BRS: రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపు.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపాటు
ABN, Publish Date - Jul 31 , 2024 | 08:34 PM
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్న ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్న ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు సిద్ధమయ్యారు. రేపు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
అధికారం, అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలను సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. సీఎం వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
"తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక స్థానం, గౌరవం ఉంది. కనీసం ఈ సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతవని.. ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ.. జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తనస్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను అందరూ ఖండించాల్సిందే. మహిళలకు బీఆర్ఎస్ సముచిత స్థానం, గౌరవం కల్పించింది. మా మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి నోరు పారేసుకున్నారు. రేవంత్ నికృష్టంగా మాట్లాడారు. ఈ అవమానం కేవలం సబితకు, సునితకు జరిగింది కాదు తెలంగాణ ఆడబిడ్డలందకీ జరిగిన అవమానం. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం శోచనీయం.
ఆయన అన్‌ఫిట్ ముఖ్యమంత్రి. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు. కానీ కావాలనే ముఖ్యమంత్రి ఆడబిడ్డలను అవమానించారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు ఆయనకు తగులుతుంది. మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు. రేవంత్‌లాగా పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్ళు కాదు. ఈ విషయం సీఎం గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏ మొహం పెట్టుకుని వచ్చావని ఉపముఖ్యమంత్రి భట్టి అనడం అన్యాయం. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఏరోజైనా మేం ఆడబిడ్డలను అవమానించామా. ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడాం అంటే వెంటనే మా పద్ధతి మార్చుకున్నాం. అది మా అధినేత కేసీఆర్ మాకు నేర్పిన సంస్కారం. ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రేవంత్, భట్టి క్షమాపణలు చెప్పాలి" అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్, భట్టి ఏమన్నారంటే..
కాంగ్రెస్ పార్టీ తనను సీఎల్పీని చేస్తే తనకు అండగా, మద్దతుగా ఉండాల్సింది పోయి పదవి కోసం సబితా ఇంద్రారెడ్డి పార్టీ ఫిరాయించారంటూ భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఆరోపించారు. తనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికే సబిత అలా చేశారన్నారు. పార్టీలు మారి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాక.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారని.. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీబస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుందన్నారు.
Read More Telangana News and Latest Telugu News
Updated Date - Jul 31 , 2024 | 08:35 PM