాజకీయ నాయకులు, సినీ నటులు, ధార్మిక కార్యక్రమాల సందర్భంగా పోలీస్ బందోబస్తు కోసం అనేక లేఖలు వస్తుంటాయని, కార్యక్రమంలో పాల్గొనే వారిని బట్టి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ తెలిపారు. పెద్ద స్థాయిలో బందోబస్తు కావాలనుకున్న వారు, డీసీపీ, ఏసీపీని కలిసి వివరాలు తెలిపితే దానికి తగిన విధంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా బందోబస్తు ఏర్పాటు కోసం సంధ్యా థియేటర్ నిర్వాహకులు బందోబస్తు కోసం చిక్కడపల్లి పోలీసులకు పంపిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దానిపై డీసీపీ వివరణ ఇచ్చారు. సంధ్య థియేటర్ నిర్వాహకులు అధికారులను కలవకుండా ఇన్‌వార్డ్ విభాగంలో లేఖను అందించారని తెలిపారు. దానికి తగిన విధంగా ధియేటర్ బయట తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆ సినిమా హీరో అల్లు అర్జున్ వచ్చేవరకు జనాలు అదుపులో ఉన్నారని, ఆయన వచ్చి కారు రూఫ్ టాప్ నుంచి బయట ఉన్న అభిమానులకు చేయి ఊపడంతో చాలా మంది థియేటర్ వైపునకు వచ్చారని తెలిపారు. అదే సమయంలో అల్లు అర్జున్ ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది వాహనానికి దారి కల్పించడానికి గుంపుగా చేరిన అభిమానులను పక్కకు నెట్టడం ప్రారంభించారని, దాంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు. ఇక అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు ఆయనకు దుస్తులు మార్చుకునే అవకాశం ఇవ్వలేదని, ఆయన సతీమణి పట్ల దురుసుగా ప్రవర్తించారన్న ప్రచారంలో నిజం లేదని డీసీపీ అన్నారు. అల్లు అర్జున్‌కు ఆయన భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు కూడా తగినంత సమయం ఇచ్చామని తెలిపారు. ఆయనే స్వయంగా వచ్చి పోలీస్ వాహనం ఎక్కారని పేర్కొన్నారు.
అరెస్టు- రిమాండ్- బెయిల్ ఉత్కంఠగా సాగిన యాక్షన్ డ్రామా
పుష్ప-2 ప్రీమియర్ షో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, అరెస్టు నుంచి బెయిల్ మంజూరు వరకు జరిగిన పరిణామాలు గంట గంటకు ఉత్కంఠభరితంగా సాగాయి. అరెస్టు నుంచి బెయిల్ దాకా శుక్రవారం జరిగిన తీరు ఇది.
ఉదయం 10:40 : జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు
11.30 :అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మధ్యాహ్నం 12:30 : పోలీసు స్టేషన్‌కు తరలింపు
12:30- 1:30 : డీసీపీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ స్టేట్‌మెంట్ సేకరణ
1:30 : అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినట్లు పోలీసుల ప్రకటన
2:15 : వైద్య పరీక్షల నిమిత్తం గాంఽధీ ఆస్పత్రికి తరలింపు
3:10 : నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరు
సాయంత్రం 4:00 : 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
5:00 : చంచల్‌గూడ జైలుకు తరలింపు
5:30 : మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
6:45 : బెయిల్ పత్రాల రాక కోసం జైలు రిసెప్షన్‌లో ఎదురుచూసిన అల్లు అర్జున్
దాదాపు రాత్రి 11 గంటల సమయంలో.. సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా అంటూ జైలు అధికారుల ప్రకటన
Updated Date - Dec 14 , 2024 | 03:14 AM