Aleti Maheshwar Reddy: ఒవైసీ ఆక్రమణలను కూల్చే దమ్ముందా..?
ABN, Publish Date - Aug 27 , 2024 | 03:17 AM
సల్కం చెరువులో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కట్టిన అక్రమ భవనాలను కూల్చివేసే ధైర్యం ఉందా..? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సల్కం చెరువు అక్రమాలు దృష్టికి రాలేదా
చిత్తశుద్ధి ఉంటే ఆ నిర్మాణాలను కొట్టండి
ప్రభుత్వానికి మహేశ్వర్‌రెడ్డి సవాల్
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సల్కం చెరువులో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కట్టిన అక్రమ భవనాలను కూల్చివేసే ధైర్యం ఉందా..? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాటిని ఎప్పటిలోగా కూలుస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే పాతబస్తీలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. కొంత మందిని లక్ష్యంగా చేసుకుని హైడ్రా పని చేస్తున్నట్లుగా అనిపిస్తోందన్నారు. ‘సల్కం చెరువులో మజ్లిస్ అధినేత ఒవైసీ కట్టిన అక్రమ నిర్మాణాలు మీ దృష్టికి రాలేదా..? వాటిని కూల్చివేసేందుకు మీ వద్ద యంత్రాలు లేవా?’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ప్రశ్నించారు.
ఒకవేళ యంత్రాలు అందుబాటులో లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి తెప్పించి ఇస్తామని తెలిపారు. పాతబస్తీలోని చెరువులను ఇష్టారాజ్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. ‘‘పాతబస్తీ గుర్రం చెరువు, జల్‌పల్లి చెరువులో అక్రమ నిర్మాణాల వివరాలు ఉన్నాయా..? పంపించాలా..? అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకుంటారా..? హైదారాబాద్‌లో ఎన్ని చెరువులు ఉన్నాయి..? ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయి..? హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యల పట్ల చర్యలేవి..?’’ అని ఆయన ప్రశ్నించారు. కాగా, అక్రమంగా కట్టుకున్న భవనాలను ఉద్దేశించి మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఒక ప్రజాప్రతినిధి అయితే, అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేశారు.
Updated Date - Aug 27 , 2024 | 03:17 AM