Bandi Sanjay: చిత్ర పరిశ్రమపై కక్ష సాధింపు సరికాదు
ABN, Publish Date - Dec 23 , 2024 | 04:00 AM
చిత్ర పరిశ్రమపై కక్షసాధింపు సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సినీ హీరో అల్లు అర్జున్‌తోపాటు చిత్ర పరిశ్రమ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడాలని పేర్కొన్నారు.
చట్టం చేతుల్లో ఉందని ఇష్టానుసారం వాడకూడదు
ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకే నటుడిపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు
మీ సోదరుల వల్లే చనిపోతున్నట్లు మాజీ సర్పంచి లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటే వారిని అరెస్టు చేయలేదేం?
సీఎం రేవంత్‌ను ప్రశ్నించిన బండి సంజయ్
ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబానికి పరామర్శ
హైదరాబాద్/రాంగోపాల్‌పేట, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): చిత్ర పరిశ్రమపై కక్షసాధింపు సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సినీ హీరో అల్లు అర్జున్‌తోపాటు చిత్ర పరిశ్రమ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడాలని పేర్కొన్నారు. చట్టం చేతుల్లో ఉందని ఇష్టమొచ్చినట్లుగా వినియోగించాలని చూస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే రేవంత్ సర్కారుకూ పడుతుందని హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యలు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, తెలుగు సినిమా పరిశ్రమను దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణించడాన్ని ప్రతిఒక్కరూ ఖండించారన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు త్వరగా కోరుకోవాలని కోరుతూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారని తెలిపారు. ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకు కావాలనే సీఎం ఆ సమస్యను మళ్లీ తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
రాజకీయ విలువలులేని మజ్లిస్ సభ్యులతో సభలో ప్రశ్న అడిగించుకుని మరీ సమాధానం ఇవ్వడం సిగ్గు చేటన్నారు. మజ్లిస్ ఐరన్ లెగ్ పార్టీ అని, అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగి ఆర్థిక ప్రయోజనం పొందడం ఒవైసీ సోదరులకు అలవాటేనని చెప్పారు. బీఆర్‌ఎ్‌సని ఇలాగే నిండా ముంచారని, ఇప్పుడు కాంగ్రె్‌సతో జతకట్టారన్నారు. కాంగ్రె్‌సకూ బీఆర్‌ఎస్ గతే పడుతుందని సంజయ్ ఆదివారం ఓ ప్రకటన లో పేర్కొన్నారు. ‘‘అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయించిన సీఎంకు సూటి ప్రశ్న వేస్తున్నా. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చనిపోతుంటే మీరెందుకు బాధ్యత వహించడంలేదు? హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాము కాటుకు గురై నిత్యం విద్యార్థులు ఆస్పత్రులపాలవడంతోపాటు చనిపోతుంటే మీతోపాటు బాధ్యులైన వారిపై కేసులెందుకు పెట్టడం లేదు? సీఎం సోదరుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచి లేఖ రాసి మరణించారు.
మీ సోదరులను ఎందుకు అరెస్టు చేయలేదు? మీకు, మీ కుటుంబానికో న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?’’అని సీఎంను సంజయ్ ప్రశ్నించారు. కాగా, కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజను ఆదివారం సంజయ్ పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తండ్రి భాస్కర్‌తో మాట్లాడారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా సినీ పరిశ్రమను అపఖ్యాతి పాల్జేసేందుకు కాంగ్రెస్, మజ్లి్‌స కుట్రపన్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఈ పార్టీలు అసెంబ్లీ వేదికగా సినిమా పరిశ్రమను అప్రతిష్ఠపాలుచేసేందుకు ప్రయత్నించాయన్నారు. సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి విద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
Updated Date - Dec 23 , 2024 | 04:00 AM