Kadiyam Srihari: ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ మాట్లాడటం సిగ్గుచేటు
ABN, Publish Date - Sep 10 , 2024 | 03:11 AM
పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
న్యాయవ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది
డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేస్తాం: కడియం
గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు.. బీఆర్‌ఎస్ నేతలకు ప్రజాస్వామ్య విలువలు గుర్తులేవా ?
నా నిర్ణయానికి కట్టుబడి ఉంటా: తెల్లం
వరంగల్/భద్రాచలం/హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులకు ప్రోత్సహించి.. ప్రతిపక్ష పార్టీల శాసనసభాపక్షాలను విలీనం చేసుకున్న నీచ చరిత్ర బీఆర్‌ఎ్‌సదని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో ఏదో అయిపోయిందని, అప్పుడే ఉపఎన్నిక వచ్చిందన్నట్లుగా సంబరాలు చేసుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. న్యాయవ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని, హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కాపీలు ఇంకా తమకు అందలేదని తెలిపారు. కోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, వారి సలహాల మేరకు భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.
తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయాలనుకుంటున్నామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశాలున్నాయని చెప్పారు. కాగా, గతంలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నప్పుడు ఆ పార్టీ నేతలకు ప్రజాస్వామ్య విలువలు గుర్తుకురాలేదా? అని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రశ్నించారు. సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్లో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే తీర్పు పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాతే పూర్తిగా మాట్లాడతానన్నారు. తాను మొదటి నుంచీ భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పరితపిస్తున్నానని, ప్రజల కోరిక మేరకు తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.
కాగా, పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు సుద్దపూస కబుర్లు చెబుతున్నారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మండిపడ్డారు. పదేళ్లపాటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇప్పుడు నీతులు బోధిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభాలు పెట్టి, బెదిరించి పార్టీ చేర్చుకున్న రోజులను హరీశ్‌రావు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి ఎటు పోయిందని నిలదీశారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తామని, స్పీకర్ కచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
Updated Date - Sep 10 , 2024 | 03:11 AM