KTR: రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ దోపిడీ
ABN, Publish Date - May 26 , 2024 | 04:23 AM
ఒకప్పుడు బ్రూ కాఫీ గురించి విన్నామని.. ఇప్పుడు రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ గురించి వింటున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో భట్టి, రేవంత్, ఉత్తమ్(బీఆర్‌ఎయూ) ట్యాక్స్ మొదలైందని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీకి కప్పం కట్టేందుకు.. భట్టి, రేవంత్, ఉత్తమ్ వసూళ్లు
సర్కారును నడపడం చేతకాని సన్నాసులు
పదేళ్లలో మేం 1.60 లక్షల ఉద్యోగాలిచ్చాం
కాంగ్రెస్ నేటికీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే
మంత్రి కోమటిరెడ్డి ఓ జోకర్: కేటీఆర్
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు బ్రూ కాఫీ గురించి విన్నామని.. ఇప్పుడు రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ గురించి వింటున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో భట్టి, రేవంత్, ఉత్తమ్(బీఆర్‌ఎయూ) ట్యాక్స్ మొదలైందని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారులో ఎవరి దుకాణం వాళ్లదేనని, ఆఖరికి భవన నిర్మాణ యజమానుల నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో ఇప్పుడు అందినకాడికి దోచుకుంటున్నారని అన్నారు. త్వరలోనే జూపల్లి కృష్ణారావు కూడా ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట కొత్త దుకాణం తెరవబోతున్నారని చెప్పారు.
కాంగ్రెస్ నేతలంతా సామంత రాజులని, ఢిల్లీకి కప్పం కట్టేందుకు ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని నడపడం చేతకాని సన్నాసులని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు తాము నడిపిన సంస్థలను ఎందుకు నడపలేకపోతున్నారని ప్రశ్నించారు. కరెంట్ ఇవ్వడం చేతగాక సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓ మూర్ఖుడు, జోకర్ అని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేసిన అబద్ధపు ప్రచారాలను యువత నమ్మారని అన్నారు. బీరు, బిర్యానీకి ఆశపడే అడ్డా కూలీలంటూ ఉస్మానియా విద్యార్థులను అవమానించిన రేవంత్ రెడ్డిని వారు ఎలా మరచిపోతారని అన్నారు. మేడిగడ్డ విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు చేశారని, కాఫర్ డ్యామ్ కట్టాలని కేసీఆర్ చెప్పిందే వీళ్లు ఇప్పుడు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఏడాదికి 19 వేల ఉద్యోగాలిచ్చాం..
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలకు పాలనా అనుమతులిచ్చామని.. అందులో 2,02,735 కొలువులకు నోటిఫికేషన్ ఇచ్చామని.. గతేడాది ఎన్నికల కోడ్ వచ్చే నాటికి 1,60,083 ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004-2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం 24,086 ఉద్యోగాలే ఇచ్చిందన్నారు. అందులో తెలంగాణ వాటా 42 శాతం అనుకుంటే.. ఈ ప్రాంత యువతకు పది వేల ఉద్యోగాలే వచ్చాయని, అంటే ఏడాదికి వెయ్యి కొలువులే ఇచ్చారని పేర్కొన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 32 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఊదరగొడుతోందని, ఈ సర్కారు వచ్చాక కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తమ హయాంలో ప్రైవేటు రంగంలో 24.32 లక్షల ఉద్యోగాలను సృష్టించామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంత కంటే ఎక్కువ కొలువులు ఇచ్చిన ప్రభుత్వాలు పదేళ్లలో ఏమైనా ఉన్నాయా చెప్పాలన్నారు. తమ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చినట్లు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ అంతా బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని కేటీఆర్ కోరారు.
Updated Date - May 26 , 2024 | 04:23 AM