Bandi Sanjay: విదేశాల్లో భారత్‌ను కించేపర్చే వ్యాఖ్యాలా?
ABN, Publish Date - Sep 13 , 2024 | 04:51 AM
‘విదేశాల్లో భారత్‌ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదు. సిక్కులను ఊచకోత కోసిన చరిత్ర కాంగ్రెస్ సొంతం.
రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదు.. దేశద్రోహ వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలి
లేనిపక్షంలో వెంటనే ఈ దేశం వదిలి వెళ్లిపోవాలి
అధికారంలోకి వస్తే దేశాన్ని మళ్లీ ముక్కలు చేస్తాడు
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, రాంగోపాల్‌పేట్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘విదేశాల్లో భారత్‌ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదు. సిక్కులను ఊచకోత కోసిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. వారి గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో దేశం వదిలి వెళ్లాలని డిమాండ్ చేశారు. గురువారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి సికింద్రాబాద్ జనరల్ బజారులోని దుస్తులు, బంగారు దుకాణాల వద్ద తిరుగుతూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. ‘రాహుల్ విదేశాల్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదు. అమెరికాకు వెళ్లి భారత ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించింది, మోదీకి అనుకూలంగా ఉండటంవల్లే బీజేపీకి సీట్లు వచ్చాయి’ అని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయనకు ఈ దేశ చట్టాలు, న్యాయస్థానాలు, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేకపోవడం సిగ్గు చేటన్నారు. సిక్కులు తలపాగా, కడియం పెట్టుకునే పరిస్థితి లేదని రాహుల్ చెప్పడం సిగ్గు చేటని, సిక్కులను ఊచకోత కోసి దుర్మార్గంగా వ్యవహరించిందే రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరా గాంధీ అని అగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానేకాదు... ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని మూడు ముక్కలు చేసిందని, రాహుల్ గాంధీ పొరపాటున అధికారంలోకి వస్తే మళ్లీ ఏడు ముక్కలు చేసే ప్రమాదముందని ఆగ్రహంతో అన్నారు. రిజర్వేషన్లను ఎత్తేస్తామంటూ రాహుల్ గాంధీ అడ్డగోలుగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను మళ్లీ తేవాలని, రెండు జెండాలుండాలని కోరుకునే పార్టీలతో కాంగ్రెస్ జట్టుకట్టడం సిగ్గు చేటని విమర్శించారు.
దృష్టి మళ్లించడానికే హై‘డ్రామా’
రాష్ట్రంలో ఆరు గ్యారంటీలపై దృష్టి మళ్లించడానికి హైడ్రా పేరుతో హైడ్రామాలాడుతున్నారని, అక్రమ నిర్మాణాలను మీరు కూలుస్తారా? మమ్ముల్ని కూల్చమంటారా? అంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించడం సిగ్గు చేటన్నారు. అక్రమ నిర్మాణాలని తెలిసి అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు? వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ ప్రధాన కార్యదర్శులపై ఎమ్మెల్యేల అసంతృప్తి
ఒకరిద్దరు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల వైఖరిపై పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం బీజేఎల్పీ సమావేశంలో ఈ అంశం చర్చించాలని భావించినట్లు ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. అయితే, సమయాభావంతో అజెం డా అంశాలపై చర్చకే పరిమితమయ్యామన్నారు. అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని మరో ఎమ్మెల్యే తెలిపారు. వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన తాము, డిపాజిట్‌లు కూడా రాని వారు చెబితే వినాల్సిన దుస్థితి పార్టీలో కొనసాగుతోందన్నారు. పార్టీ కీలక సమావేశాల కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు.
Updated Date - Sep 13 , 2024 | 04:52 AM