Farmers: నేడు రైతు హామీల సాధన దీక్ష: ఈటల
ABN, Publish Date - Sep 30 , 2024 | 03:50 AM
రైతులందరికీ సమగ్రంగా రుణమాఫీ అమలు చేయాలన్న డిమాండ్‌తో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నామని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): రైతులందరికీ సమగ్రంగా రుణమాఫీ అమలు చేయాలన్న డిమాండ్‌తో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నామని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఇందిరా పార్కు సమీపంలోని ధర్నాచౌక్‌లో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు రైతు హామీల సాధన దీక్ష ఉంటుందని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని వివరించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశం లేదన్నారు. రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, సన్న వడ్లకు రూ.500 బోనస్, కౌలు రైతులకు రైతుబంధు, రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అరాచక పాలన చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. లక్షలాది మంది రైతులను ప్రభుత్వం మోసం చేసిందని.. దానికి నిరసనగా దీక్ష చేపడుతున్నామని తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ సమగ్రంగా అమలు చేసేవరకూ పోరాటం చేస్తామని ప్రకటించారు.
Updated Date - Sep 30 , 2024 | 03:50 AM