మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమే!
ABN, Publish Date - Dec 14 , 2024 | 04:33 AM
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్, అతడి సెక్యూరిటీ సిబ్బంది, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఆయన సెక్యూరిటీ సిబ్బంది, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది
రిమాండ్ రిపోర్టులో వివరాల నమోదు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్, అతడి సెక్యూరిటీ సిబ్బంది, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అల్లు అర్జున్ రాక సందర్భంగా తొక్కిసలాట జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో థియేటర్ యాజమాన్యం విఫలమైందని తెలిపారు. సినీ హీరో వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక దారి కేటాయించలేదని, అల్లు అర్జున్ ప్రైవేటు సెక్యూరిటీ ప్రేక్షకులను నెట్టి వేయడంతోనే తొక్కిసలాట జరిగి మహిళ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రిపోర్టులో నమోదు చేశారు. పుష్ప 2 విడుదల సందర్భంగా ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షో వేశారు. థియేటర్‌లో 1323 సీటింగ్ కెపాసిటీ ఉంది. థియేటర్ యాజమాన్యం టికెట్లను రూ.1100, రూ.1000 చొప్పున విక్రయించారు.
దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్, రేవతి దంపతులు కుమారుడు శ్రీతేజ్, కుమార్తెతో కలిసి రాత్రి 9.10 గంటలకు థియేటర్‌కు వచ్చారు. రాత్రి 9.40 గంటలకు అల్లు అర్జున్, అతడి కుటుంబం ప్రైవేటు సెక్యూరిటీతో థియేటర్‌కు వచ్చారు. అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అల్లు అర్జున్ ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందితోపాటు థియేటర్ సిబ్బంది ప్రేక్షకులను తోసివేశారు. దీంతో జరిగిన తోపులాటలో అందరూ లోవర్ బాల్కనీ వైపుకు వెళ్లారు. ఈ సమయంలో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ తొక్కిసలాటలో గాయపడ్డారు. తన భార్య పిల్లలు లోవర్ బాల్కనీలోని జనంలో ఉంటారని భావించిన భాస్కర్ వారి కోసం వేచి చూశారు. అయితే, వారు కనిపించకపోవటంతో కుమార్తెను తీసుకొని ఆటోలో రామ్‌నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ కుమార్తెను వదిలి బంధువుతో కలిసి థియేటర్ వద్దకు వచ్చారు. అక్కడ తన భార్య రేవతి, కుమారుడు శ్రీతేజ్ కనిపించకపోవడంతో పోలీసులను సంప్రదించారు. కాగా, థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి, శ్రీతేజ్ గాయపడటంతో వారిని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈలోపే రేవతి చనిపోయారు. మెరుగైన చికిత్స కోసం శ్రీతేజ్‌ను మరో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
Updated Date - Dec 14 , 2024 | 04:33 AM