Bandi Sanjay: తెలంగాణ పాలిట దశమ గ్రహం కేసీఆర్
ABN, Publish Date - Sep 07 , 2024 | 04:32 AM
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ పాలిట దశమ గ్రహం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు.
కేటీఆర్‌ను సీఎం చేసేందుకే నవగ్రహ యాగం
ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లకుండా వశీకరణ పూజలు
సచివాలయంలో 3 అంతస్థుల డోమ్‌లు.. విడ్డూరం
బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని బరాబర్ కూల్చేస్తాం
ఏపీ, తెలంగాణకు కేంద్రం అండగా ఉంటుంది: సంజయ్
హైదరాబాద్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ పాలిట దశమ గ్రహం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దుయ్యబట్టారు. ప్రజల మంచి కోసం యాగం చేస్తే ఆయన కేసీఆరే కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నవగ్రహ యాగం చేయడంపై సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘కేసీఆర్ ఓ దశమ గ్రహం. బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో తెలంగాణ ప్రజలకు ఆ పీడ విరగడైంది. పదేళ్లు కేసీఆర్ సహా ఆయన కుటుంబమంతా అధికారం అనుభవించింది కదా.. ఇంకా దేనికోసం నవగ్రహం యాగం చేస్తున్నట్లు? బహుశా కేటీఆర్‌నో కవితనో సీఎం చేసేందుకే అయి ఉంటుంది’’అని వ్యాఖ్యానించారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ్‌సను వీడకుండా కేసీఆర్ వశీకరణ పూజలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో సంజయ్ మీడియాతో మాట్లాడారు. మెడకాయమీద తలకాయ ఉన్నోడెవ్వడూ తొమ్మిది అంతస్థుల సచివాలయంలో మూడంతస్థుల మేర డోమ్‌లు కట్టరని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక సచివాలయం పై భాగంలో ఉన్న డోమ్‌లను బరాబర్ కూల్చివేస్తామని పునరుద్ఘాటించారు. రాజకీయంగా కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు పది నెలల క్రితమే నో ఎంట్రీ ప్రకటించారని, ఇక రీ ఎంట్రీ ఎక్కడిది? అని ప్రశ్నించారు.
కాగా, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీ, తెలంగాణకు కేంద్రం సాయం చేస్తుందని సంజయ్ ప్రకటించారు. ఇది రాజకీయ కోణంతో చూసే అంశం కాదన్నారు. ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఏరియల్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. తనతోపాటు మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి సైతం ఆయన వెంట ఉన్నామని చెప్పారు. ‘‘క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాం. రైతులతో మాట్లాడినం.
వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించాం. అనంతరం హైదరాబాద్‌లో సచివాలయానికి వెళ్లి సీఎంతో సమావేశమయ్యాం. వరద నష్టం వివరాలను తెలుసుకున్నాం. నిబంధనల ప్రకారం సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాజకీయాలకతీతంగా ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. దురదృష్టమేమిటంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఎస్డీఆర్‌ఎఫ్ నిధులను పక్కదారి మళ్లించింది. ఎన్ని నిధులివ్వాలనే అంశంపై వాస్తవ అంచనాల ఆధారంగా, నిబంధనల మేరకు కేంద్రం కచ్చితంగా సాయం చేస్తుంది’’ అని సంజయ్ స్పష్టం చేశారు.
Updated Date - Sep 07 , 2024 | 04:33 AM