ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pranahita-Chevella: తుమ్మిడిహెట్టికి దిగువన ప్రాణహిత బ్యారేజీ

ABN, Publish Date - Dec 26 , 2024 | 03:52 AM

ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టికి ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతం తెరమీదికి వచ్చింది.

  • 12 కి.మీ. దూరంలోని బోరేపల్లి వద్ద

  • అనువైన స్థలం ఉన్నట్లుగా గుర్తింపు

  • ముంపు, అటవీ సమస్యలు లేవు

  • 165 టీఎంసీల నీటి లభ్యత అంచనా

  • గ్రావిటీతో ఎల్లంపల్లికి కలిపే అవకాశం

  • కొత్తగా ప్రతిపాదనలు.. ప్రభుత్వ పరిశీలన

హైదరాబాద్‌, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టికి ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతం తెరమీదికి వచ్చింది. తుమ్మిడిహెట్టికి 12 కిలోమీటర్ల దిగువన చింతలమానేపల్లి మండలం బోరేపల్లి గ్రామంలో బ్యారేజీ నిర్మాణానికి అనువైన స్థలం ఉందని, ఈ ప్రాంతంలో బ్యారేజీ కడితే 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని గుర్తించారు. దీనిపై నీటిపారుదల శాఖ సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో)లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ)గా పనిచేసిన ఓ అధికారి సర్వే చేసి, ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. ఈ ప్రాంతంలో బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపు ఉండదని, టోపోషీట్‌ ప్రకారం అటవీ ప్రాంతం కూడా లేదని, మొత్తం రాతి ప్రదేశం ఉండటంతో పునాదులకు సమస్య ఉండదని నివేదించారు. 165 టీఎంసీల నీటి లభ్యత ఉండగా 20 టీఎంసీలను ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు అందించి... మిగిలిన 145 టీఎంసీలను శ్రీపాద ఎల్లంపల్లి సాగర్‌కు తరలించి... ప్రాణహిత-చేవెళ్ల కింద (ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు కింద) ఆయకట్టుకు అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్యారేజీతో పాటు 5 కిలోమీటర్ల అప్రోచ్‌ కెనాల్‌, అక్విడెక్ట్‌, పంప్‌హౌస్‌ నిర్మాణానికి కలిపి రూ.4300 కోట్ల దాకా వ్యయం అవుతుందని ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోలిస్తే 50 శాతం కరెంట్‌ బిల్లులు ఆదా అవుతాయని, నిర్వహణ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశం ఉంటుందని నివేదించారు. ఈ ప్రతిపాదనలపై చర్చించిన ప్రభుత్వం, సాధ్యాసాధ్యాలపై సీరియ్‌సగా చర్చిస్తోంది. వ్యాప్కోస్‌ లేదా మరో సంస్థతో సర్వే చేయించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. బోరేపల్లి ప్రాంతంలో బ్యారేజీ కట్టేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఎమ్మెల్సీ కోదండరామ్‌ ఇటీవలే కాళేశ్వరం విచారణ కమిషన్‌ను కోరడం గమనార్హం.


అనుమతి సాధించి.. పక్కనపెట్టి...

తుమ్మిడిహెట్టి బ్యారేజీని ప్రాణహిత నదిపై 148 మీటర్ల ఎత్తుతో కట్టడానికి గత ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి అనుమతి సాధించి... ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌లో పక్కనపెట్టింది. దీనికి వన్యప్రాణుల అభయారణ్యం, ఇతర సాంకేతిక అంశాలను కారణాలుగా చూపించింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే 71.5 కిలోమీటర్ల దాకా గ్రావిటీతో నీరు ఎల్లంపల్లి సమీపం దాకా చేరేవి. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి డ్యామ్‌ 116 కిలోమీటర్ల దూరం. అందులో 71.5 కిలోమీటర్ల దాకా (మైలారం గ్రామం దాకా) గ్రావిటీతో పంపులు లేకుండా ప్రాణహిత వచ్చి చేరుతుంది. అక్కడ చిన్న పంపులు ఏర్పాటు చేసి, నీటిని ఎత్తిపోస్తే... తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లిలో నీరు పడుతుంది. ఎల్లంపల్లి కూడా 148 మీటర్ల ఎత్తులోనే ఉంది. అలా కాకుండా 100 మీటర్ల ఎత్తుతో 100 కిలోమీటర్ల దిగువన మేడిగడ్డ కట్టి, నీటిని ఎత్తిపోయడం విమర్శలకు తావిచ్చింది. తుమ్మిడిహెట్టి నుంచి మైలారం దాకా లైనింగ్‌ చేసిన కాలువ ఉంది. బ్యారేజీ కడితే చాలు నీళ్లు వడివడిగా ఎల్లంపల్లివైపు పరుగులుపెట్టే అవకాశం ఉంది. బోరేపల్లి దగ్గర రిజర్వాయర్‌ కట్టినా గ్రావిటీతో నీటిని ఎల్లంపల్లి కాలువకు అనుసంధానం చేసే అవకాశం ఉంటుందని ఇంజనీరింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు.


కాళేశ్వరం బ్యారేజీలు కూడా...

బోరేపల్లి బ్యారేజీ నిర్మాణంతో పాటు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ/మరమ్మతు పనులను ప్రభుత్వం ఏకకాలంలో చేపట్టే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన మేడిగడ్డ 2023 అక్టోబరులో కుంగిపోగా అన్నారం, సుందిళ్లలో సీపేజీలు బయటపడిన సంగతి తెలిసిందే. ఇవి నిరర్థకంగా మారాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డిసెంబరులోపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నివేదిక ఇస్తామని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) ఇదివరకే స్పష్టం చేసింది. వానాకాలం తర్వాత జియో టెక్నికల్‌ పరీక్షలు చేసి, నివేదికలు ఇవ్వాలని కోరినా అధికారులు ఇవ్వకపోవడంతో ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఈ బ్యారేజీల మరమ్మతులు చేయడానికి జూన్‌ నెలాఖరు దాకా అవకాశం ఉంటుంది. ఏటా జూలైలో గోదావరికి వరదలు వస్తాయి. మరమ్మతుల అనంతరం మేడిగడ్డ (16.17 టీఎంసీలు), అన్నారం(10.87 టీఎంసీలు), సుందిళ్ల (8.83 టీఎంసీలు) బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే ఎత్తును తగ్గించుకోవాలని ప్రభుత్వం ఇదివరకే సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాస్తవానికి మూడు బ్యారేజీలతో పాటు మూడుచోట్ల ఉన్న పంప్‌హౌ్‌సలకు రూ.27,637 కోట్ల దాకా ఖర్చు చేశారు. వీటిని వృధాగా పెట్టడం వల్ల నిర్వహణ ఖర్చు కూడా భారీగా ఉంటుందని గుర్తించిన ప్రభుత్వం... మూడింటినీ కూడా వాడుకోవాలనే యోచనతోనే ఉంది. బోరేపల్లి వద్ద బ్యారేజీ కోసం సర్వే అనంతరం విధాన నిర్ణయం తీసుకుంటే ఏకకాలంలో నాలుగు బ్యారేజీలు ప్రాణహిత-చేవెళ్లకు నీరు అందించనున్నాయి.

Updated Date - Dec 26 , 2024 | 03:52 AM