BRS: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్ పతనమైపోయిందిగా..
ABN, Publish Date - Jun 06 , 2024 | 10:49 AM
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ(BJP)కి కలిసిరాగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్(BRS) ఆశలు గల్లంతు చేశాయి. చేవెళ్ల, మల్కాజిగిరి(Chevella, Malkajigiri) పార్లమెంట్ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ను బీజేపీ తుక్కుతుక్కుగా ఓడించింది.
హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ(BJP)కి కలిసిరాగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్(BRS) ఆశలు గల్లంతు చేశాయి. చేవెళ్ల, మల్కాజిగిరి(Chevella, Malkajigiri) పార్లమెంట్ స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ను బీజేపీ తుక్కుతుక్కుగా ఓడించింది. దశాబ్ధకాలం కిందట జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ ఎలా పతనమైందో అచ్చం అలానే ఇపుడు బీఆర్‌ఎస్ పరిస్థితి మారింది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాను కంచుకోటగా మలుచుకున్న టీడీపీ(TDP) 2014 ఎన్నికల తర్వాత కోలుకోని విధంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీడీపీకి 8 అసెంబ్లీ స్థానాలు లభించాయి. తర్వాత టీడీపీ క్రమేపీ బలహీనపడి కోలుకోలేదు. ఇపుడు బీఆర్‌ఎస్ పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది.
ఇదికూడా చదవండి: Hyderabad: డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ అరెస్టు..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ 10 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్ రోజు రోజుకూ బలహీనపడుతోంది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్ తేలిపోయింది. కనీవిని ఎరుగని రీతిలో ఆరు నెలల కాలంలోనే గణనీయంగా ఓటు బ్యాంకు కోల్పోయింది. కనీసం రెండో స్థానం కూడా బీఆర్ఎస్కు దక్కలేదు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ రెండు పార్లమెంట్ పరిధిలో బీఆర్‌ఎస్ 11.66లక్షల ఓట్లు కోల్పోవడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ కంటే కేవలం 4.8లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ 4.8లక్షల ఓట్లే రాష్ట్రంలో అధికారం తారుమారు కావడానికి కారణమయ్యాయి. అలాంటిది ఉమ్మడి జిల్లాలోనే ఇపుడు బీఆర్‌ఎస్ ఆరు నెలల కాలంలో దీనికి రెట్టింపు కంటే అధికంగా ఓట్లు కోల్పోవడం చూస్తే భవిష్యత్తులో బీఆర్‌ఎస్ కోలుకునే అవకాశాలు అంతంతమాత్రమేనని చెప్పాలి.
అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీ ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్కు 40.85శాతం ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 35.2 శాతం ఓట్లు, బీజేపీకి 19.37 శాతం ఓట్లు వచ్చాయి. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు 10.80 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్‌కు 38.44 శాతం ఓట్లు రాగా బీజేపీకి అనూహ్యంగా 48.77 శాతం ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ ఈ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే దాదాపు 30 శాతం ఓట్లు కోల్పోయింది. తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ కాలం ఆ పార్టీలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 06 , 2024 | 10:49 AM