Kamareddy: డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు తాళలేక.. రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య
ABN, Publish Date - Jul 14 , 2024 | 04:58 AM
డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు తాళలేక ఓ రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ శివారులో శనివారం జరిగిన ఈ ఘటనలో తెడ్డు ప్రశాంత్(28) అనే యువకుడు బలవన్మరణం పొందాడు.
రామారెడ్డి, జూలై 13: డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు తాళలేక ఓ రికార్డు అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ శివారులో శనివారం జరిగిన ఈ ఘటనలో తెడ్డు ప్రశాంత్(28) అనే యువకుడు బలవన్మరణం పొందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి మండలం గుడెం గ్రామానికి చెందిన తెడ్డు ప్రశాంత్ తాడ్వాయి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ప్రశాంత్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు(ఇటీవల జన్మించాడు) ఉన్నారు. అయితే, కన్నాపూర్ శివారులో అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రశాంత్ శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు.
దీనిపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఓ లేఖ(సూసైడ్ నోట్) లభ్యమైంది. తమ కార్యాలయంలో పని చేసే డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్ అనవసరమైన పనులు చెబుతూ ఒత్తిడికి గురి చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని ప్రశాంత్ ఆ లేఖలో రాశాడు. కాగా, డిప్యూటీ తహసీల్దార్ తీరు వల్ల ఇబ్బంది పడుతున్నానని ప్రశాంత్ తమతో చెప్పుకుని పలుమార్లు బాధపడ్డాడని అతని కుటుంబసభ్యులు కూడా తెలిపారు. ప్రశాంత్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - Jul 14 , 2024 | 04:58 AM