KCR : అగ్నిపర్వతంలా నేను!
ABN, Publish Date - Jul 24 , 2024 | 03:31 AM
రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అన్నింటినీ భరిస్తూ ప్రస్తుతం తానో అగ్ని పర్వతం మాదిరిగా ఉన్నానని, సొంతబిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా?
బిడ్డ జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా?
రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారు
ఎక్కడో ఉన్నోళ్లను తెచ్చి పదవులిస్తే ఇప్పుడు వారంతా పార్టీ వీడుతున్నారు
కాంగ్రెస్ సర్కారు హనీమూన్ ముగిసింది
బీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశంలో కేసీఆర్
ఉన్న ఎమ్మెల్యేల్లో ఐదుగురు గైర్హాజరు
రేపు రాష్ట్ర బడ్జెట్.. 27న దానిపై చర్చ
26, 28న విరామం.. ఏడు పనిదినాలు
అసెంబ్లీ బీఏసీ సమావేశంలో నిర్ణయం
బీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశంలో కేసీఆర్
భేటీకి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ డుమ్మా
హైదరాబాద్, జూలై23 (ఆంధ్రజ్యోతి): రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అన్నింటినీ భరిస్తూ ప్రస్తుతం తానో అగ్ని పర్వతం మాదిరిగా ఉన్నానని, సొంతబిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎదుట ఆయన తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో ఇప్పటిదాకా కేసీఆర్ నేరుగా స్పందించలేదు.
అయితే బీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశంలో ఆయన కవిత అరెస్టుపై తొలిసారిగా స్పందించడమే కాకుండా భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది. ఉద్యమపార్టీగా బీఆర్‌ఎస్ అవతరించిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులతో పోల్చుకుంటే పార్టీకి ఇప్పుడంత క్లిష్ట పరిస్థితులు లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్న రోజుల్లోనే తెలంగాణను సాధించామని కేసీఆర్ బీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశంలో పేర్కొన్నారు. ఎక్కడో ఉన్న వాళ్లను తెచ్చి.. వారికి రాజకీయ పదవులు దక్కేలా చేస్తే.. వారేమో పార్టీని వీడుతున్నారని, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
విపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఉద్బోధించినట్లు తెలిసింది. కాగా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయిందని, శాంతి భద్రతలు అదుపు తప్పాయని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, ఇక ప్రజా క్షేత్రంలోకి వెళ్లి నిలదీద్దామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బడ్జెట్ ప్రకటించేరోజు, ఆ తర్వాత సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. కాగా ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు హాజరు కాలేదు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పలువురు కాంగ్రె్‌సలో చేరడంతో ఈ పరిణామం గులాబీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు.. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివా్‌సయాదవ్ ఈ సమావేశానికి డుమ్మాకొట్టారు.
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా హాజరుకాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బీఆర్‌ఎ్‌సఎల్పీ సమావేశంలో.. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు హరీశ్‌రావు తెలిపారు.
Updated Date - Jul 24 , 2024 | 03:31 AM