Hyderabad: కాంగ్రెస్‌లోకి రావాలని ఎమ్మెల్యేలను దానం రెచ్చగొట్టారు
ABN, Publish Date - Nov 09 , 2024 | 04:02 AM
పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్‌లను పరిష్కరించి తుది నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు గరిష్ఠంగా 3 నెలల సమయం మాత్రమే ఉంటుందని, ఆలోపే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోబోరని దానంకు ముందే ఎలా తెలిసింది?
అనర్హత పిటిషన్‌లపై ధర్మాసనం ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వాదనలు
హైదరాబాద్, నవంబరు8(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్‌లను పరిష్కరించి తుది నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు గరిష్ఠంగా 3 నెలల సమయం మాత్రమే ఉంటుందని, ఆలోపే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్‌లపై నాలుగువారాల్లో విచారణ ప్రారంభించాలనే సింగిల్ జడ్జి తీర్పుపై రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది.
పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు కొనసాగించారు. తగిన సమయం(రీజనబుల్ టైం) అంటే గరిష్ఠంగా మూడునెలలే అని ‘కైశం మేఘాచంద్రసింగ్ ’ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత కేసులో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మిగతా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రె్‌సలోకి రావాలని బహిరంగంగా రెచ్చగొట్టారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అనర్హత గురించి భయపడవద్దని, అనర్హతపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోరని దానం చెప్పారని గుర్తుచేశారు. స్పీకర్ అనర్హత పిటిషన్‌లపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోరని పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఎలా తెలిసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తరఫున వాదనల కోసం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.
Updated Date - Nov 09 , 2024 | 04:02 AM