Anganwadi: ప్రీ-ప్రైమరీ స్కూళ్లలా.. అంగన్‌వాడీలు
ABN, Publish Date - Aug 13 , 2024 | 03:11 AM
అంగన్‌వాడీలు అనగానే.. బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు గుడ్లు, పాలు అందించడం అనే విషయాలే గుర్తుకొస్తాయి. కానీ ఇక నుంచి అలా కాకుండా.. అంగన్‌వాడీలంటే ప్రీ-ప్రైమరీ (పూర్వ ప్రాధమిక విద్య) పాఠశాలలని గుర్తొచ్చేలా చేయాలని మహిళా, శిశు సంక్షేమశాఖ నూతన చర్యలకు శ్రీకారం చుడుతోంది.
నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనున్న శిశు సంక్షేమశాఖ
టీచర్లకు డిప్లొమా కోర్సు, శిక్షణ- ఇంటర్ పూర్తయిన వారు అర్హులు
హైదరాబాద్, ఆగష్టు 12 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీలు అనగానే.. బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు గుడ్లు, పాలు అందించడం అనే విషయాలే గుర్తుకొస్తాయి. కానీ ఇక నుంచి అలా కాకుండా.. అంగన్‌వాడీలంటే ప్రీ-ప్రైమరీ (పూర్వ ప్రాధమిక విద్య) పాఠశాలలని గుర్తొచ్చేలా చేయాలని మహిళా, శిశు సంక్షేమశాఖ నూతన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, వీటిలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉన్న 15,600 కేంద్రాల్లో పూర్వ ప్రాధమిక విద్యను ప్రవేశపెట్టారు. వీటిల్లో బోధించే సిబ్బందికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.
నూతన పాఠ్యాంశాలు, అవసరమైతే ఇంగ్లీ్‌షలో బోధించేలా తీసుకోవాల్సిన అంశాలపై పెద్దగా శిక్షణ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ప్రీ-ప్రైమరీ స్కూళ్లలో ఇక నుంచి నూతనంగా అందుబాటులోకి వచ్చిన పాఠ్యాంశాలను చిన్నారులకు అర్ధమయ్యేలా చెప్పడంతో పాటు, ఇంగ్లీ్‌షలోనూ బోధించేలా టీచర్లకు శిక్షణను ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ శిక్షణకు ఇంటర్ పూర్తిచేసిన వారిని అర్హులుగా నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఉన్న టీచర్లలో ఎంతమంది ఇంటర్మీడియట్ వరకు చదివారు, ఇంటర్ తరువాత డిగ్రీ, బీటెక్ చేసినవారు ఎంతమంది ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అంగన్‌వాడీల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వరకు బోధిస్తున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం -2020 ప్రకారం అంగన్‌వాడీల్లో ప్రీ-ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీని ప్రకారం ఒకటి, రెండు, మూడవ తరగతుల వరకు అంగన్‌వాడీల్లోనే విద్యను అందించేలా సర్కారు చర్యలు చేపట్టింది. ఈ విధానంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్, అవసరమైన చోట ఉర్దూ మీడియంలో కూడా బోధించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ఒక డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టి, దాని ద్వారా టీచర్లకు శిక్షణ ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమశాఖ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, ఈ శిక్షణను శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలా లేక స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం చేసుకుని ఇప్పించాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. శిక్షణ అనంతరం టీచర్లకు సర్టిఫికెట్‌ను అందిస్తారని తెలుస్తోంది.
Updated Date - Aug 13 , 2024 | 03:11 AM