Hyderabad: 6 సీట్లపై బీఆర్‌ఎస్ ఆశలు!
ABN, Publish Date - Jun 04 , 2024 | 04:00 AM
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ప్రభావం ఏమాత్రం తగ్గదని, తాము ఆశించిన 12 స్థానాల్లో అంచనాలు కొంత అటు ఇటు అయినా.. ఆరు స్థానాల్లో మాత్రం గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది.
ఎటువంటి ఫలితం వచ్చినా స్వీకరించాలి
ఓటింగ్ శాతంపైనే దృష్టి పెట్టాలి: కేసీఆర్
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ప్రభావం ఏమాత్రం తగ్గదని, తాము ఆశించిన 12 స్థానాల్లో అంచనాలు కొంత అటు ఇటు అయినా.. ఆరు స్థానాల్లో మాత్రం గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ వైఫల్యాలు, కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు ఏమీ చేయడం లేదన్న అంశాలే ప్రధాన ఎజెండాగా బీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది. అయితే.. పోలింగ్ ముగిసిన తర్వాత ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పార్టీ శ్రేణులు వెల్లడించిన సమాచారం ఆధారంగా.. ఆరు స్థానాల్లో గెలుపుపై ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ పార్టీ వేసుకున్న లెక్కల ప్రకారం మెదక్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, నాగర్‌కర్నూల్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాల్లో గెలుస్తామని భావిస్తున్నట్లు తెలిసింది. ఇతర చోట్ల గత ఎన్నికల్లో పార్టీకి ఉన్న ఓటింగ్ శాతం ఏమాత్రం తగ్గదని, ప్రజలు బీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఓట్లు వేశారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా జూన్ 2న తెలంగాణ భవన్‌లో నిర్వహించిన దశాబ్ది ఉత్సవ కార్యక్రమంలోనూ కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి ప్రస్తావిస్తూ.. ఒక్కో సర్వే సంస్థ ఒక్కో రకంగా చెప్పాయని అన్నారు. ఎవరు ఏం చెప్పినా.. ప్రజల తీర్పును శిరసావహించాల్సిందేనని పేర్కొన్నారు. ఆరు సీట్లొచ్చినా.. ఒకటి, రెండు సీట్లకు పరిమితమైనా.. నిరాశకు గురికావద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో ఎన్ని స్థానాలు వస్తాయన్నది పక్కన పెట్టి.. తెలంగాణలో బీఆర్‌ఎ్‌సకు ఎంత ఓటింగ్ శాతం అన్నదానిపై దృష్టి పెడదామని అన్నారు.
Updated Date - Jun 04 , 2024 | 04:00 AM