ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP Telangana: కమలంలో కుర్చీ పోరు!

ABN, Publish Date - Aug 13 , 2024 | 03:50 AM

బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకం.. ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది.

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ

  • రేసులో ఈటల, రాంచందర్‌రావు!

  • కొత్త ఇన్‌చార్జిపైనా సందిగ్ధం

  • ఎత్తులు పైఎత్తులు వేస్తున్న ఆశావహులు

  • ముఖ్యనేతల మధ్య కొరవడిన సయోధ్య

  • ఆచితూచి వ్యవహరిస్తున్న హైకమాండ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకం.. ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కత్తిమీద సాములా మారింది. కమల దళపతిగా అవకాశం దక్కించుకునేందుకు పలువురు నేతలు పోటీ పడుతుండడం, ఒకరిపై ఒకరు ఎత్తులు పైఎత్తులు వేస్తుండడంతో అధ్యక్షుడి ఎంపికలో చెక్‌మేట్‌ సాగుతోంది. దీనికితోడు ముఖ్యనేతల మధ్య సయోధ్య లేకపోవడంతోపాటు అంతర్గతంగా లుకలుకలు బయటపడుతుండడం సమస్యగా మారింది. ‘నాకు దక్కకున్నా పర్వాలేదు.. ఫలానా నేతకు మాత్రం అవకాశం ఇవ్వొద్దు’ అంటూ ఒకరిద్దరు కీలక నేతలు జాతీయ ముఖ్యులను గట్టిగా కోరుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్న ఒక సీనియర్‌ నేతకు, గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కీలక నేత ఒకరు చెక్‌ పెడుతున్నారు.


సైద్ధాంతిక నిబద్ధత ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని ఒక వర్గం పట్టుబడుతోంది. కొత్తవారికి ఈ పదవి కట్టబెడితే పార్టీ కేడర్‌కు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని వాదిస్తోంది. అయితే పార్టీ కేడర్‌లో జోష్‌ రావాలంటే, పాత, కొత్త వాదన సరికాదని మరోవర్గం అంటోంది. రాజకీయంగా ప్రత్యర్థులను ఢీకొట్టాలంటే నాయకత్వ లక్షణాలు, సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ నాయకత్వాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఎవరివైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ ప్రధానంగా ఎంపీ ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు మధ్యే ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి పేరును కూడా జాతీయ నాయకత్వం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


మరోవైపు తమకు అవకాశం ఇవ్వాలని కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా జాతీయ నాయకత్వాన్ని కోరుతుండడం ఆసక్తి రేపుతోంది. పార్టీ సంస్థాగత నియమావళి ప్రకారమైతే.. తొలుత సభ్యత్వ నమోదు పూర్తిచేయాల్సి ఉంటుంది.ఆ తరువాత గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలి. అనంతరం రాష్ట్ర శాఖకు అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలి. కానీ, ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి కనీసం ఐదారు నెలలు పడుతుంది. అయితే, ఈ ప్రక్రియతో సంబంధం లేకుండానే కొత్త అధ్యక్షుడి నియామకం జరిగే అవకాశం లేకపోలేదని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ‘‘వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. ఇందుకోసం ఇటు సంస్థాగతంగా బలోపేతం కావడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి దీటుగా నిలిచి ప్రత్యామ్నాయం మేమే అని ప్రజల్లో విశ్వాసం కల్పించడం అత్యంత కీలకం.


ఈ రెండు కోణాలను పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. పైగా, దక్షిణాదిన మా పార్టీ విస్తరణకు తెలంగాణ గేట్‌వే. అందుకే హరియాణా, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలకు ఇటీవలే కొత్త అధ్యక్షులను నియమించినా.. ఇక్కడ మాత్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నియమించనున్నారు’’ అని ఆ నేత వివరించారు. రాష్ట్ర పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీ షెడ్యూలుతో ఉండిపోగా, ఆయనకు అదనంగా జమ్ము కశ్మీరు ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలను కూడా పార్టీ నాయకత్వం అప్పగించింది. దీంతో ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా స్థానిక కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోతున్నారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం ఖరారు చేస్తుందని విస్తృత ప్రచారం జరుగుతోంది.


  • కొత్త ఇన్‌చార్జి నియామకంపైనా సందిగ్ధం!

బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరన్నది తేలకపోగా.. రాష్ట్ర శాఖకు కొత్త ఇన్‌చార్జి ఎవరనే దానిపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌లు రాష్ట్ర ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఒకటి, రెండు సందర్భాల్లో మాత్రమే తరుణ్‌చుగ్‌ రాష్ట్రానికి వచ్చారు. పార్టీ కార్యక్రమాలను ఎక్కువశాతం బన్సల్‌ పర్యవేక్షిస్తూ వస్తున్నారు. అయితే బన్సల్‌ కూడా ఇటీవల ఎక్కువ సమయం కేటాయించలేకపోవడంతో రాష్ట్ర పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ పార్టీ సమావేశాలను సమన్వయం చేస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జులను నియమించిన జాతీయ నాయకత్వం.. 8 రాష్ట్రాల్లో పెండింగ్‌లో పెట్టింది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. దీంతో తరుణ్‌ చుగ్‌, బన్సల్‌నే కొనసాగిస్తారా? లేక కొత్తవారిని నియమిస్తారా? అన్నది పార్టీవర్గాల్లో చర్చనీయాంశమైంది.

Updated Date - Aug 13 , 2024 | 07:38 AM

Advertising
Advertising
<