ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని15 రోజుల్లోగా కూల్చేయండి..

ABN, Publish Date - Sep 19 , 2024 | 02:59 AM

బీఆర్‌ఎస్‌ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నల్లగొండలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణమని హైకోర్టు స్పష్టం చేసింది.

  • అనుమతి లేకుండా ఎలా నిర్మిస్తారు?

  • నల్లగొండలో పార్టీ ఆఫీసు అక్రమ కట్టడం

  • రూ.లక్ష జరిమానా చెల్లించండి: హైకోర్టు

  • సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తాం: కంచర్ల

  • చట్టం తనపని తాను చేస్తుంది: కోమటిరెడ్డి

హైదరాబాద్‌/నల్లగొండ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నల్లగొండలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం అక్రమ నిర్మాణమని హైకోర్టు స్పష్టం చేసింది. దాన్ని 15 రోజుల్లో కూల్చేయాలని ఆదేశించింది. మునిసిపాలిటీ అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపట్టినందుకు రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నల్లగొండ జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి నాలుగు వారాల్లో జమచేసి ఆధారాలు సమర్పించాలని తెలిపింది. ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా ఎకరం విస్తీర్ణంలో పార్టీ కార్యాలయం నిర్మించి.. ఆ తర్వాత భవన క్రమబద్ధీకరణ పథకం (బీఆర్‌ఎస్‌) కింద క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి అతి తక్కువ ధరకు భూములు కేటాయిస్తూ జీవో జారీచేసింది.


నల్లగొండ జిల్లాకు సంబంధించి నల్లగొండలోని సర్వే నంబర్‌ 1506లో కేటాయించిన ఎకరం భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా భవనం నిర్మించారు. దీన్ని క్రమబద్ధీకరించాలని దరఖాస్తు పెట్టుకోగా.. మునిసిపల్‌ కమిషనర్‌ తిరస్కరించారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసులు జారీచేశారు. కమిషనర్‌ నిర్ణయాన్ని, నోటీసులను సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.


సంబంధిత అధికారుల అనుమతి పొందకుండా నిర్మించి, తర్వాత క్రమబద్ధీకరణకు దరఖాస్తు పెట్టుకోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలు రూపొందించి.. తర్వాత వాటిని ఉల్లంఘిస్తామంటే కుదరదని తెలిపింది. సాధారణ పౌరులకైనా, బీఆర్‌ఎస్‌ పార్టీకి అయినా చట్టం ఒక్కటేనని స్పష్టంచేసింది. కనీసం జరిమానా నుంచైనా మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. బీఆర్‌ఎస్‌ పార్టీ దేశంలోనే అత్యంత ఆర్థిక సంపత్తి కలిగిన పార్టీ అని.. ఈ ఖర్చులు చెల్లించడం పెద్ద లెక్క కాదని వ్యాఖ్యానించింది.


  • సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తాం

హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్టీ కార్యాలయాలకూ అనుమతులు లేవని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాగా, ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇప్పుడు హైకోర్టు కూడా ఆదేశించడంతో భవనం కూల్చివేతపై మునిసిపాలిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కోర్టు తీర్పు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. హైకోర్టు తీర్పుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 02:59 AM

Advertising
Advertising