Hyderabad: కాంగ్రెస్‌తో టచ్‌లో.. 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు!
ABN, Publish Date - Jun 07 , 2024 | 02:22 AM
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం మొదలుకానుంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శాసన సభ్యులు కాంగ్రె్‌సలోకి వెళ్లేందుకు మంతనాలు ప్రారంభించారు. వచ్చే ఐదేళ్ల పాటు సౌకర్యంగా ఉండే ఆలోచనతో కొందరు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
పార్టీ మారేందుకు ముఖ్య నేతలతో మంతనాలు
సీఎం రేవంత్, వేం నరేందర్‌తో సంప్రదింపులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధి శాసనసభ్యులే అధికం
టీడీపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లినవారే
ఈ నెలాఖరులోగానే ఎక్కువమంది ఫిరాయింపు
హైదరాబాద్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం మొదలుకానుంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శాసన సభ్యులు కాంగ్రె్‌సలోకి వెళ్లేందుకు మంతనాలు ప్రారంభించారు. వచ్చే ఐదేళ్ల పాటు సౌకర్యంగా ఉండే ఆలోచనతో కొందరు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యులతో అంతర్గత సంప్రదింపులు, చర్చలు సాగిస్తున్నారు. అటునుంచి అనుమతి లభించినదే తడవుగా జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా 10 మందికి పైగా గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో చర్చల్లో ఉన్నారు. అంతా బాగుంటే ఈ నెలలోనే భారీగా మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటివారిని ఉద్దేశించే సీఎం రేవంత్ బుధవారం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేతలు, ఎమ్మెల్యేల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని, కమలం పార్టీకి ఓట్లు మళ్లేలా చేయడంతో ఏడు ఎంపీ సీట్లలో బీఆర్‌ఎస్ డిపాజిట్లు కోల్పోయిందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ లాంటి పార్టీలో కొనసాగే విషయమై ‘ఆత్మప్రబోధానుసారం’ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాగా.. ‘మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చేది నేనే’ అంటూ ఓ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెప్పుకొంటున్నారు. ఆయన కాంగ్రె్‌సలోకి వెళ్తారని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటివారు 10 మందిపైగా కాంగ్రె్‌సతో టచ్‌లో ఉన్నారని తెలిసింది.
కాగా, ఎవరిని తీసుకోవాలి? ఎవరిని తీసుకోవద్దు? అనే అంశంపై సీఎం రేవంత్ స్పష్టతతో ఉన్నారు. అందరినీ చేర్చుకుంటూ పోతే, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి గురించి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని, తద్వారా చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలోకి మారే యోచనలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది జీహెచ్‌ఎంసీకి చెందినవారే. టీడీపీలో ఉండగా రేవంత్‌తో కలిసి పనిచేసి, బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లినవారు, కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎ్‌సలోకి మారినవారు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 39 సీట్లు నెగ్గగా అందులో 16 జీహెచ్‌ఎంసీ పరిధివే. వీరిలోనే కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. నెలాఖారుకల్లా వీరు పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పటికే ముగ్గురు జంప్!
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ సీఎం రేవంత్‌ను కలిసినా.. ఆ తర్వాత వెనక్కుతగ్గారు. ఇదే సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక), సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), కె.మాణిక్‌రావు (జహీరాబాద్) కూడా సీఎంను కలిశారు. వీరు కాంగ్రె్‌సలోకి వెళ్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, వారు ఖండించారు.
అభివృద్ధి పనుల కోసమే సీఎం వద్దకు వెళ్లినట్లు చెప్పారు. కాగా, పార్లమెంటు ఎన్నికలు రావడంతో దాదాపు మూడు నెలలుగా ఫిరాయింపులు ఆగాయి. ఎమ్మెల్యేలు చడీ చప్పుడు చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్న సీఎం రేవంత్ నుంచి అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, దీనిపై వేం నరేందర్‌రెడ్డి కాస్త చొరవ తీసుకుంటున్నారు. కాంగ్రె్‌సలో చేరే యోచన ఉన్న ఎమ్మెల్యేలు వీరిద్దరితో పాటు ఇతర కీలక నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. బీఆర్‌ఎ్‌సలో ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా నిధులు అందవని భావిస్తున్నారు. దీని బదులు అధికార పార్టీలో చేరి సౌకర్యంగా ఉండొచ్చన్న ఆలోచన చేస్తున్నారు.
Updated Date - Jun 07 , 2024 | 02:22 AM